Farooq Abdullah On China:
స్వరం మార్చిన ఫరూక్..
భారత్, చైనా మధ్య సరిహద్దు వివాదం ముదురుతోంది. ఇటీవల తవాంగ్‌లో ఘర్షణ జరిగిన తరవాత ఇది మరింత తీవ్రమైంది. భారత్ మాత్రం చైనాకు గట్టి బదులిచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించింది. పార్లమెంట్‌లో దీనిపై వాగ్వాదం కొనసాగుతోంది. కేంద్రం తమ ప్రశ్నలకు సమాధానం చెప్పడం లేదంటూ కాంగ్రెస్ పదేపదే సభ నుంచి వాకౌట్ చేస్తోంది. ఈ క్రమంలోనే జమ్ముకశ్మీర్‌లోని నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా కీలక వ్యాఖ్యలు చేశారు. చైనా ప్రస్తావన వచ్చిన సమయంలో ఘాటుగా స్పందించారు. "ఇది 1962 నాటి భారత్ కాదు. ఇండియా...చైనాకు సరైన బదులు కచ్చితంగా ఇచ్చి తీరుతుంది" అని స్పష్టం చేశారు. గతంలో ఎన్నోసార్లు ఈ విషయం గురించి మాట్లాడారు ఫరూక్. చైనా, పాకిస్థాన్‌తో ఉన్న సరిహద్దు వివాదాల్ని కూర్చుని మాట్లాడుకుని పరిష్కరించుకోవాలని సూచించే వారు. కానీ....ఈ సారి భిన్న స్వరం వినిపించారు ఫరూక్ అబ్దుల్లా. చైనాకు గట్టి బదులు ఇవ్వాల్సిందేనని తేల్చి చెప్పారు. ఇదే సమయంలో చైనాతో చర్చలూ జరపాలని అన్నారు. అటు పాకిస్థాన్‌తోనూ అంతే సానుకూలంగా చర్చలు జరపాల్సిన అవసరముందని అన్నారు. పొరుగు దేశాలతో సత్సంబంధాలు సాగించేంత వరకూ భారత్‌లో శాంతియుత వాతావరణం చూడలేమని అభిప్రాయపడ్డారు. ఎల్‌ఏసీ వద్ద భారత్, చైనా మధ్య దాదాపు 23 ప్రాంతాల్లో తరచూ ఘర్షణలు జరుగుతున్నాయి. వీటిలో 13 చోట్ల నిత్యం ఇబ్బందులు ఎదురవుతూనే ఉంటాయి. లద్దాఖ్‌లోని 7 కీలక ప్రాంతాల్లో చైనా కాస్త బలహీనంగానే ఉంది. భారత్ మాత్రం వ్యూహాత్మకంగా బలోపేతం అయింది.
అరుణాచల్ సీఎం వ్యాఖ్యలు..
భారత్- చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణపై అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండూ కూడా స్పందించారు. ఇది 1962 యుగం కాదని, 2022లో ప్రధాని మోదీ యుగం అని అన్నారు. ముంబయిలో జరిగిన ఓ కార్యక్రమంలో సీఎం ఖండూ ఈ వ్యాఖ్యలు చేశారు. చైనా పట్ల నెహ్రూ ప్రభుత్వం అనుసరించిన విధానాన్ని ఆయన తప్పుబట్టారు. తవాంగ్ ప్రాంతంలో ప్రస్తుత పరిస్థితికి మాజీ ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ కారణమని ఖండూ ఆరోపించారు. సిమ్లా ఒప్పందం తర్వాత తవాంగ్‌ను భారత భూభాగంగా మార్చారని అన్నారు. డిసెంబర్ 9న అరుణాచల్ ప్రదేశ్ తవాంగ్ సెక్టార్‌లో వాస్తవాధీన రేఖ వద్దకు చైనా సైనికులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. పీఎల్‌ఏ సేనలు తమ సరిహద్దు
దాటి భారత భూభాగంలో పెట్రోలింగ్‌కు వచ్చిన సమయంలో ఈ ఘర్షణ జరిగింది. యథాతథ స్థితిని మార్చడానికి ప్రయత్నించిన.. చైనా జవాన్లను మన దళాలు సమర్థంగా అడ్డుకున్నాయి. మన భూభాగంలోకి చొరబడకుండా చైనా సైనికులను.. భారత దళాలు ధైర్యంగా నిలువరించి వారిని తిరిగి తమ స్థానానికి వెళ్లేలా చేశాయి. ఘర్షణ జరిగిన సమయంలో సుమారు 600 మంది పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ దళ సభ్యులు అక్కడున్నట్లు తెలుస్తోంది. మరోవైపు భారత్‌కు చెందిన కనీసం మూడు వేర్వేరు యూనిట్లు ఘర్షణ స్థలంలో ఉన్నట్లు సమాచారం.
Also Read: LPG cylinder price: కొత్త సంవత్సరంలో గుడ్ న్యూస్ విందాం, వంట గ్యాస్ ధర తగ్గొచ్చు!