Nepal News: నేపాల్‌లో వరుణ బీభత్స కొనసాగుతోంది. శుక్రవారం నుంచి భారీ వర్షాలకు ఆకస్మిక వరదలు సంభవించాయి. వీటికి తోడు కొండచరియలు కూడా విరిగి పడడంతో 170 మందికి పైగా మృత్యువాత పడ్డారు. మరో 42 మంది ఆచూకీ తెలియరాలేదని నేపాల్ హోం మంత్రి శాఖ వెల్లడించింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో సైన్యం సహాయక చర్యలు కొనసాగిస్తోంది.
నాలుగు రోజులుగా వరదల్లోనే సగం నేపాల్:
అతి భారీ వర్షాల కారణంగా నేపాల్‌లో సంభించిన ఆకస్మిక వరదలు సహా అనేక ప్రాంతాల్లో కొండ చరియలు విరిగి పడి 170 మందికి పైగా మృత్యువాత పడ్డారు. మరో 42 మంది గల్లంతవగా 111 మందికి పైగా తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతన్నారు. ఈస్ట్రన్ నేపాల్ సహా సెంట్రల్ నేపాల్‌లో వరద ప్రభావం ఎక్కువగా ఉంది. ఈ ప్రాంతాలన్నీ శుక్రవారం నుంచి భారీ వరదల్లోనే మగ్గుతున్నాయి. ప్రభావిత ప్రాంతాల్లో సైన్యం ముమ్మరంగా సహాయ చర్యలు చేపడుతోంది. దాదాపు 162 మందిని హెలికాప్టర్‌ల సాయంతో ఎయిర్ లిఫ్ట్ చేసినట్లు నేపాల్ హోంశాఖ పేర్కొంది. నేపాల్ సైన్యంతో పాటు పోలీసు శాఖ దాదాపు 4 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు చేరవేసినట్లు తెలిపింది. శిబిరాల్లో తలదాచుకున్న వారికి అవసరమైన రేషన్, మంచినీళ్లు అందిస్తున్నట్లు చెప్పింది. కాఠ్మాండు శివార్లలోని బల్ఖు ప్రాంతంలో దాదాపు 400 మందికి ఆహార పొట్లాల పంపిణీ జరిగింది.
గడచిన 45 ఏళ్లలోనే అతి పెద్ద వరదలు:
వరదలతో పాటు కొండచరియలు విరిగిపడి శనివారం నుంచి నేషనల్ హైవేస్‌పై రాకపోకలు నిలిచిపోయినట్లు అధికారులు తెలిపారు. కొండచరియలు విరిగిపడిన ప్రాంతాల్లో ట్రాఫిక్ నిలిచిపోయి వందలాది మంది రోడ్లపై ఉండిపోయారు. వారికి సాయం చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు నేపాల్ హోంశాఖ అధికార ప్రతినిధి ఫోక్రియాల్ తెలిపారు. కాఠ్మాండ్‌ను ఇతర ప్రాంతాలకు కలిపే ప్రధాన రహదారి అయన త్రిభువన్ రోడ్‌పై రాకపోకలు మొదలయ్యాయి. వరదల కారణంగా ఇప్పటి వరకూ అందిన సమాచారం మేరకు దాదాపు 322కి పైగా ఇళ్లు ధ్వంసం అయ్యాయని, 16 వంతెనలు దెబ్బతిన్నయని ఫోక్రియాల్ చెప్పారు. కాఠ్మాండ్ లోయలో గడచిన 45 ఏళ్లలో ఎన్నడూ ఇలాంటి వరదలు చూడలేదని బాధితూలు చెబుతున్నారు.
కాఠ్మాండ్‌లోని బాగమతి నది ప్రమాదకర స్థాయిని దాటి ఉగ్రనదిగా మారింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీఢనం కారణంగానే నేపాల్లో ఈ భారీ వర్షాలు వరదలు వస్తున్నట్లు నేపాల్ వాతావరణ శాఖ వెల్లడించింది. పర్యావరణంలో మార్పులు కారణంగా మొత్తం ఆసియా ఖండంలోనే వర్షాకాల సమయంలో మార్పులు చోటుచేసుకున్నాయని పర్యావరణ వేత్తలు, సైంటిస్టులు చెబుతున్నారు. ఈ ప్రభావం జనజీవనంపై స్పష్టంగా కనిపిస్తోందని అంటున్నారు. వరదల కారణంగా ఎటూ వెళ్లలేక వేలాది మంది ప్రయాణికులు రైల్వే స్టేషన్లలో, బస్టాండ్‌లలో, హైవేలపై నిలిచి పోయారని అధికారులు తెలిపారు. కాఠ్మాండు పరిసర ప్రాంతాల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉందని చెప్పారు. మఖ్వాన్‌పూర్‌లోని నేపాల్ ఫుట్‌బాల్ అసోసియేషన్ సమీపంలో కొండచరియలు విరిగి పడి ఆరుగురు ఫుట్ బాల్ ప్లేయర్లు కూడా చనిపోయారని ఆల్ నేపాల్ ఫుట్‌బాల్ అసోసియేషన్ ప్రకటించింది. ఇంకొంత మంది వరదల్లో కొట్టుకు పోయారని వారి కోసం గాలింపు కొనసాగుతోందని తెలిపారు. మంగళవారం వరకు నెపాల్‌లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించగా మున్ముందు వరదల కారణంగా మరిన్ని ఇబ్బందులు ఎదురు అవుతాయని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.