'బ్రహ్మాస్త్ర' (Brahmastra Movie)కు ప్రేక్షకుల నుంచి ఆశించిన రీతిలో స్పందన రాలేదు. హిందీ మీడియా నుంచి మూవీకి మంచి రివ్యూలు వచ్చాయి. తరణ్ ఆదర్శ్ వంటి ఒకరిద్దరు మినహా మిగతా వాళ్ళందరూ సినిమా బావుందన్నారు. అయితే... గ్రౌండ్ లెవల్‌లో రిపోర్ట్ వేరుగా ఉంది. సోషల్ మీడియాలో విపరీతమైన నెగిటివ్ టాక్ నడుస్తోంది. 'బ్రహ్మాస్త్ర' పరాజయం ఆ చిత్ర బృందం, సినిమా ఇండస్ట్రీపై మాత్రమే కాదు... షేర్ మార్కెట్ మీద కూడా ప్రభావం చూపించిందని బిజినెస్ వర్గాలు చెబుతున్నాయి.


సుమారు 400 కోట్ల రూపాయలతో 'బ్రహ్మాస్త్ర'ను రూపొందించారు. ఇప్పుడు అంత  డబ్బు తిరిగి వస్తుందా? లేదా? అనే విషయం పక్కన పెడితే... ఈ సినిమాకు పెట్టుబడి పెట్టిన పీవీఆర్, ఐనాక్స్ సంస్థలకు భారీ లాస్ వచ్చింది. 'బ్రహ్మాస్త్ర' ఫ్లాప్ కావడంతో ఇండియాలో అతిపెద్ద మల్టీప్లెక్స్ చైన్స్ అయినటువంటి ఈ రెండూ శుకవారం మార్కెట్ క్యాపిటలైజేషన్‌లో 800 కోట్లకు పైగా నష్టపోయినట్లు వ్యాపార వర్గాలు వెల్లడిస్తున్నాయి.


షేర్ మార్కెట్‌లో 'బ్రహ్మాస్త్ర' ఫ్లాప్ ప్రభావం స్పష్టంగా కనిపించింది. సినిమా టాక్ వచ్చిన తర్వాత పీవీఆర్, ఐనాక్స్ షేర్లలో తగ్గుదల కనిపించింది. సుమారు ఐదు శాతం తగ్గాయని తెలుస్తోంది. ఈ సినిమా విడుదలకు ముందు రెండు మల్టీప్లెక్స్‌ల‌ షేర్లు నాలుగు శాతం పెరిగినట్లు సమాచారం. 


'బ్రహ్మాస్త్ర' విడుదలకు ముందు సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ గురించి పీవీఆర్, ఐనాక్స్ సంస్థలు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో సమాచారం ఇస్తూ వచ్చాయి. ఎన్ని లక్షల టికెట్లు విక్రయించామనేది చెబుతూ... సినిమాపై హైప్ పెంచాయి. శుక్రవారం తొలి ఆట వరకూ ఆ హైప్ ఎంతో ఉపయోగపడింది. అయితే, ఆ తర్వాత మౌత్ టాక్ బలంగా పని చేసింది. అది వాళ్ళ బిజినెస్ మీద కూడా ప్రభావం చూపించింది. 


ఫ్లాపుల్లో ఉన్న హిందీ సినిమా ఇండస్ట్రీకి 'బ్రహ్మాస్త్ర' ఊపిరి పోస్తుందని చాలా మంది ఆశించారు. ఆ ఆశలపై సినిమా నీళ్లు చల్లింది. హిందీలో భారీ డిజాస్టర్లలో ఈ సినిమా చోటు దక్కించుకుంటుందని కొంత మంది వ్యాఖ్యానిస్తున్నారు. వాటిని పక్కన పెడితే... 'బ్రహ్మాస్త్ర' పరాజయం, పీవీఆర్ అండ్ ఐనాక్స్ నష్టాలపై 'ది కశ్మీర్ ఫైల్స్' దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి  స్పందించారు. స్టార్స్ మీద 70, 80 శాతం డబ్బులు వృథా చేసే ఏ ఇండస్ట్రీ కూడా సర్వైవ్ అవ్వదని ఆయన ట్వీట్ చేశారు.


Also Read : రాఘవేంద్రుడితో రామ సత్యనారాయణ 'శ్రీవల్లి కళ్యాణం'


ర‌ణ్‌బీర్‌ కపూర్ (Ranbir Kapoor), ఆలియా భట్ (Alia Bhatt) జంటగా నటించిన 'బ్రహ్మాస్త్ర'కు అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, అక్కినేని నాగార్జున, మౌనీ రాయ్, షారూఖ్ ఖాన్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఎస్.ఎస్. రాజమౌళి సమర్పణలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో సినిమా విడుదలైంది. తెలుగులో 'బ్రహ్మాస్త్రం'గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ కథను తెలుగు దర్శకులు, సంగీత దర్శకులకు ఇస్తే ఇంకా బాగా డీల్ చేసేవారని టాలీవుడ్ టాక్. 



Also Read : తెలుగులో టైటిల్ మార్చిన శింబు, గౌతమ్ మీనన్