Electoral Bonds Case News: ఎలక్టోరల్ బాండ్స్ కేసులో SBI తీరుపై సుప్రీంకోర్టు అక్షింతలు వేసిన వెంటనే ఆ బ్యాంక్ అప్రమత్తమైంది. కోర్టు చెప్పిన గడువులోగా ఆ వివరాలు సమర్పించింది. ఈ మేరకు సుప్రీంకోర్టులో ఓ అఫిడవిట్ దాఖలు చేసింది. ధర్మాసనం ఆదేశాల మేరకు తాము వివరాలన్నీ ఎన్నికల సంఘానికి సమర్పించినట్టు అందులో పేర్కొంది. పెన్‌ డ్రైవ్‌ రూపంలో ఈ వివరాలు ఇచ్చినట్టు తెలిపింది. అందులో రెండు PDF ఫైల్స్‌ ఉన్నాయని, వాటికి పాస్‌వర్డ్ ప్రొటెక్షన్ కూడా ఉందని అఫిడవిట్‌లో వెల్లడించింది. 2019 ఏప్రిల్ నుంచి 2024 ఫిబ్రవరి 15వ తేదీ వరకూ మొత్తంగా 22,217 ఎలక్టోరల్ బాండ్స్‌ విక్రయించినట్టు తెలిపింది. వీటిలో రాజకీయ పార్టీలు దాదాపు  22,030 బాండ్స్‌ని రెడీమ్ చేసుకున్నాయని స్పష్టం చేసింది. మిగతా 187 బాండ్స్‌ని రెడీమ్ చేసి నిబంధనల ప్రకారం ఆ నిధులన్నీ ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధిలో జమ చేసినట్టు తెలిపింది. నిజానికి ఈ స్కీమ్ ప్రకారం..దాతలు ఎవరైనా SBI నుంచి బాండ్స్‌ని కొనుగోలు చేసి తమకి నచ్చిన పార్టీకి విరాళం ఇచ్చేందుకు వీలుంది. 15 రోజుల్లోగా ఆ బాండ్స్‌ని రెడీమ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఆలోగా రెడీమ్ చేసుకోకపోతే అవి ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధిలో జమ అవుతాయి. అయితే...సుప్రీంకోర్టు ఫిబ్రవరి 15వ తేదీన సంచలన తీర్పునిచ్చింది. ఈ బాండ్‌ల విక్రయాలను నిలిపివేయాలని ఆదేశించింది. నల్లధనాన్ని అరికట్టడానికి ఇదొక్కటే మార్గం కాదని స్పష్టం చేసింది. 


 






రూ.16,518 కోట్ల విలువైన ఎలక్టోరల్ బాండ్స్‌ని SBI విక్రయించినట్టు తెలిసింది. అయితే...అంతకు ముందు SBI ఈ వివరాలు వెల్లడించేందుకు జూన్ 30వ తేదీ వరకూ గడువు ఇవ్వాలని కోరింది. కానీ దీనిపై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఇన్ని రోజులు ఏం చేశారంటూ మండి పడింది. 24 గంటల్లోగా వివరాలన్నీ ఎన్నికల సంఘానికి సమర్పించాలని ఆదేశించింది. మార్చి 15వ తేదీ సాయంత్రంలోగా వెబ్‌సైట్‌లోనూ ఈ వివరాలు పొందుపరచాలని స్పష్టం చేసింది. కోర్టు ఆదేశాల మేరకు ఈ వివరాలను ఈసీకి సమర్పించింది SBI. 


రాజకీయ పార్టీలకు ఆదాయం వచ్చే మార్గాల్లో ఒకటైన ఎలక్టోరల్ బాండ్స్ విషయంలో సుప్రీంకోర్టు ఫిబ్రవరి 15న ఇదే ధర్మాసనం కీలకమైన తీర్పు వెలువరించింది. కొన్నేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎలక్టోరల్ బాండ్స్ విధానంలో భాగంగా.. ఎవరు ఎంత విరాళాన్ని ఏ పార్టీకి ఇచ్చారనే వివరాలు రహస్యంగా ఉంచుతారు. ఎలక్టోరల్ బాండ్స్ ఇచ్చే వెసులుబాటు కేవలం ఎస్బీఐకు మాత్రమే కల్పించారు. ఇలా పొలిటికల్ పార్టీలు గోప్యంగా ఫండింగ్ పొందే విధానాన్ని సుప్రీంకోర్టు.. రాజ్యాంగబద్ధం కాదని స్పష్టం చేసింది. దాతల వివరాలను కచ్చితంగా ఎస్‌బీఐ ఎన్నికల సంఘానికి సమర్పించాలని ఆదేశించింది. సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలను దేశంలోని ప్రతిపక్ష నాయకులు ప్రశంసించారు.