Elon Musk Apology:
ట్వీట్‌లో వార్..
ట్విటర్‌లో లేఆఫ్‌లు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో కొందరు ఉద్యోగులకు జాబ్ నుంచి తొలగిస్తున్నట్టు మెయిల్స్ కూడా సక్రమంగా వెళ్లడం లేదు. ఉన్నట్టుండి కంపెనీ కంప్యూటర్లలో యాక్సెస్ కట్ చేసేస్తున్నారు. కొందరు దీన్ని లైట్ తీసుకుంటున్నా కొందరు ఎంప్లాయిస్ మాత్రం తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి అనుభవమే ఎదుర్కొన్న ఓ ఉద్యోగి ట్విటర్ వేదికగా మస్క్‌ను ట్యాగ్ చేస్తూ "నన్ను ఉద్యోగంలో ఉంచారా తీసేశారా క్లారిటీ ఇవ్వండి" అంటూ కాస్త ఘాటుగానే ట్వీట్ చేశాడు. HR తనకు లేఆఫ్ గురించి ఎలాంటి సమాచారం అందించలేదని, కానీ తన సిస్టమ్‌లో యాక్సెస్ అవ్వలేకపోతున్నానని వివరించాడు. ఈ ట్వీట్ దుమారం రేపింది. తనతో పాటు 200 మంది ఉద్యోగులకూ ఇదే సమస్య ఎదురవుతోందని వెల్లడించాడు. గత నెల నుంచి కొనసాగుతున్న లేఆఫ్‌ల గురించీ ట్విటర్‌లో ప్రస్తావించాడు. దీనిపై స్పందించిన ఎలన్ మస్క్..."ఏం పని చేస్తున్నారో చెప్పండి" అంటూ ట్వీట్ చేశాడు. దీనిపై రెస్పాండ్ అయిన ఆ ఎంప్లాయ్ తన జాబ్ రోల్స్‌ను ట్వీట్ చేశాడు. వెంటనే స్పందించిన మస్క్ "ఫోటోలు పెట్టండి. మీరు పర్‌ఫార్మ్ చేస్తున్నట్టు ప్రూవ్ చేసుకోండి" అని ట్వీట్ చేశారు. ఈ వరుస ట్వీట్‌లతో వివాదం ముదిరింది. ఈ క్రమంలో ఎలన్ మస్క్ చేసిన ట్వీట్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. ఆ ఎంప్లాయ్ దివ్యాంగుడు అని, ఇదే సాకు చెప్పి పని నుంచి తప్పించుకోవాలని చూస్తున్నారని ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్ చేసినప్పటి నుంచి మస్క్‌ను తీవ్రంగా విమర్శించారు నెటిజన్లు. వివాదం ముదిరాక స్పందించిన మస్క్...ఆ ఉద్యోగికి క్షమాపణలు చెప్పాడు. అపార్థం చేసుకున్నానంటూ ట్వీట్ చేశాడు. ఇప్పటికే మస్క్ తీసుకుంటున్న నిర్ణయాలపై విమర్శలు వస్తున్న తరుణంలో ఆయన నోరు జారి మరింత అభాసుపాలయ్యారు.