Twitter Value Now:


 
20 బిలియన్ డాలర్లు..


5 నెలల క్రితం ట్విటర్‌ను కొనుగోలు చేశారు ఎలన్ మస్క్. 44 బిలియన్ డాలర్లు పెట్టి ట్విటర్‌ను కొన్నారు. అప్పటి నుంచి రెవెన్యూ పెంచుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు. ట్విటర్ బ్లూ సబ్‌స్క్రిప్షన్ ఇందులో భాగమే. విమర్శలు వస్తున్నా పట్టించుకోకుండా...తన స్టైల్‌లో తాను నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇంత చేశారు సరే. మరి ట్విటర్ ఆదాయం ఏమైనా పెరిగిందా..? అన్న అనుమానాలు రావడం సహజమే. ఈ ప్రశ్నకు సమాధానమిచ్చారు మస్క్. బహిరంగంగా కాదు. ఇంటర్నల్ ఈ-మెయిల్స్‌లో ఈ విషయం చెప్పారట. ప్రస్తుతం ట్విటర్ వాల్యూ 20 బిలియన్ డాలర్లుగా ఉందని మెయిల్ చేసినట్టు సమాచారం. అమెరికన్ న్యూస్ మీడియా ఈ విషయం వెల్లడించింది. స్నాప్‌చాట్ పేరెంట్ కంపెనీ స్నాప్‌, పింట్రెస్ట్ కన్నా ట్విటర్ వాల్యూ ఎక్కువగా ఉన్నట్టు తెలిపింది. ఈ క్రమంలోనే...ట్విటర్ వాల్యూకి తగ్గట్టుగా ఉద్యోగులకు స్టాక్ అవార్డులు ఇస్తున్నట్టు ప్రకటించారు. ట్విటర్‌ను రీషేప్ చేయడంలో సక్సెస్ అయ్యామని సంతోషం వ్యక్తం చేస్తూ మెయిల్స్ పంపారు. కంపెనీ దివాళా కాకుండా ఉండేందుకు ఎన్నో కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చిందని అన్నారు. నిజానికి ట్విటర్ ఆదాయం దారుణంగా పడిపోయింది. చాలా మంది అడ్వర్టైజర్‌లు ట్విటర్‌లో యాడ్‌లు ఇవ్వడం ఆపేశారు. ఇంత పెద్ద సవాలుని ఎదుర్కొని కూడా తట్టుకుని నిలబడ్డామని అన్నారు మస్క్. ఇప్పుడిప్పుడే మళ్లీ అడ్వర్టైజర్‌లు తమను సంప్రదిస్తున్నారని వెల్లడించారు. 


ట్విటర్ సోర్స్ కోడ్ లీక్..? 


ట్విటర్ సోర్స్ కోడ్ లీక్ అయినట్టు కంపెనీ వెల్లడించింది. ఈ కోడ్‌ను ఎవరో ఇంటర్నెట్‌లో పోస్ట్ చేశారని..వీలైనంత త్వరగా దాన్ని డిలీట్ చేయాలని ఇంటర్నెట్ హోస్టింగ్ సర్వీస్ GitHubని కోరింది ట్విటర్ సంస్థ. ఇప్పటికే పలు సార్లు హ్యాక్‌కు గురైంది. ఏకంగా మస్క్ పేరిటే ఫేక్ అకౌంట్ క్రియేట్ చేశారు హ్యాకర్లు. వెంటనే గుర్తించి వాటిని డిలీట్ చేసింది ట్విటర్. 


మస్క్‌కు పూజలు..


ప్రపంచవ్యాప్తంగా రోజూ ఏదో విధంగా వినిపించే పేరు టెస్లా, ట్విటర్ అధినేత ఎలన్ మస్క్. ట్విటర్‌ను కొనుగోలు చేసినప్పటి నుంచి ఆయన వార్తల్లో ఉంటూనే ఉన్నారు. పాలసీల్లో ఎన్నో మార్పులు చేర్పులు చేస్తున్నారు. భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తున్నారు. ఉన్నవాళ్లపై ఒత్తిడి పెంచుతున్నారు. అయితే..మస్క్‌ను తిట్టే వాళ్లెంత మంది ఉన్నారో పొగిడే వాళ్లూ అంతే ఉన్నారు. సోషల్ మీడియాలో ఆయనకు ప్రత్యేకంగా ఫ్యాన్ బేస్ కూడా ఉంది. ఇప్పుడు ఆ ఫ్యాన్స్ చేసిన పనే అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. బెంగళూరులో ఎలన్‌ మస్క్‌కు ఫోటో పెట్టి పూజలు చేశారు ఆ అభిమానులు. హారతి ఇచ్చి, అగరొత్తులు వెలిగించి భజన చేశారు. ఫిబ్రవరి 26న బెంగళూరులోని ఫ్రీడమ్ పార్క్‌లో  Save Indian Family Foundation ఆధ్వర్యంలో జరిగిందీ పూజా కార్యక్రమం. ఓ వ్యక్తి హారతి ఇచ్చి మస్క్ పేరిట భజన చేస్తుండగా..మరో వ్యక్తి అగరొత్తులు వెలిగించి మస్క్ ఫోటో ముందు పెట్టాడు. ఓం మస్కాయ నమః, ఓం ట్విటరాయ నమః అంటూ మంత్రాలు కూడా చదివారు. ఇంతకీ వాళ్లకు మస్క్‌పై ఇంత భక్తి ఎందుకు పుట్టుకొచ్చిందో తెలుసా..? ట్విటర్‌లో సెన్సార్‌షిప్‌ను తగ్గించినందుకట. మగవాళ్లందరూ స్వేచ్ఛగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేసేందుకు వీలు కల్పించారంటూ మస్క్‌కు ఇలా థాంక్స్ చెప్పారు. మస్క్ రాకముందు ట్విటర్‌లో మగవాళ్ల హక్కులను తొక్కేశారని, ఆయన వచ్చాకే తమకు ఫ్రీడమ్ వచ్చిందని చెబుతున్నారు.