Budget 2025 Expectations: బడ్జెట్ 2025లో రక్షణ విద్య కోసం కేటాయింపులు - దిగుమతుల ప్రత్యామ్నాయాల కోసం పెరుగుతోన్న డిమాండ్

Budget 2025 Expectations: భారతదేశం తన సాయుధ బలగాలలో స్వావలంబన, ఆధునీకరణకు ప్రాధాన్యతనిస్తూనే ఉన్నందున, ఈసారి రక్షణ కేటాయింపులు గణనీయంగా పెరుగుతాయని నిపుణలు భావిస్తున్నారు.

Continues below advertisement

Budget 2025 Expectations: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2025-26 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ను ఫిబ్రవరి 1, 2025న సమర్పించడానికి సిద్దమవుతున్నారు. ఆర్థిక సంవత్సరం 2024 -25 బడ్జెట్ లో ఆర్థిక మంత్రి రక్షణ రంగానికి రూ. 6.22 లక్షల కోట్లు కేటాయించారు. ఇది అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే 4.79 శాతం పెరుగుదలను సూచిస్తుంది. ఇందులో మూలధన వ్యయం కోసం రూ. 1.72 లక్షల కోట్లు, కార్యాచరణ సంసిద్ధతకు రూ. 92,088 కోట్లు, రక్షణ పెన్షన్‌ల కోసం రూ. 1.41 లక్షల కోట్లు కేటాయించారు. ఈ సందర్భంగా రక్షణ రంగంలో, ఆధునికీకరణ, స్వావలంబనపై ప్రభుత్వం దృష్టి సారిస్తుండడంతో ఈ సారి బడ్జెట్ కేటాయింపులు పెరుగుతాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 

Continues below advertisement

రక్షణ విద్యలో కేటాయింపులు

ఈ సారి కేంద్ర బడ్జెట్ 2025లో రక్షణ విద్య, నైపుణ్యాభివృద్ధికి అధిక కేటాయింపులు ఉంటాయని ఆశిస్తున్నామని సెంచూరియన్ డిఫెన్స్ అకాడమీ వ్యవస్థాపకుడు, చైర్మన్ శిశిర్ దీక్షిత్ అన్నారు. అదే జరిగితే ఆధునిక అవస్థాపన, సాంకేతిక పురోగమనాలు, ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలలో పెట్టుబడులు బలమైన, స్వావలంబన భారతదేశాన్ని నిర్మించడానికి యువతకు శక్తినిస్తాయని చెప్పారు.ప్రపంచ స్థాయి వనరులు, అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ఔత్సాహిక రక్షణ సిబ్బందిని అనుమతించే విధానాల కోసం తాము ఎదురుచూస్తున్నామని చెప్పారు.

మూల ధన వ్యయంలో 7-8 శాతం వృద్ధి : ఈ సారి రక్షణ రంగంలో 7 నుంచి 8 శాతం పెరుగుదలను చూడవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇది సుమారుగా రూ.1.9లక్ష కోట్లకు చేరుకుంటుందని అంటున్నారు.

ఆర్మీ, నేవీ కేటాయింపులకు ప్రోత్సాహం: సైనిక వాహనాలు, నౌకాదళ ఆస్తులను ఆధునీకరించడంపై ఎక్కువ దృష్టి పెట్టనున్నట్టు నిపుణులు చెబుచున్నారు. అయితే ఏరోస్పేస్ కోసం నిధులు స్థిరంగా ఉండనున్నట్టు తెలుస్తోంది.

దిగుమతి ప్రత్యామ్నాయాల కోసం డిమాండ్

భారతదేశం 2023లో 84 బిలియన్ డాలర్లు కేటాయించి, దాని జీడీపీలో 2.4శాతం వాటాతో 4వ అతిపెద్ద మిలిటరీ ఖర్చుదారుగా నిలిచిందని ఇటీవల ఫిలిప్ క్యాపిటల్ విశ్లేషకులు ఓ నివేదికలో తెలిపారు. ఇది దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడం, పెరుగుతున్న ప్రాముఖ్యతను హైలైట్ చేసింది. అయినప్పటికీ భారతదేశం తన రక్షణ అవసరాలను దాదాపు 35 శాతం ఇప్పటికీ దిగుమతుల ద్వారా తీర్చుకుంటుందని, ఇది దిగుమతి ప్రత్యామ్నాయాన్ని మరింత నొక్కి చెబుతుందని తెలిపింది. మరో పక్క భారత్ రక్షణ ఎగుమతులు విశేషమైన వృద్ధిని సాధించినట్టు తెలుస్తోంది. ఆర్థిక సంవతర్సం 2017-24 మధ్య 46 శాతం విస్తరించి, ఇప్పుడు క్షిపణులు, రాడార్లు, సాయుధ వాహనాలు వంటి ఉత్పత్తులు 85 దేశాలకు ఎగుమతి అవుతున్నాయని నివేదిక పేర్కొంది.

2024 - 29 మధ్య స్వదేశీ సైనిక ప్లాట్‌ఫారమ్‌ల సేకరణ కోసం భారతదేశం సుమారు 93.5 బిలియన్ డాలర్లు కేటాయిస్తుందని గ్లోబల్ డేటా (GlobalData) అంచనా వేసింది. భారత రక్షణ సముపార్జన బడ్జెట్‌లో పెరుగుదల ప్రధానంగా స్వదేశీ, దిగుమతి చేసుకున్న సైనిక ప్లాట్‌ఫారమ్‌ల సేకరణ ద్వారానే నడుస్తోందని గ్లోబల్‌డేటాలోని ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ అనలిస్ట్ ఆకాష్ ప్రతిమ్ దెబ్బర్మ చెప్పారు. వీటిలో అణు-శక్తితో కూడిన అటాక్ సబ్‌మెరైన్లు, తేజస్ మార్క్ 1A ఎయిర్‌క్రాఫ్ట్, ప్రచంద్ హెలికాప్టర్లు, జోరావర్ ప్రధాన యుద్ధ ట్యాంకులు వంటివి ఉన్నాయన్నారు. గత దశాబ్ద కాలంలో భారతదేశం బలమైన ఆర్థిక వృద్ధితో పాటు దేశ రక్షణ వ్యయ సామర్థ్యాన్ని పెంచిందని చెప్పారు.

Also Read : Economic Survey 2025: ద్రవ్యోల్బణం తగ్గినా ధరలు పెరిగాయి - విచిత్రాలు వెల్లడించిన ఆర్థిక సర్వే

Continues below advertisement