వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏపీ సీఎం అయినప్పటి నుంచి అమరావతి రైతుల విషయంలో పగపట్టినట్టు పని చేస్తున్నారని కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నేత సుజనా చౌదరి అన్నారు. సీఎం జగన్ చర్యలు వినాశనానికి దారి తీసేలా ఉన్నాయి. ఆర్5 పేరుతో పేదలకు సెంటు భూమి అని చెప్పి కార్యక్రమం చేపట్టారు. పేదలకు అమెరికాలో ఎకరాలు ఇస్తే ప్రయోజనం ఏంటని ప్రశ్నించారు. వాళ్లు అక్కడకు వెళ్లి ఏం చేసుకోగలరని ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
డీ సెంట్రలైజేషన్ అంటున్న జగన్ ప్రభుత్వం ఎక్కడి వారికి అక్కడే భూమలు ఎందుకు ఇవ్వడం లేదని సుజనా చౌదరి నిలదీశారు. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న పేదవారందరికీ అమరావతిలో ఇళ్ల స్థలాలు ఇవ్వగలరా, ఇది సాధ్యమా అని సుజనా చౌదరి అడిగారు. ల్యాండ్ డెవలప్‌మెంట్కు ఇస్తే ఓనర్‌కు ఇవ్వాల్సింది ఇవ్వకుండా డెవలపర్‌కి ఓనర్‌షిప్ రాదన్నారు. రైతుల వద్ద ల్యాండ్స్ తీసుకొని.. డెవలప్ చేస్తామని చెప్పారు. దాని పక్కనే రైతలకు ప్లాట్లు ఇస్తామన్నారు. ఇప్పుడు అలాంటివేమీ చేయకుండా చేయడం రైరా చట్టం ప్రకారం మోసమే అవుతుందన్నారు. ఇలా చాలా మంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు జైలుకు వెళ్లారని గుర్తు చేశారు. క్రిమినల్ యాక్ట్ ప్రకారం చూస్తే పైనాన్సియల్ ఫెల్యూర్, చట్టాన్ని ఉల్లంఘించడం రెండు నేరాలకు పాల్పడ్డారని ఆరోపించారు. రైతులు కంగారు పడాల్సిన పని లేదన్నారు.
దేశంలోనే అదిపెద్ద న్యాయవాదులను ఈ కోర్టులో వాదించడానికి తీసుకొచ్చామననారు. న్నాయస్థానాల్లో కచ్చితంగా న్యాయం జరుగుతుందని, రైతులు అధైర్య పడవద్దని సూచించారు. కచ్చితంగా రేపు వేరే ప్రభుత్వం వస్తే అమరావతి రైతులకు న్యాయం చేస్తామని.. ఇక్కడ ఇళ్ల పట్టాలు పొందిన లబ్ధిదారులకు వారి ఊరికి సమీపంలోనే భూములు ఇచ్చే కార్యక్రమం కూడా జరగబోతుందన్నారు సుజనా చౌదరి.
అమరావతి ఆర్5 జోన్ ఏర్పాటుపై నిరసన చేపట్టిన రైతులపై పోలీసుల చేస్తున్న దౌర్జన్యంపై ఆయన మండిపడ్డారు. త్వరలోనే న్యాయం జరుగుతుందని, అమరావతి రైతులు ఆందోళన చెందాల్సిన పని లేదని చెప్పారు. సోమవారం సుప్రీం కోర్టులో అతిపెద్ద న్యాయవాదులు మన పక్షాన వాదనలు వినిపిస్తారు, తప్పక న్యాయం జరుగుతుందన్నారు. రాజధాని అమరావతిని చంపేయాలన్న జగన్ ప్రభుత్వ కుట్రలు వీగిపోతాయన్నారు.
సుప్రీంకోర్టును ఆశ్రయించిన రైతులు
ఆర్- 5 జోన్‌పై అమరావతి రైతులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆర్-5 జోన్‌లో వేరే ప్రాంతాల వారికి ఇళ్ల స్థలాల కేటాయింపుపై ఏపీ హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధించాలని, రాష్ట్ర ప్రభుత్వ జీవోలను రద్దు చేయాలని కోరుతూ రైతులు సుప్రీంను పిటిషన్‌లో కోరారు. అమరావతి మాస్టర్ ప్లాన్‌కు విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం జీవోలు తీసుకొచ్చిందని రైతులు పేర్కొన్నారు. గతంలో హైకోర్టు ఉత్తర్వులు ఇవ్వలేదని తగిన ఉత్తర్వులు ఇవ్వాలని సర్వోన్నత న్యాయస్థానంలో దాఖలు చేసిన పిటిషన్‌ను రైతులు వెనక్కి తీసుకున్న విషయం తెలిసిందే. హైకోర్టు ఇచ్చే ఉత్తర్వుల ఆధారంగా మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివైస్ నేతృత్వంలోని ధర్మాసనం అవకాశం కల్పించింది. ఈ మేరకు రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వులను సవాలు చేస్తూ అమరావతి రైతులు పిటిషన్ దాఖలు చేశారు.
మధ్యంతర ఉత్తర్వులకు తిరస్కరించిన ఏపీ హైకోర్టు
అమరావతిలో ఆర్-5 జోన్ అంశంపై రైతులు దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది. ఇళ్ల పట్టాల పంపిణీ కోర్టు తీర్పునకు లోబడి ఉండాలన్న న్యాయస్థానం.. మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించింది. దీంతో రైతులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని నిర్ణయించుకున్నారు. మాస్టర్ ప్లాన్ మార్చడం చట్ట విరుద్ధమని ఇంతకు ముందు అమరావతిపై హైకోర్టు ఇచ్చిన తీర్పునకు విరుద్ధంగా ప్రభుత్వం ఆర్ 5 జోన్ ఏర్పాటు చేసి.. రాజధాని అవసరాల కోసమే తాము ఇచ్చిన భూముల్ని ఇతరులకు రాజకీయ కారణాలతో పంచుతున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.