Elon Musk Vs:  భారత ప్రభుత్వంపై ఎక్స్ కర్ణాటక హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.  భారత ప్రభుత్వం చట్టవిరుద్ధంగా కంటెంట్‌ను నియంత్రిస్తోందని ఎక్స్ ఆరోపిస్తోంది.  ప్రభుత్వం ఏకపక్షంగా సెన్సార్‌షిప్‌కు పాల్పడుతోందని పిటిషన్‌లో పేర్కొంది.  ఐటీ చట్టం, సహ్యోగ్ పోర్టల్ నిబంధనలు ఎక్స్‌కు ఉన్న చట్టబద్ధమైన రక్షణలను ప్రభావితం చేస్తున్నాయని పిటిషన్‌లో తెలిపింది.  అల్లర్లు, ఘర్షణలకు కారణమయ్యే పోస్టులు, పూర్తి వివరాలు లేకుండా సృష్టించిన ఖాతాలను తొలగించడానికి, బ్లాక్ చేయడానికి సెక్షన్ 69-ఏ ప్రకారం కేంద్ర ప్రభుత్వానికి అధికారం ఉన్నా..   స్పష్టమైన నియమాలు, తినిఖీలు లేకుండా అధికారులు సమాచారాన్ని బ్లాక్ చేయడానికి అధికారులు అనుమతి ఇస్తున్నారని ఎక్స్ వాదిస్తోంది.  కేంద్రం మాత్రం  ఈ ఆరోపణల్ని తోసిపుచ్చింది. వ్యవస్థ చట్టాన్ని అనుసరించి ముందుకు వెళ్తుందని.. సోషల్ మీడియా సంస్థలు నిబంధనలు పాటించాల్సిందేనని స్పష్టం చేసింది.  సహ్యోగ్ పోర్టల్  ను కేంద్రం సురక్షితమైన సైబర్ స్పేస్‌ను సృష్టించడానికి సిద్ధం చేసింది.   ఈ పోర్టల్‌ను భారత ప్రభుత్వ హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ అభివృద్ధి చేసింది. దీని ప్రధాన లక్ష్యం సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో ఉన్న చట్టవిరుద్ధమైన కంటెంట్‌ను తొలగించడం, తద్వారా సైబర్ స్పేస్‌ను సురక్షితంగా మార్చడం. ఈ పోర్టల్ ద్వారా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల అధీకృత సంస్థలు , సోషల్ మీడియా మధ్యవర్తులు కలిసి పనిచేస్తారు. మొదటి దశలో  ఈ పోర్టల్ చట్టవిరుద్ధ కంటెంట్‌ను తొలగించడంపై దృష్టి పెట్టింది, భవిష్యత్తులో దీని కార్యకలాపాలను చట్టబద్ధంగా విస్తృతం చేసే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ పోర్టల్ దుర్వినియోగం చేసి ఎక్స్ ను సెన్సార్ షిప్ చేస్తున్నారనేది ఎక్స్ ఆరోపణ. 

ఎలాన్ మస్క్ చేతికి ట్విట్టర్ వెళ్లక ముందే కేంద్రంతో ఘర్షణ పడిన సందర్భాలు ఉన్నాయి. 2021లో భారతదేశంలో రైతు ఆందోళనలు జరుగుతున్న సమయంలో, కేంద్ర ప్రభుత్వం ట్విట్టర్‌ను ఆందోళనలకు సంబంధించిన కొన్ని ట్వీట్‌లు మరియు ఖాతాలను తొలగించమని కోరింది. ఈ ట్వీట్‌లు "అశాంతి" కలిగించే హ్యాష్‌ట్యాగ్‌లను ఉపయోగించాయని  "పాకిస్తాన్ మద్దతు" ఉన్నాయని ప్రభుత్వం ఆరోపించింది. ట్విట్టర్ మొదట కొన్ని ఖాతాలను నిలిపివేసినప్పటికీ, తర్వాత వాటిని పునరుద్ధరించింది. దీనిపై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసి, ట్విట్టర్ ఉద్యోగులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.  ట్విట్టర్ తన వైఖరిని సమర్థిస్తూ, మీడియా సంస్థలు, జర్నలిస్టులు, యాక్టివిస్టులు,  రాజకీయ నాయకుల ఖాతాలను నిలిపివేయడానికి నిరాకరించింది.     2021లో కేంద్ర ప్రభుత్వం "ఇంటర్మీడియరీ గైడ్‌లైన్స్ మరియు డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్ రూల్స్"ను ప్రవేశపెట్టింది ఈ రూల్స్ ప్రకారం ప్రభుత్వ ఆదేశాల మేరకు 36 గంటల్లో కంటెంట్‌ను తొలగించాలి. ట్విట్టర్ ఈ నిబంధనలను పాటించడానికి నిరాకరించింది.  కోవిడ్-19 మహమ్మారి సమయంలో, ప్రభుత్వ విధానాలపై విమర్శలు చేసే ట్వీట్‌లను తొలగించమని ట్విట్టర్‌ను కేంద్రం కోరింది. ఈ ట్వీట్‌లు మహమ్మారి నిర్వహణలో ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపాయి.  ట్విట్టర్ కొన్ని ట్వీట్‌లను తొలగించినప్పటికీ, అన్నింటినీ తొలగించలేదు.   2021లో ట్విట్టర్ తన కెరీర్స్ విభాగంలో భారతదేశం యొక్క తప్పుడు మ్యాప్‌ను ప్రదర్శించింది. ఇందులో లడాఖ్‌లోని కొన్ని ప్రాంతాలను చైనాలో భాగంగా చూపించారు. దీనిని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించి, ట్విట్టర్‌పై చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.కొత్త IT నిబంధనలను పాటించడంలో విఫలమైనందుకు, ప్రభుత్వం ట్విట్టర్‌కు ఇచ్చిన "సేఫ్ హార్బర్" స్టేటస్‌ను రద్దు చేసింది. ఈ స్టేటస్ లేకపోతే, ట్విట్టర్ తన ప్లాట్‌ఫారమ్‌లో పోస్ట్ చేసే కంటెంట్‌కు చట్టపరమైన బాధ్యత వహించాల్సి ఉంటుంది.