టీఎంసీ (TMC) ఎంపీ మహువా మొయిత్రా (Mahua Moitra) ప్రశ్నలు అడిగినందుకు డబ్బులు తీసుకున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆమెను పార్లమెంట్ నుంచి బహిష్కరించాలంటూ ఎథిక్స్ కమిటీ నివేదిక ఇచ్చింది. దీంతో సభలో విపక్షాలు ఆందోళన చేపట్టాయి. ఎంపీ మహువా మొయిత్రా పై పార్లమెంటు నైతిక విలువల కమిటీ రూపొందించిన నివేదిక లోక్‌సభ (Lok sabha) ముందుకు వచ్చింది. ఈ నివేదికను బీజేపీ ఎంపీ, ఎథిక్స్ కమిటీ (Ethics Committee) ఛైర్మన్ విజయ్ సోన్కర్ శుక్రవారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఎథిక్స్ కమిటి నివేదికను లోక్‌సభలో ప్రవేశపెట్టడంపై ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా లోక్‌సభలో నినాదాలు చేశాయి. ఎథిక్స్ కమిటీ నివేదిక కాపీ తమకు ఇవ్వాలని, దీనిపై ఓటింగ్ నిర్వహించడానికి ముందు సభలో చర్చ జరగాలని పట్టుబట్టాయి. స్పీకర్ వారించినా విపక్ష సభ్యులు ఆందోళనను విరమించలేదు. దీంతో సభను మధ్యాహ్నానికి వాయిదా వేశారు. ఈ నివేదికను సభ ఆమోదించినట్లయితే మహువా మొయిత్రా (Mahua Moitra) లోక్‌సభ నుంచి బహిష్కరణకు గురవుతారు. దీనిపై లోక్‌సభ నేడే నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.
నిషికాంత్ దుబే ఆరోపణలతో వెలుగులోకి...
తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు పొందిన ఎంపీ మహువా మొయిత్రాపై బీజేపీ ఎంపీ (Bjp Mp ) నిషికాంత్ దుబే (Nishikanth dube ) సంచలన ఆరోపణలు చేశారు. పార్లమెంట్ సమావేశాల్లో ప్రశ్నలు అడిగేందుకు డబ్బు తీసుకున్నారని దూబే ఆరోపించారు. అదానీ గ్రూప్, ప్రధాని నరేంద్ర మోడీని టార్గెట్ చేసి మాట్లాడేందుకు వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీ నుంచి మహుబా డబ్బులు తీసుకున్నారని అన్నారు. పారాదీప్, ధమ్రా పోర్ట్ నుంచి చమురు, గ్యాస్ సరఫరా, యూరియా సబ్సిడీ, రియల్ ఎస్టేట్‌పై ప్రభావం చూపుతున్న ఉక్కు ధరలు, ఆదాయపు పన్ను శాఖ అధికారాలపై మహువా ప్రశ్నలు అడిగారని గుర్తు చేశారు. తక్షణమే ఆమెను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ, స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. పార్లమెంటరీ హక్కులను ఉల్లంఘించడం, సభా ధిక్కారం, నేరపూరిత కుట్రకు పాల్పడ్డారని లేఖలో పేర్కొన్నారు.
ఖరీదైన బహుమతులు
ఓ కాంట్రాక్టు అదానీ గ్రూపునకు దక్కడంతో హీరానందానీ గ్రూపు వ్యాపార ప్రయోజనాలను కాపాడేందుకు ఎంపీ మహువా మొయిత్రా ప్రయత్నించారని నిషికాంత్ దూబే ఆరోపించారు. హీరానందానీ గ్రూపునకు అనుకూలంగా ప్రశ్నలు అడిగినందుకు రూ.2కోట్లు, ఐఫోన్ వంటి ఖరీదైన బహుమతులు, ఎన్నికల్లో పోటీకి రూ.75లక్షలు ఇచ్చారని లేఖలో ప్రస్తావించారు. ఎంపీ మహువా, వ్యాపారవేత్త మధ్య లంచాల మార్పిడికి సంబంధించి ఆధారాలను ఓ లాయర్ తనకు ఇచ్చారని లేఖలో ప్రస్తావించారు. 2019 నుంచి 2023 మధ్య కాలంలో మహువా అడిగిన 61 ప్రశ్నల్లో 50 ప్రశ్నలు దర్శన్ హీరానందానీ కోరిక మేరకు మహువా అడిగారని నిషికాంత్ తెలిపారు.
మహాభారత యుద్ధాన్ని చూస్తారన్న మహువా మొయిత్రా
దుర్గా మాత వచ్చిందని... ఇక చూసుకుందామన్నారు టీఎంసీ పార్లమెంట్ సభ్యురాలు మహువా మొయిత్రా. వినాశనం సంభవించినప్పుడు.. తొలుత కనుమరుగయ్యేది వివేకమేనన్న ఆమె, వస్త్రాపహరణాన్ని వాళ్లు మొదలుపెట్టారని... ఇక మహాభారత యుద్ధాన్ని చూస్తారని బీజేపీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.