Eluru Crime News: కన్నబిడ్డను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన ఆ తల్లిదండ్రులు బిడ్డను అమ్మేయాలనుకున్నారు. అంతే కాదండోయ్ అమ్మగా వచ్చిన డబ్బును ఇద్దరూ చెరిసగం పంచుకోవాలనుకున్నారు. అనంతరం ఎవరి దారి వాళ్లు చూస్కోవాలని ప్లాన్ కూడా వేశారు. ఈ విషయం తెలిసిన వారంతా నివ్వెరపోయారు. అయితే ఈ ఘటన ఎక్కడ, ఎలా జరిగిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. 


వసంతతో రారాజు ప్రేమ వివాహం..


రాజమహేంద్రవరానికి చెందిన రారాజుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అతడు వారిని వదిలేవి ఒంటరిగా ఉంటూ ల్యాబ్ టెక్నీషియన్ గా పని చేస్తున్నాడు. కాకినాడకు చెందిన కె. వసంతకు గతంలో బాల్య వివాహం జరిగింది. కానీ పోలీసులకు తెలియడంతో ఆ పెళ్లి రద్దు అయింది. ప్రస్తుతం మేజర్ అయిన ఆమె రాజమహేంద్రవరంలోని ఒక బైక్ షోరూంలో పని చేస్తోంది. ఈ క్రమంలో వసంతను రారాజు ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి నాలుగు నెలల కుమారుడు ఉన్నాడు. నెల రోజులుగా రారాజు.. తన తండ్రి ప్రసాద్, వసంతలతో కలిసి ఏలూరు జిల్లాలోని ద్వారకా తిరుమలలో ఉంటున్నాడు.


బిడ్డను అమ్మేసి వచ్చిన డబ్బును పంచుకోవాలని పథకం..


అయితే వసంత, రారాజుల మధ్య తరచుగా గొడవలు జరుగుతున్నాయి. దీంతో తమ కుమారుడిని ఎవరికైనా అమ్మేసి వచ్చిన డబ్బును ఇద్దరం చెరి సగం పంచుకొని, విడిపోవాలని నిశ్చయించుకున్నారు. ఈ క్రమంలోనే భీమవరానికి చెంది ఒక వ్యక్తికి చిన్నారిని అమ్మేందుకు బేరం పెట్టారు. ఈ మేరకు గురువారం రారాజు, వసంత, ప్రసాద్ లు ద్వారకా తిరుమల కొండపైనున్న ఒక కాటేజీ వద్దకు వెళ్లారు. భీమవరం వాసి కూడా అక్కడికి చేరుకున్నాడు. ఈ క్రమంలోనే రెండు లక్షల రూపాయలకు ఇచ్చేద్దామని రారాజు, 10 లక్షలకు అమ్మేద్దామని ప్రసాద్ గొడవ పడ్డారు. 


భక్తుల వల్ల పోలీసుల ఎంట్రీ..


అయితే వారి వాగ్వాదం విని విషయం అర్థం చేసుకున్న పలువురు భక్తులు.. ఆలయ సిబ్బంది, పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే భీమవరం వాసి పరారయ్యారు. హుటాహుటిన రంగంలోకి దిగిన పోలీసులు చిన్నారితోపాటు రారాజు, వసంత, ప్రసాద్ లను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 


ఇటీవలే క్షుద్రపూజల్లో భాగంగా పిల్లలనే చంపాలనుకున్న తండ్రి 


పిచ్చి భక్తితో నేరాలు చేసే వారు సినిమాల్లోనే కాదు .. మన చుట్టుపక్కలా ఉంటారు. అలాంటి వారిని చూసే సినిమాల్లో క్యారెక్టర్లను పెడుతూంటారు. ఇలాంటి ఓ వ్యక్తి కంటిపాపల్ని చంపుకునే ప్రయత్నం చేశాడు. చివరి క్షణంలో కుటుంబసభ్యులు చూశారు కాబట్టి సరిపోయింది. అప్పటికీ ఓ పాప పరిస్థితి విషమంగా మారింది. నెల్లూరు జిల్లాలో జరిగిన ఈ క్రైమ్ ఘటన అందర్నీ నోళ్లు నొక్కుకునేలా చేసింది. 


ముగ్గులో కవల పిల్లల్ని కూర్చోబెట్టి క్షుద్ర పూజలు


అది నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలో పెద్దిరెడ్డి పల్లి గ్రామం. ఓ ఇంట్లో క్షుద్రపూజల తరహాలో ముగ్గులు వేసి ఉన్నాయి. ఆ ముగ్గుల్లో ఇద్దరు పసివాళ్లను కూర్చోబెట్టి ఉన్నారు. ఓ వ్యక్తి మంత్రాలు చదువుతున్నాడు. పిచ్చి పట్టిన వాడిలా ఉగుతూ పసుపు, కుంకుమలు చల్లుతున్నాడు. చుట్టుపక్కల ఎవరూ లేరు. కానీ అరుపులు వినిపించడంతో పక్కన వాళ్లు ఏం జరుగుతుందా అని వచ్చి చూశారు. అక్కడి పరిస్థితుల్ని చూసి ఒక్క సారిగా భయపడ్డారు. పిసిపిల్లలను బలిస్తాడేమోనని అతన్ని ఎదిరించి తీసుకెళ్లబోయారు. అయితే ఓ పాపను బలవంతంగా తీసుకురాగలిగారు. మరో పాప కోసం కొంత మందిని పోగేసి తీసుకు వచ్చే సరికి.. ఆ పాప గొంతులో కుంకుమ కుక్కేశాడు. అతి కష్టం మీద ఆ పాపను కూడా లాక్కుని ఆస్పత్రికి తరలించారు. ఆ పాప పరిస్థితి విషమంగా ఉంది. ఆ వ్యక్తిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు.