G20 summit 2022: భారత్‌కు జీ-20 అధ్యక్ష పగ్గాలు- ఇది ప్రతి భారతీయుడికి గర్వకారణం!

ABP Desam   |  Murali Krishna   |  16 Nov 2022 04:25 PM (IST)

G20 summit 2022: వచ్చే ఏడాది జరగనున్న జీ20 శిఖరాగ్ర సదస్సు అధ్యక్ష పగ్గాలను భారత్‌కు అప్పగించింది ఇండోనేసియా.

'ఇది ప్రతి భారతీయుడికి గర్వకారణం'- భారత్‌కు జీ-20 అధ్యక్ష పగ్గాలు

G20 summit 2022: ఇండోనేసియా బాలీలో జీ20 సదస్సు బుధవారం ముగిసింది. దీంతో 2023లో నిర్వహించనున్న జీ20 శిఖరాగ్ర సదస్సు అధ్యక్ష బాధ్యతలను భారత్‌కు ఇండోనేసియా అప్పగించింది. ఈ మేరకు ప్రస్తుత జీ20 సమావేశాల ముగింపు కార్యక్రమంలో ఇండోనేసియా అధ్యక్షుడు జోకో విడొడో సదస్సు బాధ్యతలను భారత ప్రధాని నరేంద్ర మోదీకి అప్పగించారు.

భారత్ నేతృత్వంలో

వచ్చే ఏడాది జరిగే జీ20 సమావేశాలకు భారత్ నేతృత్వం వహించనుంది. అధికారికంగా డిసెంబర్ 1 నుంచి జీ20 అధ్యక్ష బాధ్యతలు భారత్​ చేపట్టనుంది.

భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ఆర్థిక మందగమనం, పెరుగుతున్న ఆహారం, ఇంధన ధరలు, మహమ్మారి దీర్ఘకాలిక దుష్ప్రభావాలతో ప్రపంచం పట్టుకోల్పోతున్న సమయంలో భారత్ జీ-20 బాధ్యతలు తీసుకుంటోంది. ఇటువంటి సమయంలో ప్రపంచం జీ-20 వైపు ఆశతో చూస్తోంది. ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు అనే నినాదంతో వసుధైక కుటుంబం అనే భావనతో 2023లో జీ20 సదస్సును నిర్వహిస్తాం. జీ20 అధ్యక్ష పదవిని చేపట్టడం ప్రతి భారతీయుడికి గర్వకారణం.                                           -  ప్రధాని నరేంద్ర మోదీ

లోగో ఆవిష్కరణ

భారత జీ-20 లోగో, థీమ్, వెబ్‌సైట్‌ను ప్రధాని మోదీ నవంబర్ 8న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆవిష్కరించారు. డిసెంబర్ 1 నుంచి జీ-20కి భారత్ అధ్యక్షత వహిస్తుందని ఈ సందర్భంగా ప్రధాని మోదీ తెలిపారు. ఇది భారతదేశానికి ఒక చారిత్రక సందర్భం అన్నారు. లోగోలో ఉన్న తామర పువ్వు పౌరాణిక వారసత్వాన్ని గుర్తుగా మోదీ వివరించారు. 

జీ-20 అనేది ప్రపంచ జీడీపీలో 85% ఆర్థిక సామర్థ్యాన్ని కలిగి ఉన్న దేశాల సమూహం. ఇది ప్రపంచ వాణిజ్యంలో 75% ప్రాతినిధ్యం వహిస్తుంది. భారతదేశం ఇప్పుడు ఈ జీ-20 సమూహానికి నాయకత్వం వహించబోతోంది.

ప్రపంచంలో వర్గాలు ఉండకుండా ఒకే ఒక ప్రపంచం ఉండాలన్నదే భారత్‌ ప్రయత్నం. ఒకే సూర్యుడు, ఒకే ప్రపంచం, ఒకే గ్రిడ్ అనే మంత్రంతో ప్రపంచంలో పునరుత్పాదక ఇంధన విప్లవానికి భారత దేశం పిలుపు నిచ్చింది. ఒకే భూమి, ఒకే ఫ్యామిలీ, ఒకే భవిష్యత్‌  అనే మంత్రంతో ప్రపంచ ఆరోగ్యాన్ని బలోపేతం చేయడానికి ప్రచారాన్ని ప్రారంభించింది.                                                -    ప్రధాని నరేంద్ర మోదీ

Also Read: UK Visa: మోదీతో భేటీ తర్వాత- భారతీయులకు బంపర్ ఆఫర్ ఇచ్చిన రిషి సునక్!

Published at: 16 Nov 2022 04:17 PM (IST)
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.