శివసేన ఎంపీ సంజయ్ రౌత్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అదుపులోకి తీసుకుంది. ఆదివారం ఉదయం నుంచి ఆయన ఇంట్లో ఈడీ అధికారులు సోదా చేస్తున్నారు. సోదాలు మొదలైన కొన్ని గంటల తర్వాత ఆయన్ను ఈడీ అరెస్ట్ చేసినట్లు ఏఎన్‌ఐ వార్తా సంస్థ తెలిపింది.
సోదాలు
పత్రా చాల్ భూ కుంభకోణం కేసులో విచారణ కోసం హాజరుకావాలని సంజయ్ రౌత్‌కు ఈడీ రెండుసార్లు సమన్లు జారీ చేసింది. ఆ ఆదేశాలను పాటించకపోవడంతో ఆదివారం ఉదయం ఆయన నివాసంలో సోదాలు చేపట్టింది.
ఆదివారం ఉదయం 7 గంటలకు ఈడీ అధికారుల బృందం సీఐఎస్ఎఫ్ సిబ్బందితో కలిసి ముంబయి బందూప్‌లో ఉన్న సంజయ్ నివాసానికి చేరుకున్నారు. ముంబయిలోని ఓ భవనం అభివృద్ధి, దానికి సంబంధించిన లావాదేవీలు, ఆయన సతీమణి, సన్నిహితుల లావాదేవీలపై అధికారులు ప్రశ్నించారు.
లొంగిపోయేది లేదు
ఈడీ అధికారులు తన నివాసానికి చేరుకున్న తర్వాత సంజయ్ రౌత్ ఓ ట్వీట్ చేశారు. ఎన్ని విధాలుగా భయపెట్టినా తగ్గేదేలేదు అన్నారు.