VCK support letter to Vijay: తమిళనాడు ప్రభుత్వ ఏర్పాటులో నెలకొన్న ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. తమిళగ వెట్రి కళగం అధినేత విజయ్‌కు మద్దతు ఇచ్చే విషయంలో దోబూచులాడిన విడుతలై చిరుతైగల్ కట్చి ఎట్టకేలకు తన నిర్ణయాన్ని ప్రకటించింది. వీసీకే అధ్యక్షుడు తోల్ తిరుమావళవన్ శనివారం సాయంత్రం అధికారికంగా మద్దతు లేఖను టీవీకే ఎన్నికల వ్యూహకర్త, కీలక నేత ఆదవ్ అర్జునకు అందజేశారు. దీంతో టీవీకే కూటమి బలం మ్యాజిక్ ఫిగర్ 118 దాటి 119 కు (TVK 108, కాంగ్రెస్ 5, లెఫ్ట్ పార్టీలు 4, VCK 2) చేరుకుంది.
శనివారం ఉదయం నుండి జరిగిన సుదీర్ఘ చర్చల అనంతరం వీసీకే తన పట్టును సాధించుకున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వంలో భాగస్వామ్యం, కీలక పదవుల విషయంలో విజయ్ నుండి గట్టి హామీ పొందిన తర్వాతే తిరుమావళవన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఆదవ్ అర్జున గతంలో వీసీకేలోనే పనిచేసిన అనుభవం ఉండటంతో, ఆయన మధ్యవర్తిత్వం ఇరు పార్టీల మధ్య పొత్తు కుదరడంలో కీలక పాత్ర పోషించింది. వీసీకే మద్దతుతో విజయ్ పక్షాన ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య పెరగడంతో, ఆయన ముఖ్యమంత్రి కావడం ఇప్పుడు లాంఛనంగా మారింది.
గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ ఈ సాయంత్రం తిరువనంతపురం వెళ్లే లోపే విజయ్ ఆయన్ని కలిసి మద్దతు లేఖలను సమర్పించనున్నారు. ఇప్పటికే మూడుసార్లు రాజ్‌భవన్‌కు వెళ్లిన విజయ్, ఈ సారి పూర్తి మెజారిటీకి సంబంధించిన 119 మంది ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన లేఖను అందించనున్నారు. అన్నీ అనుకూలిస్తే, ఆదివారం లేదా ఎల్లుండి జవహర్‌లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందని టీవీకే వర్గాలు చెబుతున్నాయి.
మరోవైపు, సీపీఐ, సీపీఐ(ఎం) పార్టీలు ఇప్పటికే బయట నుంచి మద్దతు ఇస్తామని ప్రకటించగా, వీసీకే మాత్రం ప్రభుత్వంలో చేరే అవకాశం ఉందని తమిళ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. తిరుమావళవన్ కోరుకున్నట్లుగా సామాజిక సమీకరణాల ఆధారంగా కేబినెట్‌లో ప్రాధాన్యత ఇచ్చేందుకు విజయ్ అంగీకరించినట్లు తెలుస్తోంది. తమిళనాడులో గత అయిదు రోజులుగా కొనసాగుతున్న రాజకీయ అనిశ్చితి ముగింపు దశకు చేరుకుంది. ఒక స్టార్ హీరోగా వెండితెరను ఏలిన విజయ్, ఇప్పుడు పక్కా రాజకీయ లెక్కలతో అధికారాన్ని చేజిక్కించుకోవడం భారత రాజకీయాల్లోనే ఒక అరుదైన ఘట్టంగా నిలవనుంది. విజయ్ తన ప్రమాణ స్వీకారం తేదీని నేటి రాత్రికి అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.
