Farmers March Updates: రైతుల మార్చ్ పంజాబ్, హరియాణా సరిహద్దుల్లో అలజడి సృష్టిస్తోంది. రైతులు, పోలీసుల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. ఢిల్లీ వైపు దూసుకొస్తున్న రైతులను అడ్డుకునేందుకు పోలీసులు అన్ని ప్రయత్నాలూ చేస్తున్నారు. భారీ బారికేడ్లు ఏర్పాటు చేశారు. పెద్ద ఎత్తున భద్రతా బలగాలు మొహరించాయి. 2020-21 సమయంలో రైతులు భారీగా ఆందోళనలు నిర్వహించారు. అప్పట్లో హింసాత్మకంగా మారింది. ఇప్పుడు కూడా అదే స్థాయిలో వేలాది మంది రైతులు పంజాబ్‌ నుంచి ఢిల్లీకి వస్తున్నారు. అటు హరియాణా పోలీసులూ అప్రమత్తమయ్యారు. రైతుల్ని అదుపులోకి తీసుకుంటున్నారు. డ్రోన్స్ ద్వారా టియర్ గ్యాస్ ప్రయోగిస్తున్నారు. Samyukta Kisan Morcha నేతృత్వంలో ఈ మార్చ్ జరుగుతోంది. ఛలో ఢిల్లీ పేరిట ఈ మార్చ్‌ నిర్వహిస్తోంది. దీంతో పాటు Mazdoor Morcha కూడా ఈ ఆందోళనల్లో పాల్గొంటోంది. తమ పంటలకు కనీస మద్దతు ధర ఇవ్వడంతో పాటు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు రైతులు. అయితే...వాళ్లను అడుగడుగునా పోలీసులు అడ్డుకుంటున్నారు. ఎలాంటి హింసాత్మక ఘటనలు జరగకుండా జాగ్రత్త పడుతున్నారు. ముఖ్యంగా పంజాబ్ రైతుల్ని రెండు సరిహద్దు ప్రాంతాల్లో హరియాణా పోలీసులు కట్టడి చేశారు. టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఆ సమయంలోనే పోలీసులు, రైతుల మధ్య ఘర్షణలు జరిగాయి. ఈ ఘటనలో 24 మంది పోలీసులు గాయపడ్డారు. 60 మంది రైతులకూ గాయాలయ్యాయి. పెద్ద ఎత్తున సిమెంట్‌ బ్యారియర్‌లు, ఇసుక సంచులు అడ్డుగా పెట్టారు. వీటిని దాటేందుకు ప్రయత్నించిన రైతులు పోలీసులపై రాళ్లు రువ్వారు. 




రైతులు కనీసం 6 నెలల పాటు ఆందోళనలు చేయాలన్న ప్లాన్‌తో వచ్చినట్టు పోలీసులు చెబుతున్నారు. ఆరు నెలలకు సరిపడా సరుకులు సిద్ధం చేసుకున్నారు. ట్రాక్టర్‌లకు అవసరమైన డీజిల్ కూడా తెచ్చుకున్నారు. ఈ ఆందోళనల నేపథ్యంలో సింగూ సరిహద్దు ఉద్రిక్తంగా మారింది. ఫలితంగా ప్రభుత్వం అన్ని ఆసుపత్రులనూ అప్రమత్తం చేసింది. అదే సమయంలో అవసరమైతే భద్రతా బలగాలను మరింత పెంచాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ నిరసనల కారణంగా ట్రాఫిక్‌కి తీవ్ర అంతరాయం కలుగుతోంది. సింగు, ఘాజిపూర్, చిల్లా సరిహద్దు ప్రాంతాలు మరింత ఆందోళనకరంగా ఉన్నాయి.