Former Kerala CM VS Achuthanandan Passes Away: కేరళ మాజీ ముఖ్యమంత్రి , కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) దిగ్గజం వి.ఎస్.అచ్యుతానందన్ 2025 జులై 21న సోమవారం తిరువనంతపురంలోని ప్రైవేట్ ఆసుపత్రిలో కన్ను మూశారు. ఆయన వయసు 101 సంవత్సరాలు. జూన్ 23, 2025న కార్డియాక్ అరెస్ట్ కారణంగా ఆసుపత్రిలో చేరారు. తర్వాత ఆయన ఆరోగ్యం క్షీణించింది. వెంటిలేటర్ సపోర్ట్‌పై ఉంచి ట్రీట్ మెంట్ ఇచ్చినా ప్రయోజనం లేకపోయింది. బ్లడ్ ప్రెషర్, కిడ్నీ పనితీరును మెరుగుపరచడానికి వైద్యులు ట్రీట్‌మెంట్ చేసినాప్రయోజనం లేకపోయింది.
కేరళ రాజకీయాల్లో అత్యంత సీనియర్, దిగ్గజ నేత అయిన అచ్యుతానందన్ 2019 నుంచి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. వి.ఎస్. అచ్యుతానందన్ 1923 అక్టోబర్ 20న అలప్పుజాలో వ్యవసాయ కార్మిక కుటుంబంలో జన్మించారు. ఆయన నాలుగేళ్ల వయసులో తల్లిని , 11 ఏళ్ల వయసులో తండ్రిని కోల్పోయారు, దీని వల్ల ఏడవ తరగతి తర్వాత చదువును ఆపివేశారు. ఆయన తన అన్న వద్ద టైలరింగ్ షాప్‌లో, తర్వాత కోయిర్ ఫ్యాక్టరీలో పనిచేశారు. 1938లో ట్రావన్‌కోర్ స్టేట్ కాంగ్రెస్‌లో చేరి, 1940లో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా సభ్యుడయ్యారు. 1946లో పున్నప్రా-వాయలార్ తిరుగుబాటులో పాల్గొన్నారు, ఇందులో ఆయన అరెస్టయ్యారు. ఓ సారి పోలీసుల హింసలో ఆయన చనిపోయారని అనుకున్నారు. కానీ మరో ఖైదీ గుర్తించి వైద్యం అందించేలా చేయడంతో బతికారని చెబుతారు.
1964లో CPI చీరిపోయింది. CPI(M)గా ఏర్పాటు అయింది. ఈ స్థాపనలో 32 మంది నాయకులలో ఒకరిగా అచ్యుతానందన్ ఉన్నారు. సీపీఎంను స్థాపించిన వారిలో ఇప్పటి వరకూ ఆయన ఒక్కరే ఉన్నారు. ఇప్పుడు ఆయన కూడా కన్నుమూశారు. 2006లో మలంపుజా నియోజకవర్గం నుండి గెలిచి, 82 ఏళ్ల వయసులో కేరళ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. భారతదేశంలో అత్యంత వయోవృద్ధ ముఖ్యమంత్రిగా రికార్డు సృష్టించారు. 1980-1992 మధ్య కేరళ CPI(M) రాష్ట్ర కార్యదర్శిగా, 1985-2009 మధ్య పొలిట్‌బ్యూరో సభ్యుడిగా పనిచేశారు. 2009లో సెంట్రల్ కమిటీ సభ్యుడయ్యారు.
1991-1996, 2001-2006, 2011-2016లో మూడు సార్లు కేరళ శాసనసభలో ప్రతిపక్ష నాయకుడిగా 15 సంవత్సరాలు వ్యవహరించారు. పాలనా కాలంలో సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. చట్టవిరుద్ధ లాటరీ కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకున్నారు. రాష్ట్ర పబ్లిక్ ఎడ్యుకేషన్ సిస్టమ్‌లో ఫ్రీ సాఫ్ట్‌వేర్‌ను ప్రోత్సహించారు. లింగ సమానత్వం, ట్రాన్స్‌జెండర్ హక్కుల కోసం పోరాడారు.
కామ్రేడ్ వీఎస్‌గా అందరూ అభిమానంగా పిలుచుకునే అచ్యుతానందన్ జీవనశైలి, రైతులు, కార్మికుల హక్కుల కోసం పోరాటంతో జనాల్లో గొప్ప ఆదరణ పొందారు. ఆయన ప్రసంగ శైలి మలయాళీ గ్రామీణ యాస, వ్యంగ్యం, హాస్యంతో నిండి ఉండేది. ఆయన పార్దీవదేహాన్ని న అలప్పుజాకు తరలించారు, అంత్యక్రియలు బుధవారం జరుగుతాయని కుటుంబసభ్యులు ప్రకటించారు.