Fake Doctor Performs Heart Surgeries In Madhya Pradesh: నకిలీ వైద్యులు చాలా మంది ఉంటారు. మహా అయితే వాళ్లు జ్వరం వస్తే పారాసిటమాల్ ఇవ్వడానికి లేకపోతే టెస్టులు రాసి పెద్దాసుపత్రికి వెళ్లు అని చెప్పేంత వరకే పరిమితమవుతారు. ప్రాణాలతో చెలగాటమాడరు. కానీ  మధ్యప్రదేశ్‌లోని దామో నగరంలోని ఒక ప్రైవేట్ మిషనరీ ఆసుపత్రిలో ఎన్ జాన్ కెమ్ అనే  డాక్టర్ మాత్రం అలా అనుకోరు. ఏకంగా గుండెను అడ్డంగా కోసేసి ఆపరేషన్ చేసేస్తారు. ఆ మనిషిని చంపేస్తారు. ఇప్పటికి చాలా మందిని చంపిన తరవాతనే అసలు విషయం బయటపడింది.

మధ్యప్రదేశ్ లోని ఓ ఆస్పత్రిలో గుండె ఆపరేషన్లు చేయించుకున్న వారంతా చనిపోతున్నారు. వారందరికీ ఎన్  జాన్ కెమ్ అనే వైద్యుడు ఆపరేషన్లు చేస్తున్నారు.  డౌట్ వచ్చిన  వారందరికీ తన సర్టిఫికెట్లు చూపిస్తున్నాడు. కానీ అతని లుక్ కు.. పేరుకు ఎక్కడా మ్యాచ్ కావడం లేదు. కొంత మంది ఆన్ లైన్ లో చూస్తే ఎన్  జాన్ కెమ్ డాక్టర్ యూకేలో ఉన్నాడు. అక్కడే మంచి పేరు తెచ్చుకుని పని చేసుకుంటున్నాడు. మరి ఈ జాన్ కెమ్ ఎక్కడి నుంచి  వచ్చాడో ఆరా తీయాలని డిసైడయ్యారు. ఆ ప్రకారం.. ఆరా తీసి అసలు విషయాలను బయట పెట్టారు. 

ఈ ఫేక్ డాక్టర్ పేరు జాన్ కెమ్ కాదు..  అసలు పేరు నరేంద్ర విక్రమాదిత్య యాదవ్ . ఫేక్ డాక్టర్ సర్టిపికెట్లతో మోసం చేసి ఆస్పత్రుల్లోపని చేయడం ప్రారంభించారు. ఇతనిపై హైదరాబాద్ లోనూ ఓ కేసు ఉందని పోలీసులు గుర్తించారు. అంతా గుర్తు పట్టేస్తున్నామని మధ్యప్రదేశ్ వెళ్లాడు. అక్కడ ఏకంగా గుండె ఆపరేషన్లు ప్రారంభించాడు.  ప్రసిద్ధ బ్రిటిష్ వైద్యుడిలా నటించి, తాను కార్డియాలజిస్ట్ అని చెప్పుకుని రోగులకు గుండె శస్త్రచికిత్సలు చేశాడు. శస్త్రచికిత్స చేయించుకున్న రోగులు  అంతా మరణించారు. అధికారికంగా  ఏడుగురు చనిపోయారని అంటున్నారు కానీ ఈ సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుందని అదికారులు నిర్ధారిస్తున్నారు.  

విచారణ జరిపిన  ఆసుపత్రిలో నకిలీ వైద్యుడు పనిచేస్తున్నాడని  తేలిందని.. అసలు వ్యక్తి బ్రిటన్‌లో ఉన్నాడని గుర్తించారు. ప్రస్తుతం జాన్ కెమ్ అని చెప్పుకుంటున్న  తి పేరు నరేంద్ర యాదవ్. హైదరాబాద్‌లో అతనిపై కేసు ఉంది, మరియు అతను తన నిజమైన పత్రాలను ఎప్పుడూ చూపించలేదని అధికారులు చెప్పారు. ఆయుష్మాన్ భారత్ కింద వచ్చే నిధుల కోసం ఆశపడి ఇలా గుండె ఆపరేషన్లు చేసి మనుషుల్ని చంపుతున్నట్లుగా  అనుమానిస్తున్నారు.  జిల్లా దర్యాప్తు బృందం ఆసుపత్రి నుండి అన్ని పత్రాలను స్వాధీనం చేసుకుంది. దర్యాప్తులో, ఆ నకిలీ వ్యక్తి ప్రముఖ బ్రిటిష్ వైద్యుడి మాదిరిగానే నకిలీ పత్రాలను దాఖలు చేసినట్లు వెల్లడైంది.  ఆ నకిలీ వైద్యుడు బ్రిటిష్ వైద్యుడు ఎన్ జాన్ కెమ్ అని నటిస్తూ 2023 జూలైలో  ఓ ట్వీట్ చేశారు.  అప్పట్లో జరిగిన అల్లర్లను ఆపడానికి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను ఫ్రాన్స్‌కు పంపాలని కోరారు.  యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌తో ఫోటోషాప్ చేసిన చిత్రాలను కూడా పోస్ట్ చేసుకున్నట్లుగా గుర్తించారు.