Eggs Chicken Price Hike in Telangana: తెలంగాణ రాష్ట్రంలో నిత్యావసరాల ధరలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. నిత్యావసర వస్తువుల రేట్లు పెరిగి కాస్త తగ్గుతున్నాయనే సమయానికి మరో వస్తువు రేటు పెరగడానికి రెడీగా ఉంటోంది. మొన్నటివరకు ఉల్లిగడ్డలు, టమాల ధరలు మండిపోగా, తర్వాత చికెన్ రేట్లు అనంతరం వెల్లుల్లి ఇలా ఒక్కొక్కటిగా ధరలు ఎగబాకుతూ సామాన్యుని జేబుకు చిల్లు పెడుతున్నాయి. ఇక ఇప్పుడు కోడిగుడ్ల వంతు వచ్చింది. రాష్ట్రంలో కోడిగుడ్ల ధరలు కొండెక్కి కూర్చున్నాయి. 


కార్తికమాసం ముగిసిన తర్వాత కోడి గుడ్ల వినియోగం విపరీతంగా పెరగటంతో ధరలు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయి. గత నెలలో ఒక్కో గుడ్డు ధర కేవలం రూ.5.50 మాత్రమే ఉండగా వారం రోజుల క్రితం రూ.6కు చేరుకుంది. కాగా.. ఇప్పుడు ఏకంగా రూ.7 నుంచి 8 గా పలుకుతోంది. వారం రోజుల్లోనే డజను గుడ్ల ధర ఏకంగా రూ.72 నుంచి రూ.96 కు చేరుకోవటం గమనార్హం. 


హోల్‌సేల్‌లో ఒక్కో గుడ్డు ధర రూ.5.76 ఉండగా.. రిటైల్‌లో రూ.7గా అమ్ముతున్నారు. కొన్ని కొన్ని దుకాణాల్లో రూ.7.50, రూ.8గా కూడా అమ్ముతుండటం గమనార్హం. ప్రస్తుతం ఒక ట్రే ధర రూ.200  నుంచి రూ.240కి చేరడంతో రిటైల్‌ మార్కెట్‌లో రూ.7 నుంచి రూ.8 వరకు అమ్ముతున్నారు. మరోవైపు చికెన్‌ ధర కూడా పెరిగింది. కార్తిక మాసంలో కిలో చికెన్‌ రూ.170 నుంచి రూ.190 వరకు పలకగా.. తాజాగా రూ.250 -300  చేరటం మాంసాహారులను కంగారు పెడుతోంది.