చిత్తూరు జిల్లాలో ఏనుగుల దాడులు ఎక్కువయ్యాయి. గుంపు నుంచి విడిపోయిన గజరాజులు గాండ్రిస్తూనే ఉన్నాయి. ఒకదాన్ని తరిమేశారని ఊపిరిపీల్చుకునే లోపే.. ఇంకో ఏనుగు దండెత్తుతోంది. మూడు రోజుల క్రితమే గుడిపాల మండలంలో దంపతులపై దాడి చేసి చంపింది ఏనుగు. ఆ ఏనుగు బెడద వదిలింది అనుకునే లోపు.. మరో ఏనుగు ఊళ్లోకి రాడవంతో భయపడిపోతున్నారు గ్రామస్తులు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటున్నారు.
బంగారుపాళ్యం మండలం మొగలివారిపల్లె దగ్గర ఏనుగుల గుంపులో నుంచి ఓ ఏనుగు దారితప్పింది. మొగలివారిపల్లి, టేకుమంద గ్రామాల్లో సంచరిస్తోంది. జయంతి గ్రామంలోకే రావడంతో ప్రజలు హడలిపోతున్నారు. ఊళ్లో ఒంటరి మదపుటేనుగును చూసి భయంతో వణికిపోతున్నారు. వెంటనే అటవీశాఖ అధికారులకు సమచారం ఇచ్చారు. స్థానికులు సమచారంతో అక్కడికి చేరుకున్న ఫారెస్ట్ ఆఫీసర్స్.. ఏనుగు సంచారంపై నిఘా పెట్టారు. ఒంటరి ఏనుగును అటవీ ప్రాంతంలోకి పంపేందుకు ప్రయత్నిస్తున్నారు.
రెండు రోజుల క్రితం చిత్తూరు జిల్లాలో ఒంటరి మదపుటేనుగు దాడిలో ఓ మహిళ మృతి చెందింది. ఆంధ్ర-తమిళనాడు సరిహద్దులోని బోడినత్తం గ్రామానికి చెందిన వసంత అనే 57ఏళ్ల మహిళ ఏనుగు దాడిలో ప్రాణాలు కోల్పోయింది. గురువారం తెల్లవారు జామున వసంతపై దాడి చేసి చంపేసింది ఏనుగు. గ్రామంలోకి చొరబడ్డ ఒంటరి ఏనుగును కుంకీ ఏనుగుల ద్వారా.. శ్రీరంగంపల్లి చెరువు నుంచి అటవీ ప్రాంతంలోకి అధికారులు మళ్లిస్తున్న క్రమంలో ఈ ఘటన జరిగింది. అధికారులు తీవ్రంగా శ్రమించి.. ఆ ఒంటరి ఏనుగును తిరిగి గుంపులో కలిపేశారు. దీంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.
ఇక, బుధవారం.. గుడిపాల మండలంలోని రామాపురం గ్రామంలో బీభత్సం సృష్టించిన ఒంటరి ఏనుగు దంపతులపై దాడి చేసి చంపేసింది. ఏనుగుల గుంపు నుంచి విడిపోయిన ఆ ఏనుగు... గ్రామ సమీపంలోని పొలాలపై పడింది. రామాపురం గ్రామంలోని పొలంలో పనిచేస్తున్న వెంకటేష్- సెల్వి దంపతులపై ఏనుగు దాడిచేసింది. ఏనుగు దాడిలో వారు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత సీకేపల్లెలోని మామిడి తోటలో కార్తీక్ అనే 24ఏళ్ల యువకుడిపై కూడా ఏనుగు దాడిచేసింది. ఈ దాడిలో యువకుడు తీవ్రంగా గాయపడిన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రస్తుతం కార్తీక్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.
ఏనుగుల గుంపు తరచూ పంటలపై దాడి చేస్తుంటాయని ప్రజలు భయపడుతున్నారు. అడ్డుకోవడానికి వచ్చిన వారిపై దాడి చేస్తున్నాయని చెప్తున్నారు. ఏ క్షణం ఏం జరుగుతుందోనని భయపడుతున్నారు. పొలాల్లోకి వెళ్లేందుకు కూడా జంకుతున్నారు.
గజరాజుల గుంపు నుంచి ఏనుగులు విడిపోతుండటంతో అటవీ అధికారులు చిత్తూరు జిల్లాలో నిఘా పెంచారు. రెండు బృందాలుగా ఏర్పడి నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఒంటరి ఏనుగులతో ప్రమాదం పొంచి ఉండటంతో... ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తూనే ఉన్నారు. అయినప్పటికీ అక్కడక్కడా ఒంటరి ఏనుగులు బీభత్సం సృష్టిస్తూనే ఉన్నాయి. ప్రజలు అలర్ట్‌గా ఉండాలని... ఒంటరి ఏనుగు కనిపిస్తే తమకు సమాచారం ఇవ్వాలని సూచిస్తున్నారు అటవీశాఖ అధికారులు.