Corona Cases in Tirupati: తిరుపతి (Tirupati) నగరంలో 4 కరోనా కేసులు (Corona Cases) నమోదు కావడం తీవ్ర కలకలం రేపింది. జలుబు, దగ్గు, జ్వరం లక్షణాలతో ఆస్పత్రిలో చేరిన నలుగురికి అనుమానంతో కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ నిర్దారణ అయ్యింది. దీంతో వైద్యాధికారులు అప్రమత్తమయ్యారు. కరోనా సోకిన వారిలో అనంతపురానికి (Ananthapuram) చెందిన ఓ వ్యక్తి, బెంగుళూరుకు (Bengaluru) చెందిన ఓ మహిళ, తిరుపతికి చెందిన దంపతులు ఉన్నారు. అనంత, బెంగుళూరు నుంచి వచ్చిన రోగులను ఐడీహెచ్ వార్డుకు తరలించి చికిత్స అందిస్తున్నారు. అలాగే, నగరానికి చెందిన దంపతులను ఇంట్లోనే ఐసోలేషన్ లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. తిరుపతి రుయా ఆస్పత్రికి రాయలసీమ జిల్లాల నుంచి వచ్చే రోగులు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, బహిరంగ ప్రదేశాల్లో ఫిజికల్ డిస్టెన్స్ పాటించాలని సూచిస్తున్నారు. కొవిడ్ రోగులు చికిత్స పొందుతున్న వార్డుల వద్దకు బయటి వారిని పంపకుండా జాగ్రత్త వహిస్తున్నారు. చలి కాలం కావడంతో అప్రమత్తంగా ఉండాలని, జలుబు, జ్వరం, దగ్గు లక్షణాలుంటే వైద్యులను సంప్రదించాలని పేర్కొంటున్నారు. మరోవైపు, మళ్లీ కరోనా కేసులు నమోదు కావడంపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


అప్రమత్తంగా ఉండాలి


తిరుమల వెంకటేశుని దర్శించుకునేందుకు దేశం నలుమూలల నుంచి నిత్యం వేలాది మంది భక్తులు తిరుపతికి తరలివస్తుంటారు. ప్రస్తుతం వైకుంఠ ద్వార దర్శనాల నేపథ్యంలో రద్దీ ఎక్కువగా ఉంది. ఈ సమయంలో తిరుపతిలో కరోనా కేసులు వెలుగు చూడడం ఆందోళన కలిగిస్తోంది. తిరుపతికి వచ్చే భక్తులు కచ్చితంగా మాస్క్ ధరించేలా, జాగ్రత్తలు పాటించేలా తితిదే చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. రైల్వే స్టేషన్లు, బస్టాండ్లలో కరోనా పరీక్షలు నిర్వహించేలా చూడాలనే డిమాండ్స్ వినిపిస్తున్నాయి.


తెలంగాణలోనూ కరోనా


అటు, తెలంగాణలోనూ కరోనా చాప కింద నీరులా విస్తరిస్తోంది. ఇప్పటివరకూ గ్రేటర్ పరిధిలోనే ఎక్కువ పాజిటివ్ కేసులు వెలుగు చూడగా, ఇప్పుడు భూపాలపల్లి, కరీంనగర్, మంచిర్యాలలోనూ కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. అయితే, వీటిపై అధికారిక సమాచారం లేదు. ఇప్పటివరకూ 60కు పైగా యాక్టివ్ కేసులున్నాయని సమాచారం. గత 2 రోజులుగా కరోనా లెక్కలపై రాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారిక ప్రకటన చేయకపోవడంపై విమర్శలు చేస్తున్నారు. జేఎన్ 1 వేరియంట్ పై అప్రమత్తంగా ఉండాలని కేంద్రం హెచ్చరించినా, నిర్లక్ష్యం వహిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ప్రభుత్వమే కరోనా లెక్కలు విడుదల చేస్తుందని అధికారులు చెబుతున్నా, దానిపైనా స్పష్టత లేదు. అయితే, 2 రోజుల క్రితం 1,333 మందికి పరీక్షలు చేయగా 8 మందికి మాత్రమే పాజిటివ్ వచ్చినట్లు నిర్ధారణ అయ్యిందని బులెటిన్ లో తెలిపారు. ఆ రోజు నాటికి యాక్టివ్ కేసుల సంఖ్య 63గా పేర్కొంటూ, 2 కరోనా మరణాలు సంభవించాయని ప్రకటించి ఆపేశారు. అయితే, వింటర్ సీజన్ కావడంతో బాధితుల సంఖ్య ఇంకా ఎక్కువే ఉంటుందని వైద్య నిపుణులు భావిస్తున్నారు. కరోనా పట్ల ప్రజలను అప్రమత్తం చేయాలని, అంతా మాస్క్ ధరించేలా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.


దేశంలో కరోనా పరిస్థితి


గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 798 కరోనా కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రస్తుతానికి యాక్టివ్ కేసుల సంఖ్య 4,091కి పెరిగింది. ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. కేరళలో ఇద్దరు, మహారాష్ట్రలో ఒకరు, పుదుచ్చేరిలో ఒకరు మృతి చెందారు. మొత్తంగా దేశవ్యాప్తంగా కరోనా మృతుల సంఖ్య 5 లక్షల 33 వేలు దాటింది. ఇప్పటి వరకూ కొవిడ్ కొత్త వేరియంట్ కేసులు 157 వరకూ నమోదయ్యాయి. కేరళలో 78, గుజరాత్‌లో 34 నమోదైనట్టు ఇన్సకాగ్ ప్రకటించింది. ఇతర రాష్ట్రాల్లోనూ JN.1 వేరియంట్‌ అలజడి సృష్టిస్తోంది. గోవాలో 18, కర్ణాటకలో 8, మహారాష్ట్రలో 7, రాజస్థాన్‌లో 5, తమిళనాడులో 4, తెలంగాణలో 2 కేసులు నమోదయ్యాయి.


Also Read: Amrit Bharat Trains: రేపటి నుంచి పట్టాలెక్కనున్న అమృత్‌ భారత్‌ రైలు- ఏపీలోని ఈ స్టేషన్‌ల మీదుగా ట్రైన్