Mahabharata Dharmaraj cyber fraud: క్లాసిక్ సీరియల్ 'మహాభారత్'లో ధర్మరాజు పాత్ర పోషించిన ప్రముఖ నటుడు గజేంద్ర చౌహాన్ ఆన్‌లైన్ మోసగాళ్ల బారిన పడి దాదాపు లక్ష రూపాయలు కోల్పోయారు. ముంబైలోని అంధేరీ వెస్ట్ లో నివసించే గజేంద్ర చౌహాన్ , డిసెంబర్ 10, 2025న ఫేస్‌బుక్ చూస్తుండగా ఒక ప్రకటన కనిపించింది. ప్రముఖ రిటైల్ సంస్థ D-Mart పేరుతో ఉన్న ఆ అడ్వర్టైజ్‌మెంట్‌లో డ్రై ఫ్రూట్స్ చాలా తక్కువ ధరలకే లభిస్తాయని పేర్కొన్నారు. ఆ ఆఫర్ నిజమేనని నమ్మిన ఆయన, అందులోని లింక్‌ను క్లిక్ చేసి ఆర్డర్ చేయడానికి ప్రయత్నించారు.
OTP ఎంటర్ చేయగానే రూ. 98,000 మాయం
ఆర్డర్ ప్రక్రియలో భాగంగా ఆయన మొబైల్‌కు ఒక OTP వచ్చింది. ఆ OTPని నమోదు చేసిన కొద్దిసేపటికే, ఆయన బ్యాంక్ ఖాతా నుండి రూ. 98,000 కట్ అయినట్లు మెసేజ్ రావడంతో గజేంద్ర చౌహాన్ షాక్‌కు గురయ్యారు. అది డీ-మార్ట్ పేరుతో ఉన్న నకిలీ ప్రకటన అని, తాను సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడ్డానని గ్రహించిన ఆయన వెంటనే ముంబైలోని ఓశివారా పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న ఓశివారా సైబర్ సెల్ అధికారులు వెంటనే రంగంలోకి దిగారు. మోసం జరిగిన వెంటనే ఫిర్యాదు చేయడాన్ని గోల్డెన్ అవర్ గా పరిగణిస్తారు.
పోలీసులు బ్యాంక్ స్టేట్‌మెంట్‌ను పరిశీలించగా, ఆ డబ్బు Razorpay ద్వారా Croma సంస్థకు బదిలీ అయినట్లు గుర్తించారు.వెంటనే Razorpay , Croma నోడల్ అధికారులతో ఈమెయిల్ ద్వారా సంప్రదింపులు జరిపి, ఆ లావాదేవీని 'హోల్డ్' చేయించారు. పోలీసుల వేగవంతమైన చర్యల వల్ల గజేంద్ర చౌహాన్ పోగొట్టుకున్న పూర్తి మొత్తం రూ. 98,000 తిరిగి ఆయన ఖాతాలోకి చేరింది.
తన సొమ్ము తిరిగి రావడంతో పోలీసులకు ధన్యవాదాలు తెలిపిన ఆయన, సామాన్య ప్రజలను ఉద్దేశించి ఒక కీలక సూచన చేశారు. సోషల్ మీడియాలో కనిపించే అసాధారణమైన ఆఫర్లు, భారీ డిస్కౌంట్లను చూసి మోసపోకండి. ఏదైనా అనుమానం వస్తే వెంటనే 1930 సైబర్ హెల్ప్‌లైన్ నంబర్‌కు కాల్ చేయండి లేదా దగ్గరలోని పోలీస్ స్టేషన్‌కు వెళ్లండి అని ఆయన కోరారు.