Tamil Nadu Explosion: తమిళనాడులోని విరుద్ నగర్‌లో బాణసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు ధాటికి పక్కనే ఉన్న ఇళ్లు కూడా ధ్వంసమైనట్టు స్థానికులు వెల్లడించారు. పేలుడు సంభవించిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడ్డవారిని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం ఈ ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మిగతా ముగ్గురు హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. ఫ్యాక్టరీలోని కెమికల్ మిక్సింగ్ రూమ్‌లో ఈ పేలుడు జరిగినట్టు ప్రాథమిక విచారణలో తేలింది. పూర్తి స్థాయిలో విచారణ చేపడుతున్నట్టు పోలీసులు వెల్లడించారు. మృతుల్లో ఐదుగురు మహిళలున్నట్టు గుర్తించారు. 






ప్రమాద సమయంలో ఫ్యాక్టరీలో 200 మంది కార్మికులున్నట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై ముఖ్యమంత్రి ఎమ్‌కే స్టాలిన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు రూ.3 లక్షల పరిహారం ప్రకటించారు. కార్మికశాఖ మంత్రి అన్ని విధాలుగా బాధితులకు అండగా ఉంటారని వెల్లడించారు.