EC releases names of 65 lakh Bihar voters deleted list:  సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎన్నికల సంఘం బీహార్ లో తొలగించిన 65 లక్షల మంది ఓటర్ల జాబితాలను ప్రకటించింది.  ఓటర్ల తొలగింపు వివరాలను ఆగస్టు 19, 2025 నాటికి బహిర్గతం చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.ఒక రోజు ముందుగానే ఈసీ ఈ జాబితా విడుదల చేసింది.  

తొలగించిన 65 లక్షల ఓటర్లలో  18.66 లక్షల మంది మరణించినవారు, 26.01 లక్షల మంది  ఇతర నియోజకవర్గాలకు తరలివెళ్లినవారు,  7 లక్షల మంది పలు చోట్ల ఓటర్లుగా   నమోదైనవారు ఉన్నాని ఈసీ తెలిపింది. అలాగే  11,484 మందిని గుర్తించలేదు.   ఈ ఓటర్లను ‘ASD’ (Absentee, Shifted, Dead) ఓటర్లుగా వర్గీకరించారు.  ఈ జాబితాలు జిల్లా ఎన్నికల అధికారుల వెబ్‌సైట్‌లలో ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయి.  ఎలక్టర్స్ ఫోటో ఐడెంటిటీ కార్డ్ (EPIC) నంబర్‌తో  సెర్చ్  చేసి తెలుసుకోవచ్చు. ఆ ఓట్లను ఎందుకు తీసేశారో కారణాలు కూడా వివరిస్తున్నారు. 

ఆగస్టు 14, 2025న, సుప్రీం కోర్టు ఈసీని 65 లక్షల ఓటర్ల తొలగింపు వివరాలను, వారి పేర్లతో పాటు తొలగింపు కారణాలను  అంటే మరణం, వలస, డూప్లికేట్ ఎంట్రీలు  వంటి కారణాలను న్‌లైన్‌లో ప్రచురించాలని ఆదేశించింది  ఈ జాబితాలు బూత్ వారీగా పంచాయత్ , బ్లాక్ డెవలప్‌మెంట్ కార్యాలయాల్లో కూడా ప్రదర్శించాలని, వార్తాపత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా ద్వారా విస్తృతంగా ప్రచారం చేయాలని కోర్టు సూచించింది. ఓటర్ల గుర్తింపు కోసం ఆధార్ కార్డును కూడా ఒక పత్రంగా అంగీకరించాలని కోర్టు ఈసీకి  సూచించింది.  చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (సీఈసీ) జ్ఞానేష్ కుమార్ ఈ SIR ప్రక్రియ ఓటరు జాబితాలలోని లోపాలను సరిచేయడానికి ఉద్దేశించినదని, “వోట్ చోరీ” ఆరోపణలను నిరాధారమైనవిగా తోసిపుచ్చారు.

బీహార్‌లో జూన్ 24, 2025 నుంచి  స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్  ప్రారంభించారు.   2003 తర్వాత రాష్ట్రంలో జరిగిన మొదటి  ఓటర్ జాబితా పరిశీలన.  ఈ ప్రక్రియలో 1 లక్ష బూత్ లెవల్ అధికారులు, 4 లక్షల మంది వాలంటీర్లు,  1.5 లక్షల బూత్ లెవల్ ఏజెంట్లు (BLAs) పాల్గొన్నారు.  జూన్ 24, 2025 నాటికి బీహార్‌లో మొత్తం 7.89 కోట్ల ఓటర్లు ఉన్నారు, వీరిలో 90.67% మంది ఎన్యూమరేషన్ ఫారమ్‌లు సమర్పించారు. 90.37% డిజిటైజ్ చేశారు.  ఆర్జేడీ, కాంగ్రెస్ మొదలైనవి ఇలా చేయడాన్ని   “వోట్ చోరీ”గా అభివర్ణించి, ఈసీ బీజేపీతో కుమ్మక్కై ఓటరు జాబితాను మార్చిందని ఆరోపించింది. 

ఇప్పుడు సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం.. జాబితాను ఆన్ లైన్ లో పెట్టినందున ఎంత మందికి అర్హులైన ఓటర్లను ఓటర్లుగా తీసివేశారో.. ఎంత మంది అనర్హులకు ఓట్లు కేటాయించారో బయట పెట్టాల్సి ఉంది.