delhi liquor scam ED :   ఢిల్లీ లిక్కర్‌‌‌‌ స్కాం​ కేసుకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చార్జ్షీట్ దాఖలు చేసింది. అందులో సమీర్ మహేంద్రును ఏ1గా పేర్కొంది. ఏ2, ఏ3, ఏ4, ఏ5గా 4 కంపెనీల పేర్లు చేర్చింది. రౌస్ అవెన్యూ కోర్టులో దాదాపు 3వేల పేజీలతో కూడిన ఛార్జ్ షీట్ సాఫ్ట్ కాపీతో కూడిన హార్డ్ డిస్క్ సహా డాక్యుమెంట్లను కోర్టుకు సమర్పించింది. ఇదే కేసులో ఇప్పటికే అరెస్టైన వారిపై కూడా త్వరలోనే సప్లిమెంటరీ ఛార్జ్ షీట్స్ దాఖలు చేయనున్నట్లు ఈడీ కోర్టుకు చెప్పింది. అనంతరం న్యాయమూర్తి కేసు విచారణను డిసెంబర్ 12కు వాయిదా వేశారు. లిక్కర్ స్కాంలో మనీ లాండరింగ్ కు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సెప్టెంబర్ 27న సమీర్ మహేంద్రును అరెస్ట్ చేసింది. 


ఇతర నిందితులపై విడిగా చార్జిషీట్లు


అరెస్ట్ చేసిన 60 రోజుల లోపు చార్జిషీటు దాఖలు చేయాల్సి ఉండటం.. ఆ తేదీ ఆదివారంతో ముగియనుండటంతో ఈడీ హడావుడిగా చార్జిషీటు దాఖలు చేసినట్లుగా తెలుస్తోంది. అలా దాఖలు చేయకపోతే.. నిందితుడు బెయిల్ పొందడానికి అవకాశం ఉంటుంది.  లిక్కర్ స్కాం కేసులో అరెస్టైన మరో నిందితుడు విజయ్ నాయర్  ను కోర్టులో హాజరు పరచారు. మనీలాండరింగ్లో విజయ్ నాయర్ పాత్ర ఉందని కోర్టుకు వివరించారు.  కస్టడీ ముగియడంతో సీబీఐ స్పెషల్ కోర్టు విజయ్ నాయర్కు 14 రోజుల రిమాండ్ విధించింది. కేసు తదుపరి విచారణను డిసెంబర్ 8కి వాయిదా వేసింది.


ఇప్పటికి ఈడీ అదుపులో ఐదుగురు 


ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ కీలకంగా విచారణ జరుపుతోంది. పలువురు ప్రముఖుల్ని విచారిస్తోంది. అలాగే అరబిందో డైరక్టర్ శరత్ చంద్రారెడ్డిని కూడా అరెస్టు చేశారు. అయితే తొలి చార్జిషీటులో ఆయన పేరు లేదు. ఆయన పై విడిగా చార్జిషీటు దాఖలు చేసే అవకాశం ఉంది. ఇప్పటికీ అభిషేక్ బోయినపల్లి, విజయ్ నాయక్, శరత్ చంద్రారెడ్డి, వినయ్ బాబు.. జైల్లో ఉన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో సౌత్ లాబీ పేరుతో అవినీతికి పాల్పడిన వీరు.. అక్రమ మార్గంలో  మద్యం లైసెన్స్‌లు పొందినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. మద్యం పాలసీని మద్యం తయారీ కంపెనీలకి, L1 లైసెన్స్ అనుకూలంగా రూపొందించేందుకు   నగదును లంచంగా ఇచ్చారని చెబుతున్నారు.


సౌత్ గ్రూప్ నుంచి లంచాలు తీసుకుని పంజాబ్ ఎన్నికల్లో ఉపయోగించారని అభియోగం 


ఢిల్లీ ఆప్ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు అలాగే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో ఉన్న అధికారులు ఈ నగదును లంచంగా తీసుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. వీటికి సంబంధించి ప్రధానంగా డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందన్న దానిపై ఈడీ దర్యాప్తు చేస్తోంది. ఈ క్రమంలోనే సమీర్, మహేందర్, శరత్ చంద్రారెడ్డి, వినయ్ బాబు, విజయ నాయక్ లకు ఉన్న సంబంధం గురించి ఆరా తీస్తున్నారు. అ మొదట అదుపులోకి తీసుకున్న సమీర్ మహేంద్ర సహా మొత్తం ఐదుగురు.. ప్రస్తుతం ఈడీ అదుపులో ఉన్నారు. ఇప్పటికే వీరి నుంచి సేకరించిన ఆధారాల  సాయంతో అరుణ్ రామచంద్ర పిల్లై. గోరంట్ల బుచ్చిబాబును హైదరాబాద్ ఈడీ అధికారులు ప్రశ్నించారు. 


శుక్రవారమే తొలి చార్జిషీటు దాఖలు చేసిన సీబీఐ 


ఈ కేసులో ఇప్పటికే సీబీఐ కూడా చార్జిషీటు దాఖలు చేసింది.   ఆప్‌నేత విజయ్‌ నాయర్‌, అభిషేక్‌ బోయిన్‌పల్లితో సహా ఏడుగురిపై అభియోగాలు మోపుతూ రోస్‌ అవెన్యూ కోర్టులో చార్జిషీట్‌ ఫైల్‌ చేసింది. చార్జిషీట్‌లో ఇద్దరు ప్రభుత్వ అధికారులు ఉండగా.. అయిదుగురు ప్రైవేటు వ్యక్తులు ఉన్నారు. మొత్తం 10 వేల పేజీలతో సీబీఐ చార్జ్‌ షీట్‌ రూపొందించింది. చార్జిషీట్‌లో విజయ్‌ నాయర్‌, అభిషేక్‌, సమీర్‌ మహేంద్రు, అరుణ్‌ రామచంద్ర పిల్లై, ముత్తా గౌతమ్‌, కుల్‌దీప్‌ సింగ్‌, నరేందర్‌ సింగ్‌ పేర్లు చేర్చింది.