Shivraj Patil is No More | కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ కేంద్ర హోం మంత్రి శివరాజ్ పాటిల్ చాకూర్కర్ కన్నుమూశారు. ఆయన వయస్సు 91 సంవత్సరాలు. శుక్రవారం ఉదయం 6:30 గంటలకు లాతూర్ లోని తన నివాసం "దేవవర్"లో శివరాజ్ పాటిల్ తుదిశ్వాస విడిచారు. చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇంటివద్దే చికిత్స పొందుతున్నారు. శివరాజ్ పాటిల్ చాకూర్కర్ లోక్ సభ స్పీకర్ గా పనిచేశారు. అనేక కేంద్ర మంత్రి పదవులను నిర్వహించారు. తన రాజకీయ జీవితంలో దేశం కోసం అనేక ప్రతిష్టాత్మక పదవులను నిర్వహించారు . దేశ రాజ్యాంగ ప్రక్రియలో చురుకైన పాత్ర పోషించారు.
లాతూర్ నుంచి 7 సార్లు ఎంపీగా..
శివరాజ్ పాటిల్ లాతూర్ లోని చాకూర్ కు చెందిన ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు .. లాతూర్ లోక్ సభ నియోజకవర్గం నుండి ఏడుసార్లు గెలిచారు. 2004లో లోక్ సభలో ఓడిపోయినప్పటికీ, రాజ్యసభ నుంచి హోం మంత్రి పదవిని మరియు కేంద్ర బాధ్యతలను స్వీకరించారు. కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఆయన మరణంపై సంతాపం వ్యక్తం చేశారు...వారి కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ ప్రభుత్వాలలో కీలక శాఖల బాధ్యతలు
శివరాజ్ పాటిల్ పేరు భారత రాజకీయాలలో ఒక ముఖ్యమైన . అనుభవజ్ఞుడైన వ్యక్తిగా గుర్తింపు పొందారాయన. ఆయన ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి సైన్స్ లో గ్రాడ్యుయేషన్, ముంబై విశ్వవిద్యాలయం నుంచి లా చదివారు. ఆయన 1980లో మొదటిసారిగా లాతూర్ నుంచి లోక్ సభకు ఎన్నికయ్యారు. 1999 వరకు వరుసగా ఏడు ఎన్నికల్లో గెలిచి లోక్ సభలో ప్రముఖ నాయకుడిగా ఎదిగారు. ఆయన ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ ప్రభుత్వాలలో కీలక శాఖల బాధ్యతలు నిర్వహించారు. ఆయన 1991 నుంచి 1996 వరకు లోక్ సభ స్పీకర్ గా పనిచేశారు. దేశ, విదేశాలలో జరిగిన అనేక పార్లమెంటరీ సమావేశాలలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించారు.
ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ పెద్ద బాధ్యత
శివరాజ్ పాటిల్ సోనియా గాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీలో కూడా ముఖ్యమైన బాధ్యతలు నిర్వహించారు. 2004లో ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ, నమ్మకంగా కేంద్ర హోం మంత్రి పదవిని ఇచ్చారు. అయితే, 2008 ముంబై ఉగ్రదాడుల తర్వాత, భద్రతా లోపానికి నైతిక బాధ్యత వహిస్తూ ఆయన తన పదవికి రాజీనామా చేశారు.