Gali Janardhan Reddy got relief: కర్ణాటకలోని గంగావతి ఎమ్మెల్యేగా గాలి జనార్ధన్ రెడ్డి పదవి తాత్కలికంగా నిలబడింది. ఆయనపై వేసిన అనర్హతా వేటు చెల్లకుండా పోయే అవకాశం ఉంది. తెలంగాణ హైకోర్టు బుధవారం గాలి జనార్ధన్ రెడ్డికి ఒబులాపురం మైనింగ్ కంపెనీ (OMC) అక్రమ మైనింగ్ కేసులో సీబీఐ ప్రత్యేక కోర్టు విధించిన 7 సంవత్సరాల జైలు శిక్ష ను నిలిపివేసింది. బెయిల్ కూడా మంజూరు చేసింది. ఈ కేసులో మరో ముగ్గురు నిందితులు రాజగోపాల్, శ్రీనివాస రెడ్డి, మెహఫూజ్ అలీ ఖాన్‌లకు కూడా బెయిల్ మంజూరు చేశారు. దీంతో ఆయన జైలు నుంచి విడుదల కానున్నారు.
ఒబులాపురం మైనింగ్ కంపెనీ (OMC) కేసు 2007-2009 మధ్య కాలంలో అక్రమ మైనింగ్ ఆరోపణలపై సీబీఐ దర్యాప్తు చేసింది. జనార్ధన్ రెడ్డి, ఇతరులు మైనింగ్ లీజు సరిహద్దు గుర్తులను మార్చడం, కర్ణాటక-ఆంధ్రప్రదేశ్ సరిహద్దులోని బళ్లారి రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతంలో అక్రమంగా మైనింగ్ చేయడం వంటి నేరాలకు పాల్పడినట్లు కేసులు నమోదయ్యాయి. ఈ అక్రమ మైనింగ్ వ రూ. 884 కోట్ల నష్టం ప్రభుత్వ ఖజానాకు వాటిల్లినట్లు సీబీఐ ఆరోపించింది సీబీఐ 2011 డిసెంబర్‌లో మొదటి చార్జ్ షీట్ దాఖలు చేసింది, ఆ తర్వాత మూడు సప్లిమెంటరీ దాఖలు చేయబడ్డాయి. ఈ కేసు విచారణ సుమారు 14 సంవత్సరాల పాటు కొనసాగింది.
హైదరాబాద్‌లోని సీబీఐ ప్రత్యేక కోర్టు మే 6, 2025న జనార్ధన్ రెడ్డి మరియు ముగ్గురు ఇతర నిందితులను దోషులుగా తేల్చింది. వీరందరికీ 7 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించింది. తీర్పు వెలువడిన వెంటనే వారిని హైదరాబాద్‌లోని చంచల్‌గూడ సెంట్రల్ జైలుకు తరలించింది. ఈ శిక్ష కారణంగా, రెడ్డి గంగావతి నియోజకవర్గం నుండి శాసనసభ్యుడిగా అనర్హత వేటు పడింది. కర్ణాటక శాసనసభ మే 7, 2025న అధికారికంగా అనర్హతను నోటిఫై చేసింది, దీని ఫలితంగా గంగావతి సీటు ఖాళీ అయింది. రెడ్డి శాసనసభ్యత్వ అనర్హతను కూడా తాత్కాలికంగా నిలిపివేసింది.
గాలి జనార్ధన్ రెడ్డికి బెయిల్ షరతులు విధించారు. రూ. 10 లక్షల స్యూరిటీ బాండ్‌లు జమచేయాలి. పాస్‌పోర్ట్‌ను సరెండర్ చేయాలి. దేశం విడిచి వెళ్లకూడదు. న్యాయప్రక్రియలో జోక్యం చేసుకోకూడదని జస్టిస్ లక్ష్మణ్ ఆదేశించారు.
