Jagadish Reddy Comments On Congress Six Guarantees : తెలంగాణ కొత్త ప్రభుత్వం కొలువుదీరి వారం రోజులైనా కాలేదు. అప్పుడే రాజకీయం మొదలైపోయింది. ప్రభుత్వంపై ప్రధాన ప్రతిపక్షనేతలు విరుచుకుపడుతున్నారు. లేనిపోని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిందని ఆరోపిస్తున్నారు. తాజాగా మాజీ మంత్రి జగదీష్‌ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 


ఇచ్చిన హామీలు అమలు చేసిన చరిత్ర కాంగ్రెస్‌కు లేదన్నారు జగదీష్ రెడ్డి. ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయడం అంత ఈజీ కాదంటున్నారు. ఆరు గ్యారంటీలు 90 రోజులు కాదు కాద 900 రోజులైనా అమలు చేయలేరని సెటైర్లు వేస్తున్నారు. డిసెంబర్‌ 9 నాటికి రైతు బంధుతోపాటు రుణమాఫీ అమలు చేస్తామని చెప్పిన నేతలు ఇప్పటి వరకు వాటిపై స్పష్టత ఇవ్వలేదని అన్నారు. 


మరోవైపు విద్యుత్‌పై వస్తున్న విమర్శలపై కూడా జగదీష్‌ రెడ్డి స్పందించారు. విద్యుత్‌లో చాలా అవకతవకలు జరిగాయంటున్న వస్తున్న ఆరోపణలపై ఎలాంటి విచారణకైనా సిద్ధమన్నారు. అసెంబ్లీలో ఈ విషయాన్ని తానే ప్రస్తావిస్తారని పూర్తిస్థాయి చర్చకు పట్టుబడతామన్నారాయన. విద్యుత్‌ సంస్థల్లో అప్పులతోపాటు ఆస్తులు కూడా పెరిగిన విషయాన్ని గుర్తుంచుకోవాలని ప్రభుత్వానికి సూచించారు. 
 


పంచాయతీ, పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చూపుదాం: హరీష్‌ 
అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన కేడర్‌ను ఉత్సాహపరించేందుకు బీఆర్‌ఎస్‌ నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ఓటమితో కుంగిపోవద్దని చెబుతున్నారు. వచ్చే పంచాయతీ, పార్లమెంట్‌ ఎన్నికలలో గట్టిగా కొట్లాడాలని సూచిస్తున్నారు. సంగారెడ్డిలో జరిగిన బీఆర్‌ఎస్‌ కృతజ్ఞత సభలో పాల్గొన్న మాజీ మంత్రి సంగారెడ్డి విజయాన్ని అందించిన వారికి ధన్యవాదాలు చెప్పారు. 


అధికారంలో ఉన్న లీడర్లు బీఆర్‌ఎస్ పార్టీ నేతల మానసిక స్థైర్యాన్ని దెబ్బ తీసేందుకు ప్రయత్నాలు చేస్తారని వాటిని పట్టించుకోవద్దని సూచించారు హరీష్‌. బీఆర్‌ఎస్‌ పార్టీకి ఇలాంటివి ఆది నుంచి అలవాటే అన్నారు. అసలు ఎప్పుడూ పదవుల కోసం ప్రయత్నాలు చేయలేదని ప్రజల కోసమే పని చేశామన్నారు. ఇప్పుడు అదే మాదిరిగా తెలంగాణ ప్రజల కోసం పని చేద్దామని పిలుపునిచ్చారు. అధికారంలో ఉన్నా లేకపోయినా బీఆర్‌ఎస్‌ ఎప్పుడూ ప్రజాపక్షమే అన్నారు. 


కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అవకాశం ఇచ్చారని వాళ్లకు సహకరిద్దామన్నారు హరీష్‌రావు. వారు చేసిన తప్పులు ఎత్తి చూపుదామని ప్రజల తరఫున ప్రశ్నిద్దామన్నారు. అలాంటవి లేకుండా బీఆర్‌ఎస్‌ కంటే మంచి పాలన అందివ్వాలని కోరుకుందామన్నారు హరీష్‌