CM Hemant Disqualification: 


భేటీ అయిన కొద్ది గంటల్లోనే..


ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌పై ఎమ్మెల్యేగా అనర్హతా వేటు వేస్తూ..గవర్నర్ రమేశ్ బైస్‌ నిర్ణయం తీసుకున్నారు. ఆయన సభ్యత్వాన్ని రద్దు చేశారు. అక్రమ మైనింగ్ కేసులో ఆయన హస్తం ఉందన్న కారణంగా..ఈ నిర్ణయం తీసుకుంది. గనుల లీజు వ్యవహారంలో సోరెన్ అక్రమాలకు పాల్పడ్డారని కేంద్రం ఆరోపిస్తోంది. ఆయనపై అనర్హతా వేటు వేయాలని గవర్నర్‌ను భాజపా కోరింది. ఆ తరవాతే ఈ సంచలన నిర్ణయం వెలువడింది. అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ గవర్నర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆయనపై అనర్హతా వేటు వేయాలని ఎన్నికల సంఘం ఇప్పటికే గవర్నర్‌కు ప్రతిపాదించింది. అయితే ఇది కేవలం ఊహాగానాలే సోరెన్ వర్గాలు వాదించినా...చివరకు ఆయనపై అనర్హత వేటు పడక తప్పలేదు. రాష్ట్రంలోని స్థితిగతులపై ఎమ్మెల్యేలు, మంత్రులతో సోరెన్ భేటీ అయిన కొద్ది గంటల్లోనే ఈ నిర్ణయం వెలువడటం ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌ సన్నిహితుడు ప్రేమ్ ప్రకాశ్ ఇంట్లో రెండు AK-47 గన్స్‌ని స్వాధీనం చేసుకుంది ఈడీ. అక్రమ మైనింగ్, బెదిరింపుల కేసులో ప్రకాశ్‌కు హస్తం ఉందని అనుమానించిన ఈడీ అధికారులు ఆయన ఇంట్లో సోదాలు చేశారు. హర్ము హౌజింగ్ కాలనీలోని ఆయన ఇంట్లో అల్మారాలో AK-47 గన్స్ ఉన్నట్టు గుర్తించారు. అక్రమ మైనింగ్ కేసులో రాంచీలో పలు చోట్ల ఈడీ సోదాలు నిర్వహించింది. మనీలాండరింగ్ కేసుకు సంబంధించిన అందరి ఇళ్లనూ టార్గెట్ చేసింది. ఝార్ఖండ్, బిహార్, తమిళనాడు, ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లలో 17-20 చోట్ల సోదాలు చేసేందుకు సిద్ధమవుతోంది. సీఎం హేమంత్ సోరెన్‌కు రాజకీయసన్నిహితుడైన పంకజ్ మిశ్రాను ఇప్పటికే ఈ అంశంపై విచారణ చేపట్టింది. మిశ్రా అసోసియేట్ బచ్చు యాదవ్‌నూ ప్రశ్నించింది ఈడీ. ఆ తరవాత ఈ ఇద్దరినీ అరెస్ట్ చేసింది. ఝార్ఖండ్‌లో అక్రమ మైనింగ్‌ ద్వారా రూ.100 కోట్లు సంపాదించారన్న అనుమానాల నేపథ్యంలో దూకుడు పెంచింది. 


సన్నిహితుల ఇళ్లలో సోదాలు..


జులై 8వ తేదీన మిశ్రాతో పాటు ఆయన సన్నిహితుల ఇళ్లలో సోదాలు చేశారు ఈడీ అధికారులు. సాహిబ్‌గంజ్, బర్హెట్, రాజ్‌మహల్, మిర్జా చౌకీ, బర్హర్వా సహా 19 ప్రాంతాల్లో రెయిడ్‌లు నిర్వహించింది. మొత్తం 50 బ్యాంక్ ఖాతాల్లోని రూ.13.32 కోట్లను జప్తు చేసింది. మార్చిలోనే మిశ్రాపై ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ (PMLA)కేసు నమోదు చేశారు. అయితే...దీనిపై స్పందించిన పంకజ్ మిశ్రా..తనను అన్యాయంగా ఈ స్కామ్‌లో ఇరికించారని మండి పడ్డారు. అయితే ఈడీ మాత్రం కచ్చితంగా కుంభకోణం జరిగిందని స్పష్టం చేస్తోంది. విచారణలో భాగంగా పలు ఆధారాలు, స్టేట్‌మెంట్‌లు, డిజిటల్ ఎవిడెన్స్‌లు సేకరించినట్టు వెల్లడించింది. సాహిబ్‌గంజ్‌లో అక్రమ మైనింగ్‌తో కోట్ల రూపాయలు సంపాదించార నటానికి ఆధారాలున్నట్టు తెలిపింది. అటవీ ప్రాంతంలోనూ మైనింగ్ చేశారని స్పష్టం చేసింది. 


ఇటీవలే కేసీఆర్‌తో భేటీ..


కొద్ది రోజులుగా భాజపా...తాను అధికారంలో లేని రాష్ట్రాల్లో ఇలా దాడులు చేయిస్తోందన్న వాదన వినిపిస్తోంది. బిహార్‌లో ఓ వైపు సీబీఐ సోదాలు జరుగుతుండగానే...ఇప్పుడు ఝార్ఖండ్‌లో ఈడీ దాడులు కొనసాగుతున్నాయి. ఈ మధ్య ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరేన్...తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పలు సందర్భాల్లో భేటీ అయ్యారు. కేంద్రంలో భాజపాకు ప్రత్యామ్నయ శక్తిగా నిలవాలని భావిస్తున్న కేసీఆర్...సోరెన్‌ను కలవటంపై చర్చ జరిగింది. ఇటీవల హేమంత్ సొరేన్ తన కుటుంబ సభ్యులతో కలిసి వ్యక్తి గత కారణాలతో హైదరాబాద్‌ వచ్చారు. ఆ సమయంలో ఆయన సీఎం కేసీఆర్‌తో భేటీ అయ్యారు. గతంలో ఒకసారి హేమంత్‌ సొరెన్‌ హైదరాబాద్‌ లో  కేసీఆర్‌తో సమావేశమయ్యారు. 
ఇటీవల సీఎం కేసీఆర్‌ కూడా రాంచీ వెళ్లి హేమంత్‌ సొరేన్‌తో సమావేశమయ్యారు. దేశ రాజకీయాలతో కేంద్ర ప్రభుత్వ వైఖరి సహా సమకాలీన అంశాలపై చర్చించారు. ఇరువురు  భేటీ కావడంతో రాజకీయ ప్రాధాన్యం ఏర్పడింది. సీఎం కేసీఆర్‌ జాతీయ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తానని టీఆర్ఎస్ ప్లీనరీలో ప్రకటించిన తర్వాత ఈ భేటీ జరిగింది. 


Also Read: Congress Crisis: కాంగ్రెస్‌ను ముంచుతోంది అదేనా? ట్రబుల్‌షూటర్ల కొరతే డౌన్‌ఫాల్‌కు కారణమా?