Delhi Liquor Scam Case: లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన అరవింద్ కేజ్రీవాల్ న్యాయపోరాటం కొనసాగిస్తూనే ఉన్నారు. లోక్‌సభ ఎన్నికల కోసం ప్రచారం చేసేందుకు అనుమతినివ్వాలంటూ మధ్యంతర బెయిల్ ఇవ్వాలంటూ కోర్టుని ఆశ్రయించారు. సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై ఈడీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. కేజ్రీవాల్ పిటిషిన్‌ని సవాల్ చేస్తూ మరో పిటిషన్ దాఖలు చేసింది. చట్టాలు అందరికీ సమానమే అని తేల్చి చెప్పింది. ఆయనకు ఎన్నికల్లో ప్రచారం చేసే హక్కు లేదని స్పష్టం చేసింది. అది ప్రాథమిక హక్కుగా పరిగణించలేమని వెల్లడించింది. ఈడీ డిప్యుటీ డైరెక్టర్ భాను ప్రియ ఈ పిటిషన్ దాఖలు చేశారు. నిజానికి కేజ్రీవాల్ వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టాల్సి ఉంది. సరిగ్గా ఒకరోజు ముందు ఈడీ ఇలా అఫిడవిట్‌ దాఖలు చేసింది. 


"ఎన్నికల్లో ప్రచారం చేయడం అనేది ప్రాథమిక హక్కుగా పరిగణించలేం. ఇది రాజ్యాంగ పరంగా, చట్టపరంగా లభించే హక్కుగానూ చెప్పలేం. ఈడీకి తెలిసినంత వరకూ ఓ వ్యక్తి ఇలా జైల్‌లో ఉన్నప్పుడు ఎన్నికలు జరిగితే ప్రచారానికి అనుమతినిచ్చిన దాఖలాలు లేవు. ఆ వ్యక్తి పోటీ చేయకపోయినా సరే అనుమతి ఇవ్వలేదు" 


- ఈడీ అఫిడవిట్






కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్‌ అడగడాన్ని ఈడీ తీవ్రంగా వ్యతిరేకించింది. గతంలోనూ సమన్లు జారీ చేసిన సమయంలో ఎన్నికల పేరు చెప్పి ఇలాగే తప్పించుకున్నారని గుర్తు చేసింది. అప్పుడు 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగాయని, అదే సాకుగా చూపించారని మండి పడింది. ఎన్నికల ప్రచారానికి అనుమతినిస్తూ పోతే ఎవరినీ అరెస్ట్ చేయడానికి వీలుండకపోవచ్చని అభిప్రాయపడింది. 


"గత మూడేళ్లలో దాదాపు 123 ఎన్నికలు జరిగాయి. ఇలా ఎన్నికల ప్రచారానికి అనుమతినిస్తూ పోతే ఏ రాజకీయ నేతనీ అరెస్ట్ చేయడానికి వీలుండదు. ఎవరినీ జ్యుడీషియల్ కస్టడీలో ఉంచలేం. ఎప్పుడూ ఏవో ఎన్నికలు జరుగుతూనే ఉంటాయి. వాటిని కారణంగా చూపించలేం కదా. ఎన్నికల పేరు చెప్పి వీళ్లు మరి కొన్ని నేరాలు చేసే ప్రమాదముంది. "


- ఈడీ అఫిడవిట్ 


రాజకీయ నేతలు చట్టం నుంచి మినహాయింపులు కోరుకోవడాన్ని తప్పుబట్టింది ఈడీ. చట్టం ముందు అందరూ సమానమే అని తేల్చి చెప్పింది. అంతే కాదు. జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న కొందరు నేతలు ఎన్నికల బరిలో నిలబడి గెలిచినా...వాళ్లకి మధ్యంతర బెయిల్ ఇవ్వలేదని స్పష్టం చేసింది. చాలా రోజులుగా బెయిల్ కోసం కేజ్రీవాల్ ప్రయత్నిస్తూనే ఉన్నారు. కానీ ఈడీ మాత్రం ఎప్పటికప్పుడు ఈ పిటిషన్స్‌ని వ్యతిరేకిస్తూ వస్తోంది. 


Also Read: Gaza News: ఫ్యుయెల్ లేక మూతపడుతున్న హాస్పిటల్స్‌, గాజాలో యుద్ధ బాధితులకు నరకయాతన