Covishield Vaccine Side Effects:
గుండెపై ప్రభావం..
కొవిడ్ వ్యాక్సిన్‌లు వేసుకుంటే చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని టీకాలు వేసిన మొదట్లో ఎన్నో అనుమానాలు వ్యక్తమయ్యాయి. వాట్సాప్‌లోనూ చాలా వదంతులు పుట్టుకొచ్చాయి. కొద్ది రోజుల పాటు ఈ సందేహాలు అలాగే కొనసాగాయి. ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు అవగాహన కల్పించేందుకు ప్రయత్నాలు చేయడం వల్ల పరిస్థితుల్లో కొంత మార్పు వచ్చింది. క్రమంగా అందరూ ముందుకొచ్చి టీకాలు తీసుకున్నారు. అయితే...వ్యాక్సిన్‌ల వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయన్న వాదనను ఇప్పటికీ కొందరు నిపుణులు బలంగా వినిపిస్తున్నారు. భారత సంతతికి చెందిన బ్రిటన్ కార్డియాలజిస్ట్ డాక్టర్ అసీమ్ మల్హోత్రా ఇటీవల చేసిన వ్యాఖ్యలు సంచలనమవుతున్నాయి. mRNA వ్యాక్సిన్‌లను వెంటనే బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు మల్హోత్రా. భారత్‌లో ఎక్కువ మందికి అందించిన కొవిషీల్డ్ టీకాల కారణంగా గుండె పోటు వచ్చే ప్రమాదముందని తేల్చి చెప్పారు. ఈ టీకా నేరుగా గుండెపైనా అధికంగా ప్రభావం చూపుతుందని సంచలన విషయం చెప్పారు. ఫైజర్ mRNA వ్యాక్సిన్‌ను కూడా బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు మల్హోత్రా. వ్యాక్సిన్‌లపై రివ్యూ చేసి ఈ విషయం వెల్లడించారు. మరోసారి కొవిషీల్డ్ వ్యాక్సిన్‌కు సేఫ్టీ రివ్యూ అవసరమని స్పష్టం చేశారు. నేషనల్ హెల్త్ సర్వీస్ (NHS)లో ట్రైనింగ్ పూర్తి చేసిన మల్హోత్రా...ప్రస్తుతం భారత్‌లో పర్యటిస్తున్నారు. కొవిడ్ వ్యాక్సిన్‌లపై కీలక ప్రసంగాలు ఇస్తున్నారు. ఇప్పటికే కొన్ని చోట్ల mRNA వ్యాక్సిన్‌లు బ్యాన్ చేయాలన్న డిమాండ్ వినిపిస్తోందని తెలిపారు.
ఆ దేశాల్లో బ్యాన్..
కొవిషీల్డ్ వ్యాక్సిన్, ఫైజర్ టీకాల్లో ఏది సమర్థమంతమైనది..? ఏది గుండెపై అధికంగా ప్రభావం చూపుతోంది అనే అంశాలపై అధ్యయనం చేశారు మల్హోత్రా. ఈ రెండింటినీ పోల్చి చూస్తే...కొవిషీల్డ్ టీకా గుండెపై ఎక్కువగా ఎఫెక్ట్ చూపిస్తోందని వెల్లడైంది. పెద్దలతో పాటు పిల్లలకూ ఈ ముప్పు ఉందని తేలింది. వాల్వ్స్ క్లాట్ అవ్వడం, గుండె పోటు రావడం లాంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని వివరించారు డాక్టర్ మల్హోత్రా. యూకే సహా ఐరోపా దేశాలు ఆస్ట్రాజెన్‌కా తయారు చేసిన కొవిషీల్డ్ టీకాను బ్యాన్ చేసినప్పుడు ఇండియాలో మాత్రం ఎందుకు ఇచ్చారని ప్రశ్నిస్తున్నారాయన. సైడ్ ఎఫెక్ట్స్ ఉంటున్నాయన్న కారణంగానే ఆయా దేశాల్లో ఆ టీకా పంపిణీని ఆపేసినట్టు వివరించారు. ఇప్పటికిప్పుడు ఈ టీకాలను బ్యాన్ చేయాలని సూచించారు. అయితే...గతేడాది ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO)ఓ కీలక విషయం చెప్పింది. కొవిషీల్డ్ టీకా అన్ని విధాలుగా సేఫ్ అని వెల్లడించింది. దీనిపైనా విమర్శలు చేశారు డాక్టర్ అసీమ్ మల్హోత్రా. కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు బడా సంస్థల్ని తమ చెప్పు చేతల్లో ఉంచుకుంటున్నారని అన్నారు. కేవలం షేర్ హోల్డర్లకు లాభం చేకూర్చేందుకే ఫార్మా ఇండస్ట్రీని పావుగా వాడుకుంటున్నారన్న చేదు నిజాన్ని ప్రజలు తెలుసుకోవాలని ఘాటుగా స్పందించారు. ఈ రెండు వ్యాక్సిన్‌లను అప్రూవ్ చేయకుండా ఉండాల్సిందని అన్నారు. కొవాగ్జిన్ పరిస్థితేంటని ప్రశ్నించగా...ఇప్పటి వరకైతే ఈ టీకా సేఫ్ అని నమ్ముతున్నామని, ఏదేమైనా ఈ టీకా పనితీరుపైనా ఓ సారి రివ్యూ చేస్తామని తేల్చి చెప్పారు.