Tdp Leaders Somireddy Chandramohan Reddy Deeksha Updates: నెల్లూరు జిల్లాలో అర్థరాత్రి పొలిటికల్ హైడ్రామా నడిచింది. మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దీక్షను పోలీసులు భగ్నం చేశారు. అర్థరాత్రి దాటాక 2 గంటల సమయంలో ఆయన దీక్ష చేస్తున్న ప్రాంతానికి చేరుకున్నారు పోలీసులు. ఆయన్ను దీక్షా శిబిరం నుంచి తరలించారు. ఇంటి వద్ద దించి వెళ్లిపోయారు. సోమిరెడ్డి దీక్ష భగ్నం కోసం పోలీసులు రావడంతో ఆయన అభిమానులు అడ్డుకున్నారు. దీంతో కాసేపు అక్కడ హడావిడి జరిగింది. చివరకు పోలీసులు పెద్ద సంఖ్యలో అక్కడకు వచ్చి సోమిరెడ్డిని తరలించారు.
ఈ ఘటనపై తెలుగుదేశం పార్టీ మండిపడింది. ఆ పార్టీ అధికారిక ట్విట్టర్ ఖాతా నుంచి ఘాటు ట్వీట్ వేశారు. "కాకాణిని అడ్డు పెట్టుకుని, జగన్ రెడ్డి అండ్ బ్యాచ్ చేస్తున్న మైనింగ్ మాఫియాపై మూడు రోజులుగా పోరాడుతున్న సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పై పోలీసుల జులం. తెల్లారి మైన్లను పరిశీలిస్తామని కలెక్టర్ చెప్పటంతో, రాత్రికి రాత్రి పోలీసులని దింపి, నిరసనను భగ్నం చేసి, మైన్‌లో ఉన్న 14 భారీ ప్రొక్లెయిన్లు, 15 డంపర్లతో పాటు అత్యంత ప్రమాదకరమైన పేలుడు పదార్ధాలను అక్కడి నుంచి తరలించేసిన జగన్ ముఠా." అంటూ టీడీపీ వేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఎందుకీ దీక్ష..?
నెల్లూరు జిల్లాలో క్వార్ట్జ్ విస్తృతంగా దొరుకుతుంది. సైదాపురం, పొదలకూరు, ఉదయగిరి ప్రాంతాల్లో క్వార్ట్జ్ నిక్షేపాలున్నాయి. విదేశాల్లో గిరాకీ పెరగడంతో.. దీన్ని తవ్వి తీస్తున్నారు, అక్రమంగా తరలిస్తున్నారు. వాస్తవానికి ఇదంతా గనుల శాఖ పర్యవేక్షణలో జరగాలి. గతంలో కొన్ని మైన్స్ కి అనుమతి ఉన్నా.. ఇప్పుడు గడువు తీరిపోయింది. క్వార్ట్జ్ గనుల్ని చాలామంది పట్టించుకోవడం మానేశారు. వృథాగా వదిలేశారు. ఇటీవల మళ్లీ గిరాకీ పెరగడంతో అనుమతులు లేకుండానే తవ్వి తీస్తున్నారు. ప్రభుత్వ, అటవీ భూములను యథేచ్ఛగా తవ్వేస్తున్నారు. ప్రభుత్వానికి మాత్రం రాయల్టీ చెల్లించడంలేదు. దీనిపై టీడీపీ కొన్నిరోజులుగా పోరాటం చేస్తోంది. ఈ పోరాటంలో భాగంగానే ఇటీవల నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, వెంకటగిరి మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ క్వారీల వద్దకు వెళ్లారు. కొన్ని వాహనాలను పట్టుకుని అధికారులకు అప్పగించారు. రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా వారు తాత్సారం చేశారు. చివరకు ఈ సమస్యను రాష్ట్రవ్యాప్తంగా హైలైట్ చేయాలనే ఉద్దేశంతో మాజీ మంత్రి సోమిరెడ్డి దీక్షకు దిగారు. మూడు రోజులుగా ఆయన క్వారీ వద్దే దీక్ష చేపట్టి అక్కడే నిద్రిస్తున్నారు. ఈ దీక్ష భగ్నం చేశారు పోలీసులు.
నాయకుల అండదండలతో..
సైదాపురం మండలంలో వెంకటగిరి, నెల్లూరుకి చెందిన వైసీపీ నేతలు, పొదలకూరులో గూడూరు నియోజకవర్గానికి చెందిన వైసీపీ నాయకులు క్వార్ట్జ్ ని అక్రమంగా తరలిస్తున్నారనే ఆరోపణలున్నాయి. అన్నిటికీ మించి మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి చొరవతోనే ఈ వ్యవహారం అంతా జరుగుతోందని అంటున్నారు. ఆయనపై తీవ్ర ఆరోపణలున్నా కాకాణి ఎప్పుడూ స్పందించలేదు, ఇటు క్వార్ట్జ్ తరలింపు కూడా ఆగలేదు. అధికారులను కలసి స్పందన కార్యక్రమంలో టీడీపీ నేతలు ఫిర్యాదు చేయడంతో కలెక్టర్ ఈ క్వారీల సందర్శనకు వస్తానని హామీ ఇచ్చారు. అయితే ఆ లోగా పోలీసులు అక్కడ దీక్ష చేస్తున్న సోమిరెడ్డిని తరలించడం విశేషం.