ED conducted searches in AP and Karnataka :   మనీ లాండరింగ్‌కు సంబంధించిన ఒక కేసులో కర్నాటక, ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రదేశాలలో జరిపిన సోదాలలో లెక్కల్లో చూపని రూ. 31 లక్షల నగదు, అత్యంత విలువైన అనేక కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఇడి) మంగళవారం ప్రకటించింది. సూర్య నారాయణ రెడ్డి, భరత్ రెడ్డి అనే ఇద్దరు వ్యక్తులపై పిఎంఎల్‌ఎలోని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు ఇడి తెలిపింది. కర్నాటకలోని బళ్లారిలో నమోదైన ఒక ఎఫ్‌ఐఆర్ ఆధారంగా ఫిబ్రవరి 10న సోదాలు నిర్వహించినట్లు ఒక ప్రకటనలో ఇడి తెలిపింది.                    


కర్నాటక అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు దాదాపు రూ. 42 కోట్ల నగదును సమీకించిన భరత్ రెడ్డి చట్ట వ్యతిరేక కార్యకలాపాల కోసం ఈ నిధులను వినియోగించినట్లు తమకు కీలక ఆధారాలు లభించాయని ఇడి తెలిపింది. తాము జరిపిన సోదాలలో అత్యంత కీలకమైన పత్రాలు, వ్యాపార రికార్డులు, స్థిర చరాస్తులకు చెందిన వివరాలు లభించాయని తెలిపింది. వీటితోపాటు రూ. 31 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఇడి వివరించింది.        

     


చట్ట వ్యతిరేక చెల్లింపుల కోసం నిధులను సమీకరించారని, ఇందులో భరత్ రెడ్డి, అతని సహాయకుడు రత్న బాబు, మరి కొందరి పాత్ర ఉన్నట్లు ఆధారాలు లభించాయని ఇడి తెలిపింది. అంతేగాక భరత్ రెడ్డి సోదరుడైన శరత్ రెడ్డి విదేశీ కంపెనీలలో గుర్తుతెలియని పెట్టుబడులు పెట్టినట్లు కూడా దర్యాప్తులో తేలిందని ఇడి కేంద్ర దర్యాప్తు సంస్థ తెలిపింది. బినామీ పేర్లతో ఆస్తులలో పెట్టుబడులు పెట్టిన ఈ వ్యక్తులు తమ బంధువులకు తెలియకుండానే వారి బ్యాంకు ఖాతాలను వాడుకుని రుణాలు పొందినట్లు కూడా వెల్లడైందని ఇడి తెలిపింది.                     


తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు   కర్నాటకలోని బెంగళూరులో భారీగా డబ్బు పట్టుకున్నారు ఐటీ అధికారులు.  ఓ  కార్పొరేటర్  ఇంట్లో భారీగా నగదును స్వాధీనం చేసుకున్నారు. సరైన ధృవపత్రాలు లేకపోవడంతో  42 కోట్లు సీజ్ చేశారు.   బెంగళూరులోని ఓ అపార్ట్‌మెంట్ నుంచి ఈ హవాలా మార్గంలో నగదు బదిలీ జరుగుతున్నట్లు ఐటీ అధికారులకు సమాచారం అందింది. ఈ సమాచారం మేరకు  ఐటీ అధికారులు అక్టోబర్ 12 వతేదిన  గురువారం రాత్రి బెంగళూరులోని ఆర్టీ నగర్ లో   సోదాలు నిర్వహించారు.   కాంగ్రెస్‌ మాజీ కార్పొరేటర్‌ , ఆయన బంధువు ఇంట్లో సోదాలు నిర్వహించగా అట్టపెట్టెలో  భారీగా నగదును గుర్తించారు. మొత్తం 22 బాక్సుల్లో 42 కోట్లు ఉన్నాయి.   మొత్తంగా 50 కోట్ల రూపాయలు తరలించేందుకు ఏర్పాట్లు చేశారని తెలుస్తోంది. ఇందులో ఇప్పటికే 8 కోట్ల రూపాయలు తెలంగాణ తరిలించినట్టు గుర్తించారు అధికారులు. ఈ డబ్బుకు సంబంధించిన లింకులు ఏపీలో కూడా ఉండటం ఆసక్తికరంగా మారింది.