Nijjar Killing: కెనడాలోని ఖలిస్థాన్ ఉగ్రవాది హర్‌దీప్ సింగ్ నిజ్జర్ హత్యతో సంబంధం ఉన్న మరో భారతీయుడిని అక్కడి పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటికే ఈ కేసులో ముగ్గురు అరెస్ట్ కాగా ఇప్పుడు నాలుగో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. 22 ఏళ్ల అమర్‌దీప్ సింగ్‌ని అరెస్ట్ చేసినట్టు కెనడా పోలీసులు వెల్లడించారు. ఫస్ట్ డిగ్రీ మర్డర్ కింద కేసు నమోదు చేశారు. మే 11వ తేదీన అమర్‌దీప్‌ని అరెస్ట్ చేశామని ఇన్వెస్టిగేషన్ టీమ్ తెలిపింది. ఇప్పటికే మరో కేసులో అరెస్టై పోలీసుల కస్టడీలో ఉన్నట్టు స్పష్టం చేసింది. హర్‌దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో విచారణ చాలా పకడ్బందీగా కొనసాగుతోందని అధికారులు వెల్లడించారు. ఈ హత్యతో సంబంధం ఉన్న అందరినీ గుర్తించి అరెస్ట్ చేస్తామని తెలిపారు. అయితే...నిజ్జర్ హత్యలో భారత్ హస్తం ఉందంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన ఆరోపణలు సంచలనమయ్యాయి. గతేడాది జూన్‌లో నిజ్జర్ హత్యకు గురయ్యారు. అప్పటి నుంచి భారత్, కెనడా మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. జస్టిన్ ట్రూడో చేసిన ఆరోపణలపై భారత్ తీవ్రంగా స్పందించింది. అవసరమైతే విచారణకు తాము సహకరిస్తామని తేల్చి చెప్పింది. అనవసరపు ఆరోపణలు చేయొద్దని మందలించింది. ఇప్పటి వరకూ ఈ కేసులో అరెస్ట్ అయిన వాళ్లంతా భారతీయులే కావడం కలకలం రేపుతోంది. తాము ముందే చెప్పామని కెనడా నేతలు స్పష్టం చేస్తున్నారు. ఇప్పటి వరకూ ఈ కేసులో అరెస్ట్ అయిన నలుగురు నిందితులూ విచారణలో కీలకం కానున్నారు.
గతేడాది జూన్‌లో హర్‌దీప్ సింగ్ నిజ్జర్ సుర్రేలోని గురుద్వార నుంచి బయటకు వచ్చిన సమయంలోనే దుండగులు వచ్చి కాల్పులు జరిపారు. ఆయనను కార్‌తో అడ్డగించి కాల్చేశారు. స్థానికులు గుర్తించి హాస్పిటల్‌కి తీసుకెళ్లినా అప్పటికే నిజ్జర్ మృతి చెందాడు. 2020లోనే భారత్ హర్‌దీప్ సింగ్ నిజ్జర్‌ని ఉగ్రవాదిగా ప్రకటించింది. ఇప్పుడు వరుస పెట్టి నిందితులు అరెస్ట్ అవుతుండడంపై భారత్ స్పందించింది. అన్ని వివరాలూ సేకరిస్తున్నట్టు వెల్లడించింది. అరెస్ట్ అయిన కరణ్ ప్రీత్, కమల్ ప్రీత్, కరణ్‌కి సంబంధించి పూర్తి సమచారం తెలుసుకుంటున్నామని చెప్పింది. అయితే...ఈ కేసుకి సంబంధించి అప్‌డేట్స్‌ని కెనడా ఇంకా ఇవ్వలేదని భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణ్‌ధీర్ జైస్వాల్ అన్నారు.
"కెనడాలో ఇలాంటి అతివాదులకు ఆశ్రయం కల్పిస్తున్నారని మేం ఎప్పటి నుంచో చెబుతూనే ఉన్నాం. మా దేశ రాయబారులనూ కొంతమంది బెదిరించారు. వాళ్ల విధులు వాళ్లు చేసుకోనివ్వకుండా అడ్డుకున్నారు. భారత్‌కి వ్యతిరేకంగా కొంత మంది అక్కడ కుట్రలు చేస్తున్నారని కూడా కెనడాని అలెర్ట్ చేశాం. ప్రస్తుతం ఈ అరెస్ట్‌లకు సంబంధించి పూర్తి వివరాలు సేకరించే పనిలో ఉన్నాం. కెనడా మాకు అధికారంగా ఎలాంటి సమాచారం ఇవ్వలేదు"
- రణ్‌ధీర్ జైస్వాల్, విదేశాంగ శాఖ ప్రతినిధి
Also Read: PoK Clashes: స్వతంత్ర హోదా కోసం PoK పౌరుల ఆందోళనలు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు