Encounter specialist Dayanayak retires from his police job: నా పేరు దయ.. నాకు లేనిదే అది..అని ఓ సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా రోల్ చేసిన హీరో డైలాగ్ చెబుతాడు. ఈ సినిమాలో హీరో క్యారెక్టర్ నిజంగానే ఓ పోలీసు అధికారిది.. ఆయన పేరు దయానాయక్. ముంబై పోలీసు డిపార్టుమెంట్లో ఎన్ కౌంటర్ స్పెషలిస్టుగా పేరు తెచ్చుకున్నాడు. ఆయన క్యారెక్టర్ ను హీరోగా చూపిస్తూ ఎన్నో సినిమాలు వచ్చాయి. ఆయన ఇప్పుడు పోలీసు ఉద్యోగానికి రిటైర్మెంట్ ప్రకటించారు.
దయా నాయక్ ముంబై పోలీసు విభాగంలో ప్రసిద్ధి చెందిన "ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్. 1990లలో ముంబై అండర్‌వరల్డ్ గ్యాంగ్‌స్టర్‌లను అంతమొందించడంలో దయానాయక్ పాత్ర కీలకం. దయానాయక్ జీవితం అచ్చంగా సినిమా కథను పోలి ఉంటుంది. కర్ణాటక రాష్ట్రంలోని ఉడిపి జిల్లా, కర్కళ తాలూకాలోని యెన్నెహోల్ గ్రామానికి చెందిన బడ్డా నాయక్ , రాధా నాయక్ దంపతులకు జన్మించారు. వారిది కొంకణీ భాష మాట్లాడే దిగువ-మధ్యతరగతి కుటుంబం. యెన్నెహోల్‌లోని కన్నడ మీడియం పాఠశాలలో 7వ తరగతి వరకు చదివాడు. 1979లో ముంబైకి వచ్చిన తర్వాత, గోరేగావ్‌లోని మున్సిపల్ స్కూల్‌లో 12వ తరగతి పూర్తి చేశాడు, ఆ తర్వాత అంధేరిలోని CES కాలేజీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. హోటల్ లో పనిచేస్తూ చదువుకున్నాడు.
1979లో, 14 ఏళ్ల వయసులో, కుటుంబ ఆర్థిక సమస్యల కారణంగా ముంబైకి వచ్చాడు. అక్కడ హోటల్ క్యాంటీన్‌లో టేబుల్ క్లీనర్‌గా, తర్వాత ప్లంబర్ అప్రెంటిస్‌గా పనిచేశాడు, నెలకు రూ. 3,000 జీతం పొందాడు. 1995లో ముంబై పోలీసు విభాగంలో సబ్-ఇన్‌స్పెక్టర్‌గా శిక్షణ పొంది చేరాడు. అతని మొదటి పోస్టింగ్ జుహు పోలీస్ స్టేషన్‌లో ఉంది.
1996 డిసెంబర్ 31న, జుహు ప్రాంతంలో చోటా రాజన్ గ్యాంగ్‌కు చెందిన ఇద్దరు గ్యాంగ్‌స్టర్‌లు అతనిపై కాల్పులు జరపగా వారిని కాల్చి చంపాడు. ఈ సంఘటన దయానాయక్ ను రాత్రికి రాత్రి హీరోను చేసింది. 2024 నాటికి, దయా నాయక్ 80kf hwie ఎన్‌కౌంటర్‌లలో పాల్గొన్నారు. 80కి పైగా గ్యాంగ్‌స్టర్‌లను అంతమొందించాడు. వీరిలో వినోద్ మట్కర్, రఫీక్ డబ్బా, సదిక్ కలియా వంటి వారితో పాటు మరో ముగ్గురు లష్కర్-ఎ-తొయిబా ఉగ్రవాదులు కూడా ఉన్నారు 1996 తర్వాత, అతన్ని డిటెక్షన్ యూనిట్‌లోని ప్రత్యేక ఎన్‌కౌంటర్ స్క్వాడ్‌లోకి మార్చారు, ఇక్కడ అతను ముంబై అండర్‌వరల్డ్ దావూద్ ఇబ్రహీం, చోటా రాజన్ గ్యాంగ్‌లు పై నిరంతరం పోరాడాడు. మహారాష్ట్ర యాంటీ-టెర్రరిజం స్క్వాడ్ (ATS)లో పనిచేస్తూ, ముంబైలో మాదకద్రవ్యాల మాఫియాను అణచివేయడంలో కీలక పాత్ర పోషించాడు. 1997లో, ఒక గ్యాంగ్‌స్టర్‌తో జరిగిన ఎన్‌కౌంటర్‌లో రెండు బుల్లెట్ గాయాలతో తీవ్రంగా గాయపడ్డాడు . రిటైర్మెంట్‌కు ఒక్క రోజు ముందు అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ACP) ర్యాంకుకు పదోన్నతి పొందారు.
దయానాయక్ పై వివాదాలు కూడా ఉన్నాయి. అక్రమ ఆస్తుల ఆరోపణలు, యాంటీ-కరప్షన్ బ్యూరో దర్యాప్తు కారణంగా ఓ సారి సస్పెండ్ అయ్యారు. అయితే ముంబై హైకోర్టు అన్ని ఆరోపణలను కొట్టివేసింది. ఓసారి నాగ్‌పూర్‌కు బదిలీ చేసినా అక్కడ డ్యూటీలో చేరకపోవడంతో మరోసాసి సస్పెండ్ చేశారు. తర్వాత మళ్లీ ముంబైలో పోస్టింగ్ పొందారు. 2025 జులై 30న, 30 సంవత్సరాల సేవ తర్వాత ముంబై పోలీసు నుంచి ACP ర్యాంకులో రిటైర్ అయ్యాడు.