Nirmala Sitharaman: 


సదస్సులో కీలక వ్యాఖ్యలు..


మోదీ సర్కార్‌పై ప్రధానంగా వస్తున్న విమర్శల్లో ఒకటి "ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరించడం". ప్రభుత్వం అధీనంలో ఉన్న కీలక సంస్థలన్నింటినీ ప్రైవేటు పరం చేస్తున్నారంటూ ప్రతిపక్షాలు తీవ్రంగా మండి పడుతున్నాయి. దీనిపై కేంద్రం ఎప్పుడూ పెద్దగా స్పందించలేదు. అయితే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ అంశంపై స్పందించారు. ఢిల్లీలోని ఓ కార్యక్రమానికి హాజరైన ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతి సంస్థనూ అమ్మేయాలన్న తొందర కేంద్రానికి లేదని తేల్చి చెప్పారు. ప్రతిపక్షాలు దీన్ని అర్థం చేసుకోవాలని అన్నారు. 


"భారత్‌లో ప్రతి ప్రభుత్వ రంగంలోనూ ఎంతో కొంత ప్రైవేట్‌ సంస్థల వాటా ఉంది. కేంద్ర ప్రభుత్వం ప్రతి సంస్థనూ అమ్మేయాలని చూడటం లేదు. నిజానికి ప్రతిపక్షాలకు ఇదంతా తెలుసు. కానీ మేం ప్రతిదీ అమ్మేస్తున్నారని ప్రచారం చేస్తున్నారు. మేం వాటిని అమ్మేయడం లేదు" 


-నిర్మలా సీతారామన్, కేంద్ర ఆర్థిక మంత్రి


నాలుగు వ్యూహాత్మక రంగాల్లో ప్రభుత్వానికి చెందిన కనీస వాటాను అలాగే ఉంచినట్టు వెల్లడించారు. టెలికాం సహా అంతరిక్షం, రక్షణ, రవాణా, విద్యుత్ పెట్రోలియం, బొగ్గు, బ్యాంకింగ్, ఆర్థిక సేవల రంగాల్లో ప్రభుత్వ వాటా తప్పనిసరిగా ఉంటుందని తేల్చి చెప్పారు. 


"ప్రభుత్వ కనీస వాటా ఉంటుందని చెబుతున్నామంటే దానర్థం..ఆ కంపెనీకి సొంతగా నడిపే సామర్థ్యం ఉందని. ఒకవేళ ఇలా సొంతగా నడిపే కెపాసిటీ లేని చిన్న కంపెనీలుంటే వాటిని బడా కంపెనీల్లో విలీనం చేస్తాం. ప్రతిదీ అమ్మేస్తున్నాం అని కాదు. అలా అని అంతా మా అధీనంలో ఉంచుకుంటున్నామనీ కాదు. ఆత్మనిర్భర భారత్ ప్రధాన ఉద్దేశం భారత్‌లోనే అన్నీ తయారు చేసుకోవాలని. కరోనా సంక్షోభ సమయంలో కేంద్రం తీసుకున్న నిర్ణయాలు సత్ఫలితాలనే ఇచ్చాయి. ఆర్థిక వృద్ధి రేటు కూడా బాగుంది." 


-నిర్మలా సీతారామన్, కేంద్ర ఆర్థిక మంత్రి


ఇటీవలే కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశ పెట్టిన నిర్మలా సీతారామన్ మధ్య తరగతి ప్రజలను దృష్టిలో ఉంచుకుని పద్దు తయారు చేశారు. ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలకు పన్ను ఊరట కల్పించినట్టు తెలిపారు. డైరెక్ట్ ట్యాక్స్‌ విధానాన్ని సింప్లిఫై చేయాలని ప్రజలు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారని అన్నారు. ఈ బడ్జెట్‌లో ఆ కల నెరవేరిందని చెప్పారు. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో పెట్టుబడులు వెల్లువెత్తేందుకు కేంద్రం కృషి చేస్తోందని అన్నారు. పన్ను విధానాన్నీ సరళతరం చేసినట్టు చెప్పారు. MSME సెక్టార్‌ ఆర్థికవ్యవస్థను బలోపేతం చేసేందుకు భారీగా రుణాలు అందించేందుకు ముందుకొచ్చినట్టు స్పష్టం చేశారు నిర్మలా సీతారామన్. 


"ఎలాంటి పన్ను మినహాయింపుల్లేని పన్ను విధానాన్ని తయారు చేయాలని అనుకున్నాం. అదే చేశాం. కొత్త పన్ను విధానం సులువుగా అర్థం చేసుకునే విధంగా ఉంటుంది. ఈ శ్లాబుల్లో మార్పులు చేయడం ద్వారా మధ్యతరగతి ప్రజలకు మేలు చేకూరుతుంది. భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకునే ఈ బడ్జెట్‌ను తయారు చేశాం. దాదాపు అన్ని రంగాల్లోనూ డిజిటల్ ఎకానమీ
సృష్టించడమే మా లక్ష్యం" 


- నిర్మలా సీతారామన్, కేంద్ర ఆర్థిక మంత్రి 


Also Read: Electric Vehicles Exemption: ఈవీలు కొనే వారికి అదిరిపోయే ఆఫర్ ఇచ్చిన ప్రభుత్వం, ట్యాక్స్ కట్టక్కర్లేదట