Rahul Gandhi on 5 Guarantees:
ప్రమాణ స్వీకారం..
కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్దరామయ్య, ఉప ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి పలువురు కీలక నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. మరి కొద్ది గంటల్లోనే కేబినెట్ మీటింగ్ జరుగుతుందని వెల్లడించారు. కర్ణాటక ఓటర్లు విద్వేషానికి, అవినీతికి స్వస్తి పలికారని అన్నారు. తాము ఎప్పుడూ అబద్ధపు హామీలు ఇవ్వలేదని తేల్చి చెప్పారు.
"నేను ముందే చెప్పాను. మేం ఎప్పుడూ అబద్ధపు హామీలు ఇవ్వం అని. ఏం చెప్పామో అది కచ్చితంగా చేసి తీరతాం. వెంటనే తొలి కేబినెట్ సమావేశం ఏర్పాటు చేస్తాం. ఆ సమావేశంలోనే 5 హామీలపై చర్చిస్తాం. అవి త్వరలోనే చట్టాలుగా మారతాయి. దళితులు, వెనక బడిన వర్గాలు, మైనార్టీలు అందరూ కలిసి మమ్మల్ని గెలిపించారు. నా పాదయాత్రలోనే చెప్పిందే మళ్లీ చెబుతున్నాను. విద్వేషం ఓడిపోయింది. ప్రేమ గెలిచింది. గత ఐదేళ్లుగా మీరు పడిన బాధలేంటో నేను దగ్గరుండి గమనించాను. మీడియా కూడా కాంగ్రెస్ ఎందుకు గెలిచింది అని అనలైజ్ చేస్తోంది. ఎవరు ఎలా అనలైజ్ చేసుకున్నా మా విజయానికి కారణం పేద ప్రజలే"
- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ సీనియర్ నేత
5 హామీలు..
ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ ప్రధానంగా 5 హామీలు ఇచ్చింది. గృహ జ్యోతి కింద ఇంటింటికీ 200 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్ అందిస్తామని వెల్లడించింది. గృహ లక్ష్మి పథకం కింద ప్రతి ఇంటిలోని మహిళకు రూ.2 వేల నగదు సాయం చేస్తామని తెలిపింది. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వారికి 10 కిలోల బియ్యం ఇస్తామని హామీ ఇచ్చింది. ఇక నిరుద్యోగ యువతకు నెలకు రూ.1500 నగదు ఇస్తామని చెప్పింది. శక్తి పథకం కింద మహిళలందరికీ ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని వెల్లడించింది. ఈ 5 హామీలు త్వరలోనే అమలు చేస్తామని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ఈ హామీల కారణంగానే కర్ణాటకలో కాంగ్రెస్ విజయం సాధించిందని చెబుతున్నారు విశ్లేషకులు. ముఖ్యంగా మహిళలు పెద్ద ఎత్తున కాంగ్రెస్‌కి మద్దతుగా నిలిచారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.