Arvind Kejriwal Arrest: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్‌తో ఒక్కసారిగా రాజకీయాల్లో అలజడి మొదలైంది. సరిగ్గా లోక్‌సభ ఎన్నికల ముందు ఈ అరెస్ట్ జరగడం మరింత కీలకంగా మారింది. అయితే...ఈ అరెస్ట్ దేశీయ మీడియాలోనే కాకుండా అంతర్జాతీయ మీడియాలోనూ హెడ్‌లైన్‌గా మారింది. అమెరికాకి చెందిన న్యూస్ ఆర్గనైజేషన్ The Washington Post ఈ వార్తని కవర్ చేసింది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరెస్ట్ అయ్యారని చెప్పడమే కాకుండా ప్రతిపక్షాలపై దాడులు కొనసాగుతున్నాయంటూ ప్రస్తావించింది. మోదీ ప్రభుత్వం కావాలనే కుట్ర చేసి అరెస్ట్ చేయించిందంటూ ఆప్ నేతలు ఆరోపిస్తున్నారని ఆ వార్తలో వెల్లడించింది.
"లిక్కర్ స్కామ్ కేసులో కేజ్రీవాల్ పాత్ర ఏంటన్నది ఇంకా స్పష్టత రాలేదు. తాను ఏ తప్పు చేయలేదని ఆయన ఇప్పటికే తేల్చి చెప్పారు. మోదీ ప్రభుత్వం ప్రతిపక్షాలని అణిచివేసేందుకు కొద్ది నెలలుగా కుట్ర చేస్తున్నారని ఆయా పార్టీలు ఆరోపిస్తున్నాయి. రాజకీయ ప్రత్యర్థులను పక్కన పెట్టేందుకు దర్యాప్తు సంస్థల్ని పావుగా వాడుకుంటున్నారని చెబుతున్నాయి. ఎంతో కీలకమైన లోక్‌సభ ఎన్నికల ముందు ఇలా ఒత్తిడికి గురి చేయడం, అరెస్ట్ చేయడం లాంటి చర్యలతో బెదిరింపులకు పాల్పడుతోందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి"
- వాషింగ్టన్ పోస్ట్‌లోని ఆర్టికల్
ఇక బ్రిటీష్ బ్రాడ్‌కాస్టర్ BBC కూడా కేజ్రీవాల్ అరెస్ట్ వార్తని కవర్ చేసింది. అవినీతి ఆరోపణలతో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యారని వెల్లడించింది. కేజ్రీవాల్‌కి భయపడే మోదీ ఇదంతా చేస్తున్నారంటూ ఆప్ నేతలు చేసిన ఆరోపణల్ని ఈ వార్తలో ప్రస్తావించింది. కేజ్రీవాల్‌ని అడ్డుకున్నా....మంచి చేయాలన్న ఆయన ఆలోచనల్ని మాత్రం అడ్డుకోలేరని ఆప్ నేతలు చెప్పినట్టు ఇందులో పేర్కొంది. అమెరికాకి చెందిన మరో వార్తా సంస్థ New York Times (NYT)లోనూ కేజ్రీవాల్ అరెస్ట్ వార్త పబ్లిష్ అయింది. ఎన్నికలు దగ్గర పడే కొద్దీ తమను మోదీ ప్రభుత్వం ఇలా ఇబ్బంది పెడుతోందంటూ ప్రతిపక్షాలు చేసిన వ్యాఖ్యల్ని ప్రస్తావిస్తూ వార్త రాసింది.