Free Bus Journey For Women: కాంగ్రెస్ ప్రభుత్వం నేటి నుంచి మహిళలకు ఉచితంగా బస్ ప్రయాణ సదుపాయాన్ని కల్పిస్తోంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇచ్చిన హామీల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం చాలా ప్రాధాన్యకమైంది. అందుకే తొలి కేబినెట్ సమావేశంలోనే దీనిపై నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో దీనికి తొలి ప్రాధాన్యత కల్పించారు రేవంత్ రెడ్డి.
మహలక్ష్మి పథకంలో భాగంగా తెలంగాణ ఆర్టీసీలోని ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్, సిటీ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. సోనియా గాంధీ పుట్టిన రోజు కావడంతో ఇవాల్టి నుంచి దీన్ని అమల్లోకి తీసుకొస్తున్నారు. మధ్యాహ్నం 1.30కి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు.
రాష్ట్రంలో మినీ పల్లెవెలుగు, పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సులు, హైదరాబాద్ సిటీలో తిరిగే ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ఈ పథకం వర్తిస్తుంది. ఇప్పటికే వీటిలో 45 శాతం మంది మహిళలు ప్రయాణిస్తున్నారు. దాదాపు రోజుకు 30 లక్షలకుపైగా మహిళలు ట్రావెల్ చేస్తున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి రాష్ట్రంలోని మహిళలు ఈ కేటగిరి బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయవచ్చు.
తెలంగాణ స్థానికత ఉండి తెలంగాణలో తిరిగే బస్‌లకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. దీనికి వారు ఆధార్ సహా ప్రభుత్వ గుర్తింపు కార్డు ఏదైనా చూపించవచ్చు. మొదటి వారం రోజులు అందరికీ ఫ్రీ ట్రావెలింగ్ వెసులుబాటు కల్పిస్తారు. తర్వాత అర్హులైన మహిళలకు ఉచిత బస్ ప్రయాణం కోసం మహలక్ష్మీకార్డులు అందజేస్తారు. తర్వాత నుంచి ఆ కార్డు చూపిస్తే బస్సులో కండక్టర్ జీరో టికెట్ జారీ చేస్తారు. దీని వల్ల రోజుకు ఎంత మంది ప్రయాణం చేస్తున్నారో క్లారిటీ వస్తుంది.
సరిహద్దు దాటిన బస్సులకు టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. తెలంగాణ బోర్డర్ దాటిన తర్వాత ఎంత టికెట్ అయితే అంత డబ్బులు చెల్లించాలి. మహిళలతోపాటు ట్రాన్స్ జెండర్స్‌కి కూడా ఉచిత బస్సు ఫెసిలిటీ కల్పిస్తున్నారు. ఈ పథకం వల్ల ఆర్టీసి 3 వేల కోట్ల వరకు నష్టం వాటిల్లబోతోంది. బస్సుల్లో ప్రయాణించే మహిళల సంఖ్య పెరగనుండటంతో ఈ నష్టం కాస్త పెరిగే అవకాశం కూడా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నష్టం మొత్తాన్ని ప్రభుత్వం తిరిగి ఆర్టీసీకి చెల్లించనుంది. కండక్టర్ ఇచ్చే జరో టికెట్ ఆధారంగా ప్రభుత్వానికి నివేదిక అందజేసి ఖర్చైన డబ్బులను తిరిగి జమ చేయించుకుంటుంది ఆర్టీసి.
ఆర్టీసీలో ఉచిత ప్రయాణంపై మార్గదర్శకాలు ఇవే..
బాలికలు, మహిళలు, ట్రాన్స్ జెండర్స్ అందరికీ రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత బస్సు ప్రయాణం వర్తిస్తుంది.
తెలంగాణ వ్యాప్తంగా మినీ పల్లెవెలుగు, పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్, హైదరాబాద్‌లో ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్ బస్సులలో ఉచితంగా ప్రయాణం చేయవచ్చు
తెలంగాణ నుంచి పొరుగు రాష్ట్రాలకు వెళ్లే బస్సులలో అయితే రాష్ట్ర సరిహద్దు వరకు ఉచితం, బార్డర్ నుంచి డెస్టినేషన్ వరకు మాత్రమే టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది
కిలోమీటర్ల పరిధి విషయంలో ఎలాంటి పరిమితుల్లేవు. తెలంగాణ పరిధిలో మాత్రమే ఉచిత ప్రయాణం. మహిళలతో పాటు బాలికలు, విద్యార్థినులు, థర్డ్ జెండర్ కు కూడా ఉచిత ప్రయాణం
హైదరాబాద్ లో ఆర్డినరీ, మెట్రో ఎక్స్ ప్రెస్ బస్సులలో ఉచితంగా ప్రయాణం చేయవచ్చు.
స్థానికత ధ్రువీకరణ కోసం గుర్తింపు కార్డులను ప్రయాణ సమయంలో కండక్టర్లకు చూపించాలి
ప్రయాణించే ప్రతి మహిళకు జీరో టికెట్ మంజూరు చేయనుంది ఆర్టీసీ.