Father and son who killed Jews in Australia identified as Hyderabad residents: ఆస్ట్రేలియాలోని సిడ్నీ – బోండి బీచ్ వద్ద ఆదివారం యూదులు హనుక్కా పండుగ జరుపుకుంటున్న సమయంలో ఇద్దరు దుండగులు జరిపిన కాల్పుల్లో 15 మంది మృతి చెందారు. దాడి చేసిన వారిలో ఒకరు కూడా మృతి చెందారు. దుండగులను సాజిద్ అక్బర్, అతని కుమారుడు నవీద్ అక్బర్‌గా గుర్తించారు. వీరు ఐసిస్ భావజాలంతో ప్రేరేపితులయ్యారని గుర్తించారు. ఈ విషయమై ఆస్ట్రేలియా అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. సాజిద్ అక్బర్ గురించి హైదరాబాద్ పోలీసులు పూర్తిగా ఆరా తీశారు. ఆ వివరాలను వెల్లడించారు.
27 ఏళ్ల క్రితం ఆస్ట్రేలియా వెళ్లిన సాజిద్
సాజిద్ అక్బర్ హైదరాబాదు వాసి. ఆయన హైదరాబాదులో B.Com పూర్తిచేసి, 1998 నవంబర్‌లో ఉద్యోగావకాశాల కోసం ఆస్ట్రేలియాకు వలస వెళ్లాడు. అక్కడ యూరోపియన్ మూలాలున్న వెనేరా గ్రాసో అనే మహిళను వివాహం చేసుకుని శాశ్వతంగా స్థిరపడ్డాడు. వారికి ఒక కుమారుడు నవీద్ – దాడిలో పాల్గొన్నవాడు , ఒక కుమార్తె ఉన్నారు.సాజిద్ అక్బర్ ప్రస్తుతం భారతీయ పాస్‌పోర్ట్ కలిగి ఉన్నాడు. కుమారుడు, కుమార్తె ఆస్ట్రేలియాలో పుట్టినవారు, ఆస్ట్రేలియా పౌరులు.
భారత్‌లోని బంధువుల సమాచారం ప్రకారం, గత 27 సంవత్సరాలుగా సాజిద్‌కు హైదరాబాదులోని కుటుంబంతో పరిమిత సంబంధమే ఉంది. ఆస్ట్రేలియాకు వెళ్లిన తర్వాత ఆయన ఆరు సార్లు మాత్రమే భారత్‌కు వచ్చాడు, అవి కూడా ప్రధానంగా కుటుంబ ఆస్తి వ్యవహారాల కోసమే. తన తండ్రి మరణించిన సమయంలో కూడా భారత్‌కు రాలేదు. కుటుంబ సభ్యులు, అతనిలో ఎలాంటి ఉగ్ర భావజాలం లేదా తీవ్రవాద కార్యకలాపాలపై తమకు అవగాహన లేదని, అలాగే అతను ఎలా రాడికలైజ్ అయ్యాడన్న విషయమై తమకు సమాచారం లేదని తెలిపారు.
సాజిద్ అక్బర్ , అతని కుమారుడు నవీద్ రాడికలైజేషన్‌కు దారితీసిన అంశాలకు భారత్‌తో గానీ, తెలంగాణలోని స్థానిక ప్రభావాలతో గానీ ఎలాంటి సంబంధం లేదని ప్రాథమికంగా తేలింది. 1998లో ఆస్ట్రేలియాకు వెళ్లే వరకు, సాజిద్ అక్బర్‌పై తెలంగాణ పోలీసుల వద్ద ఎలాంటి ప్రతికూల రికార్డు లేదు. తెలంగాణ పోలీసులు, అవసరమైనప్పుడు కేంద్ర ఏజెన్సీలు, ఇతర సంబంధిత సంస్థలతో పూర్తిగా సహకరిస్తున్నారు.