KCR Health Condition: హైదరాబాద్: తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ (BRS Chief KCR)కు సర్జరీ సక్సెస్ అయింది. సోమాజీగూడలోని యశోద హాస్పిటల్ వైద్యులు మాజీ సీఎం కేసీఆర్ కు హిప్ రిప్లేస్‌మెంట్ సర్జరీ విజయవంతంగా పూర్తి చేశారు. శుక్రవారం సాయంత్రం ప్రారంభమైన తుంటి ఎముక మార్పిడి సర్జరీ రాత్రికి పూర్తియింది. సర్జరీ పూర్తయిన అనంతరం కేసీఆర్ ను ఆపరేషన్ థియేటర్ నుంచి ఐసీయూకి తరలించారు. పార్టీ అధినేతకు సర్జరీ సక్సెస్ అయిందని తెలియగానే బీఆర్ఎస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. త్వరలోనే కేసీఆర్ కోలుకుని తమ మధ్యకు వస్తాడన్నారు. కేసీఆర్ సతీమణి శోభ కుమారుడు కేటీఆర్, కుమార్తె కవిత, హరీష్ రావు, సంతోష్ తదితరులు యశోద హాస్పిటల్ లో ఉండి కేసీఆర్ ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు డాక్టర్లను అడిగి తెలుసుకుంటున్నారు.
ఫాంహౌస్ లో జారిపడిన కేసీఆర్..
మాజీ సీఎం కేసీఆర్ ఎర్రవల్లిలోని ఫాంహౌస్ లో బాత్‌రూమ్‌లో కాలు జారిపడిపోయారు. దాంతో కేసీఆర్ నడుము భాగాన లైట్ క్రాక్ వచ్చినట్టు వైద్యులు చెబుతున్నారు. ఘటన జరిగిన వెంటనే ఆయన్ని హైదరాబాద్ లోని యశోద హాస్పిటల్‌కు తరలించారు. ప్రస్తుతం ఆయనకు యశోద వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అర్థరాత్రి రెండున్నర గంటల సమయంలో ఈ ఘటన జరిగింది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలైన తర్వాత సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ విడిచిపెట్టి నేరుగా ఫామ్‌హౌస్ చేరుకున్నారు. అప్పటి నుంచి అక్కడే ఉంటున్నారు. ఈ మధ్య కాలంలో చాలా మంది ప్రజలు, పార్టీ నాయకులు ఆయనతో సమావేశమవుతున్నారు. త్వరలోనే మంచిరోజులు వస్తాయని వారికి భరోసా ఇస్తున్నారు.
గురువారం నాడు ఎర్రవల్లి లోని కేసీఆర్ నివాసం జన సందోహంతో నిండిపోయింది. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు, ఉద్యోగ సంఘాల నేతలు, మేధావులు, కవులు, కళాకారులు, మహిళలు, యువకులు కేసీఆర్ ను కలిసినవారిలో ఉన్నారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన వారు తమ అభిమాన నేతను కలిసి కరచాలనం చేసి భుజం మీద చేతులు వేయించుకుని మరీ ఫోటోలు దిగారు. అభిమాన నేతతో సెల్ఫీలు తీసుకున్నారు.