Firing On Slovak Pm Robert Fico: స్లొవేకియా (Slovak) ప్రధాని రాబర్ట్ ఫికో (59)పై (Robert Fico) కాల్పులు తీవ్ర కలకలం సృష్టించాయి. భారత ప్రధాని మోదీ సహా వివిధ దేశాధినేతలు ఆయనపై దాడిని తీవ్రంగా ఖండించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. దేశ రాజధాని బ్రటిస్లావాకు దాదాపు 140 కి.మీల దూరంలోని హాండ్లోవా పట్టణంలో.. ఫికో బుధవారం మధ్యాహ్నం తన మద్దతుదారులతో సమావేశమయ్యారు. మీటింగ్ అనంతరం ఆయన సమావేశ భవనం నుంచి వెలుపలకు రాగానే ఆయనపై ఓ దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. మొత్తం 4 రౌండ్ల కాల్పులు జరిగాయి. దీంతో ఫికో కడుపు భాగంలో తీవ్ర గాయాలైనట్లు అక్కడి మీడియా వర్గాలు వెల్లడించాయి. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఆయన్ను హెలికాఫ్టర్ ద్వారా బన్ స్కా బైస్ట్రికాలోని ఆస్పత్రికి తరలించారు. కాల్పులకు సంబంధించి ఓ అనుమానితున్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రధాని ప్రాణాపాయ స్థితిలో ఉన్నారని.. కొన్ని గంటలు గడిస్తే తప్ప ఏమీ చెప్పలేమని అక్కడి అధికార వర్గాలు వెల్లడించాయి. ఫికో ప్రస్తుతం మూడోసారి ప్రధానిగా కొనసాగుతున్నారు. ఆయనపై హత్యాయత్నాన్ని ఆ దేశాధ్యక్షుడు జుజానా కాపుటోవా తీవ్రంగా ఖండించారు. కీలక యూరోపియన్ పార్లమెంట్ ఎన్నికలకు 3 వారాల ముందు స్లోవేకియాలో కాల్పులు జరగడం ఆందోళన కలిగిస్తోంది. ప్రధాని ఫికోపై దాడిని ఆ దేశ ప్రతిపక్షాలు ఖండించాయి. కాగా, ఫికో విధానాలను నిరసిస్తూ వేలాది మంది రాజధానిలో, స్లోవేకియాలో ఇటీవల ర్యాలీలు నిర్వహించారు.










ఖండించిన వివిధ దేశాధినేతలు


స్లొవేకియా ప్రధానిపై కాల్పుల ఘటనను భారత ప్రధాని మోదీ సహా వివిధ దేశాధినేతలు తీవ్రంగా ఖండించారు. 'ఈ పిరికి దారుణమైన చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాను. పీఎం ఫికో త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. స్లొవాక్ రిపబ్లిక్ ప్రజలకు భారత్ సంఘీభావంగా నిలుస్తుంది.' అని మోదీ ట్వీట్ చేశారు.






అటు, ఫికోపై దాడిని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సహా, విదేశాంగ కార్యదర్శి ఆంటోని బ్లింకెన్ ఖండించారు. ఫికో త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. 'ఈ భయంకరమైన హింసాత్మక చర్యలను ఖండిస్తున్నాం. ఎంబసీ స్లొవేకియా ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతోంది. మేం సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాం.' అని బైడెన్ ట్వీట్ చేశారు. బ్రిటన్ ప్రధాని రిషి సునక్ సైతం.. ఈ ఘటనపై స్పందించారు. ఈ విషయం తెలిసి షాక్ అయ్యానని అన్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఫికోపై దాడిని ఖండించారు. ఈ ఘటనను రాక్షసమైనదిగా అభివర్ణించారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ కూడా ఫికోపై దాడిని తీవ్రంగా ఖండించారు. ఫికో త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.