Buggana Rajendranath: మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. దొంగ అగ్రిమెంట్లు, డొల్ల కంపెనీలతో ప్రజాధనాన్ని దోచుకున్నారని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అసెంబ్లీలో తెలిపారు. స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణంలో చంద్రబాబు రూ.371.25 కోట్లను పక్కదారి పట్టించారనని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ సంస్థ విచారణలో ఈ స్కామ్ వెలుగులోకి వచ్చిందని, ఐటీ శాఖ దాడుల్లో కూడా బాబు అక్రమాలు బయటకు వచ్చినట్లు తెలిపారు. వీటి ఆధారంగా సీఐడీ విచారించడంలో ఈ కేసులో బాబు పాత్రతో పాటు ఇతర అంశాలూ బహిర్గతమయ్యాయనని చెప్పారు. స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణంలో నాలుగైదేళ్లు విచారణ చేసిన తర్వాత సాక్షులను ప్రశ్నించి, పత్రాలను పరిశీలించాక ఆధారాలు లభించడంతోనే చంద్రబాబును సీఐడీ అరెస్టు చేసిందని తెలిపారు. వాస్తవాలకు భిన్నంగా టీడీపీ సభ్యులు అసెంబ్లీలో రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. అక్రమాలు చేసిన చంద్రబాబును అరెస్టు చేయకుండా సన్మానం చేయమంటారా అని బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి నిలదీశారు. 


చంద్రబాబు నాయుడు 2014లో అధికారంలోకి వచ్చాక.. ప్రజా ధనాన్ని దోచేసే పథకాలను రచించారని బుగ్గన విమర్శించారు. 2015 ఫిబ్రవరి 25న స్కిల్ డెవలప్‌మెంట్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అండ్ ఇన్నోవేషన్ డిపార్ట్‌మెంట్ ను ఏర్పాటు చేసినట్లు ఆర్థిక మంత్రి తెలిపారు. స్కిల్ శిక్షణ ఉన్నత విద్యలో భాగంగా ఉండగా.. దాన్ని వేరు చేసి స్కిల్ డెవలప్‌మెంట్ డిపార్టుమెంటుగా విభజించారని.. తర్వాత జర్మనీకి చెందిన సీమెన్స్ కు తెలియకుండా ఆ కంపెనీ ముసుగులో నైపుణ్య శిక్షణ అంటూ జీవో నం.4 ఇచ్చారని చెప్పుకొచ్చారు. దానికి భిన్నంగా డిజైన్‌టెక్ అనే షెల్ కంపెనీని తెచ్చి ఒప్పందం చేసుకున్నారని తెలిపారు. 


దొంగ సంతకాలు, తేదీలు వేయకుండా జరిగిన ఒప్పందాలు పూర్తి అక్రమమని అన్నారు. ఆరు క్లస్టర్లుగా ఒక్కోదాని పరిధిలోని 5 ఇన్‌స్టిట్యూషన్లు ఏర్పాటు చేస్తామని చెప్పారని, ఒక్కో క్లస్టర్ కు అయ్యే ఖర్చును రూ.546 కోట్లుగా చూపారని వెల్లడించారు. అందులో 90 శాతం సీమెన్స్ కంపెనీ భరిస్తుందని, 10 శాతం నిధులను ప్రభుత్వం ఇస్తుందని జీవోలో పేర్కొన్న విషయాన్ని గుర్తు చేశారు. చంద్రబాబు సర్కారు తీసుకువచ్చిన ఈ జీవోకు, స్కిల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టు గురించి సీమెన్స్ కంపెనీకి ఏమాత్రం తెలియదని.. ఎవరైనా ఎంవోయూ చేసుకున్నా తమకు సంబంధం లేదని సీమెన్స్ కంపెనీ ప్రకటించిన విషయాన్ని బుగ్గన తెలిపారు. ఆరు క్లస్టర్లకు రూ.3,281 కోట్లు ఖర్చు అవుతుందని తేల్చారని మంత్రి చెప్పారు.


ఈ ప్రాజెక్టు నివేదిక కూడా పూర్తిగా బోగస్ అని మంత్రి బుగ్గన స్పష్టం చేశారు. తమకు తెలియకుండా భారత్ లో తమ ఎండీ నాటి చంద్రబాబు ప్రభుత్వంతో ఒప్పందం పేరుతో అవినీతికి పాల్పడ్డారని సీమెన్స్ కంపెననీ అంతర్గత విచారణలో తేలిన విషయాన్ని మంత్రి బుగ్గన అసెంబ్లీలో వెల్లడించారు. అవినీతికి పాల్పడ్డ తమ ఎండీని తొలగించినట్లు సీమెన్స్ కంపెనీ లిఖితపూర్వకంగా వెల్లడించిన విషయాన్ని చెప్పారు. ఇదే విషయాన్ని సీమెన్స్ లీగల్ హెడ్ న్యాయస్థానంలో 164 సెక్షన్ కింద వాంగ్మూలం కూడా ఇచ్చారని అన్నారు. ఇంత అవినీతి జరిగినా.. చంద్రబాబు అరెస్టును అక్రమం అని అనడం కంటే దారుణం ఇంకోటి ఉండదని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అసెంబ్లీలో అన్నారు.