Foreign Portfolio Investors: స్టాక్ మార్కెట్లకు గుడ్‌న్యూస్. ఏడాది కాలంగా ఇండియన్ ఈక్విటీ మార్కెట్ల నుంచి లక్ష కోట్లకు పైగా సంపదను పట్టుకెళ్లిన ఫారిన్ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (FPIs), పెట్టుబడులతో మళ్లీ తిరిగి వస్తున్నారు.
సెప్టెంబర్ నెలలో నికర అమ్మకందార్లుగా మిగిలిన FPIs, అక్టోబర్‌లో నికర కొనుగోలుదార్లుగా మారారు. సెప్టెంబరులో రూ.13,405 కోట్ల (1.6 బిలియన్ డాలర్లు) విలువైన షేర్లను నికరంగా అమ్మారు. దీనికి వ్యతిరేకంగా అక్టోబర్‌లో రూ. 8,430 కోట్ల (1 బిలియన్ డాలర్లు) విలువైన షేర్లను కొనుగోలు చేశారు.
గత నాలుగు నెలల్లో మూడు నెలలు విదేశీ సంస్థల నుంచి సానుకూల ప్రవాహాలను చూశాయి. FPIల పెట్టుబడులు పెరగడంతో దేశీయ మార్కెట్లు తాజా ఆల్ టైమ్ గరిష్టాల వైపు వెళ్తున్నాయి. బెంచ్‌మార్క్ ఇండెక్స్‌లయిన BSE సెన్సెక్స్, NSE నిఫ్టీలు 2021 అక్టోబర్‌లో నమోదు చేసిన జీవిత కాల రికార్డు గరిష్టాల వైపు పరుగులు పెడుతున్నాయి. ఆ రికార్డ్ స్థాయులకు ఇప్పుడు 2 శాతం కంటే తక్కువ దూరంలోనే ఉన్నాయి. మరొక ప్రోత్సాహకం వస్తే.. ప్రస్తుత రికార్డ్ స్థాయులను దాటి, కొత్త జీవిత కాల గరిష్టాలను సృష్టించే ఉత్సాహం ఈ హెడ్‌లైన్ సూచీల్లో కనిపిస్తోంది.
జులై నుంచి ఆశాజనకం
2021 అక్టోబర్ - 2022 జూన్ మధ్య, ఇండియన్ ఈక్విటీ మార్కెట్లలో రూ. 2.46 లక్షల కోట్ల విలువైన షేర్లను విదేశీ మదుపరులు విక్రయించారు. 2022 జులై నుంచి FPI ఫ్లోస్ ట్రెండ్ రివర్స్ అయింది. ఈ నెలలో దాదాపు రూ. 5,000 కోట్ల నికర పెట్టుబడులను ఇండియాలోకి తీసుకొచ్చారు. ఆగస్టులో రూ. 51,200 కోట్ల విలువైన షేర్లు కొన్నారు.
యూఎస్ ఫెడ్ నిర్ణయం
ప్రస్తుతం అమెరికన్ కేంద్ర బ్యాంక్ అయిన ఫెడరల్ రిజర్వ్ సమావేశం జరుగుతోంది. బుధవారం రాత్రి రేట్ల పెంపు నిర్ణయం వెలువడుతుంది. రేట్ల పెంపుపై యూఎస్ ఫెడ్ కఠినంగా ఉండకపోవచ్చన్నది అంచనా. అంటే, బాండ్ ఈల్డ్స్ తగ్గే అవకాశాశం ఉంది. ఈ అంచనాలతోనే అమెరికన్, యూరోపియన్ ఈక్విటీ మార్కెట్లలో ఆశాజనక ర్యాలీ కొనసాగుతోంది. అభివృద్ధి చెందిన దేశాల్లో బాండ్ ఫలాలు కొంత మృదువుగా మారుతుండడం వల్ల విదేశీ పెట్టుబడిదారులు భారతదేశానికి తిరిగి వస్తున్నారు.
సెప్టెంబర్‌లో భారీ అమ్మకాల తర్వాత, US & యూరోపియన్ మార్కెట్లు అక్టోబర్‌లో లాభపడ్డాయి. అక్టోబర్‌లో, S&P-500 7.9 శాతం, యూరో Stoxx-50 9 శాతం పెరిగాయి. వడ్డీ రేట్ల పెంపులో గ్లోబల్ సెంట్రల్ బ్యాంకుల దూకుడు ముగింపు దశకు చేరుకుందన్న అంచనాలతో ఈ మార్కెట్లు రాణించాయి.
US సెంట్రల్ బ్యాంక్ వరుసగా నాలుగోసారి (ప్రస్తుత సమావేశం - నవంబర్) వడ్డీ రేట్లను 75 బేసిస్ పాయింట్లు (bps) పెంచుతుందన్నది మార్కెట్ పండితుల అంచనా. ఆ తర్వాత డిసెంబర్‌లో 50 bps, వచ్చే ఏడాది మొదటి త్రైమాసికంలో మరో 25 bps పెంపు ఉంటుందని, తర్వాత ఇక పెంపు ఉండకపోవచ్చని భావిస్తున్నారు. ఈ అంచనాలకు భిన్నంగా ఫలితాలు ఉంటే మార్కెట్లలో మరో తిరోగమనం తప్పకపోవచ్చు.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.