Funeral Rites: ప్రపంచంలో ఎన్నెన్నో దేశాలు, ప్రాంతాలు ఉన్నాయి. ఒక్కో చోట ఒక్కో రకమైన పద్ధతులు ఉంటాయి. కేవలం ప్రాంతీయత ఆధారంగానే కాకుండా కులాలు, మతాల వారీగా కూడా ఒక్కో రకమైన పద్ధతులను ఆచరిస్తుంటారు. పుట్టుకలు, పెళ్లిళ్లు, చావుల్లో మనం ఈ తేడాలను ఎక్కువగా చూడొచ్చు. ముఖ్యంగా ఎవరైనా చనిపోయిన తర్వాత మాత్రం ఒక్కో చోట ఒక్కో విధమైన ఆచారాలను పాటిస్తారు. సాధారణంగా చాలా చోట్ల అంత్యక్రియల్లో మృతదేహాన్ని కాల్చడం, పాతిపెట్టడం లేదా జంతువుల ఆహారం కోసం వదిలివేయడం వంటి ఆచారం ఉంది. కానీ మనం ఇప్పుడు ఇంతకు ముందెన్నడూ కనీవినీ ఎరగని విషయాల గురించి తెలుసుకోబోతున్నాం. అవేంటంటే..?
శవాలను ముక్కలుగా కోస్తారు..!
మీడియా నివేదికల ప్రకారం.. టిబెట్‌లోని బౌద్ధమతం ప్రజలు మృతదేహాన్ని అంత్యక్రియల కోసం పర్వతంపైన నిర్మించిన శ్మశాన వాటికకు తీసుకు వెళ్తారు. అనంతరం అక్కడ ఉన్న కొంతమంది బౌద్ధ సన్యాసులు, లామాలు తమ ఆచారం ప్రకారం మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా చేస్తారు. ఆ తర్వాత చిన్న చిన్న ముక్కలను ఓ లిక్విడ్‌లో ముంచి రాబందులు, డేగలకు వదిలి వేస్తారు. మిగిలిన ఎముకలను పొడిగా తయారు చేసి బార్లీ పిండిలో కలిపి పక్షులకు ఆహారంగా వేస్తారు.
ఇలా మృతదేహాన్ని ముక్కలుగా చేసి పక్షులకు తినిపించడానికి చాలానే కారణాలు ఉన్నాయి. అయితే టిబెట్ చాలా ఎత్తులో ఉండడంతో ఇక్కడ చెట్లు ఎక్కువగా ఉండవు. దీంతో ఎవరైనా చనిపోయినప్పుడు వారి మృతదేహాలను కాల్చేందుకు కలప దొరకదు. దీంతో మృతదేహాన్ని కాల్చడానికి వీలు పడదు. అలాగే ఇక్కడంతా రాతి నేల కావడంతో.. మృతదేహాన్ని పూడ్చేందుకు గొయ్యి తవ్వడం కూడా చాలా కష్టం. అలాగే బౌద్దమతం ప్రకారం.. మృతదేహాన్ని అలంకరించాల్సి అవసరం లేదు. ఖననం చేసిన తర్వాత కూడా, కీటకాలు మాత్రమే మృతదేహాన్ని తింటాయి. అయితే మృతదేహాన్ని పక్షులకు ఆహారంగా చేయడం మంచిదని భావించి... ఇలా చేస్తున్నారు. అయితే దీన్ని బౌద్ధమతంలో 'స్వయం త్యాగం' అంటారు.
మృతదేహాలను సమాధి నుంచి మళ్లీ మళ్లీ తీస్తుంటారు..!
మడగాస్కర్ ఆఫ్రికా తూర్పు తీరంలో ఉంది. ఇక్కడ ఫమాదిహానా సంప్రదాయం ప్రకారం మృతదేహాన్ని పూడ్చి పెట్టిన తర్వాత ఎప్పటికప్పుడు బయటకు తీస్తుంటారు. ఇలా చేయడం వెనుక చనిపోయిన వారి ఆత్మకు విముక్తి లభించదని ఒక నమ్మకం. మృతదేహం అస్థిపంజరంగా మిగిలిపోగా.. దానిని సమాధి నుంచి బయటకు తీసి అక్కడే పండుగలు చేసుకుంటారు. ఆ తర్వాత మృతదేహాన్ని మళ్లీ అదే సమాధిలో పాతి పెడతారు.
మృతదేహం బూడిదతో సూప్ తయారీ..!
యానోమణి తెగ అమెజాన్ అడవులలో కనిపిస్తుంది. ఇక్కడ అంత్యక్రియలకు ఎండోకానిబాలిజం ఆచారం అవలంభిస్తారు. ఇందులో మృతదేహాన్ని ఆకులతో కప్పి ఇంటి లోపల ఉంచి ఒక నెల తర్వాత దానిని కాల్చి బూడిదను ఒక పాత్రలో ఉంచుతారు. మృతుడి కుటుంబ సభ్యులు ఆ బూడిదతో పులుసు తయారు చేసి తాగుతారు. ది గార్డియన్ నివేదిక ప్రకారం, ఇలా చేయడం వలనే చనిపోయిన వారికి ఆత్మకు శాంతి కలుగుతుందని ఇక్కడి వారి విశ్వాసం.