J&K Assembly Elections 2024: ఇటీవలే జమ్ముకశ్మీర్‌లో లోక్‌సభ ఎన్నికలు జరిగాయి. ఇక అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ కసరత్తు చేస్తోంది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన ప్రక్రియను మొదలు పెట్టింది. ఈ మేరకు ఎన్నికల సంఘం సెక్రటరీ జయదేబ్‌ లహిరి ఓ ప్రెస్‌నోట్ విడుదల చేశారు. ఎన్నికల గుర్తులను కేటాయించే ప్రక్రియను ప్రారంభించనున్నట్టు వెల్లడించారు. లోక్‌సభ ఎన్నికల్లో జమ్ముకశ్మీర్‌లో పోలింగ్ శాతం ఆశించిన స్థాయిలో నమోదు కావడం పట్ల ఈసీ సంతృప్తి వ్యక్తం చేసింది. అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఓటర్లు ఇదే స్థాయిలో ఉత్సాహం చూపించేలా చర్యలు చేపట్టనుంది. ఇప్పటి వరకూ స్థానికంగా రిజిస్టర్ అయిన పార్టీలకు, గుర్తింపు లభించని పార్టీలకు ఇకపై గుర్తులు కేటాయించేందుకు సిద్ధమవుతున్నట్టు ప్రకటించింది. ఈ నెల 22 న జమ్ముకశ్మీర్‌లో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ని అమల్లోకి తీసుకొచ్చే అవకాశాలున్నాయి. 2014లో చివరిసారి ఇక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. అప్పటి నుంచి స్థానిక రాజకీయ పార్టీలు ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తూనే ఉన్నాయి. అయితే...ప్రత్యేక ప్రతిపత్తి ఇచ్చే ఆర్టికల్ 370 రద్దుతో ఒక్కసారిగా అలజడి రేగింది. దీనిపై సుప్రీంకోర్టులో పిటిషన్‌లు దాఖలయ్యాయి. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తూ కోర్టు ఆ పిటిషన్‌లను పక్కన పెట్టింది. అంతే కాదు. ఈ ఏడాది సెప్టెంబర్‌లోగా జమ్ముకశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది.


జమ్ముకశ్మీర్ ప్రజలు త్వరలోనే ప్రజాస్వామ్యయుతంగా తమకు నచ్చిన ప్రభుత్వాన్ని ఎన్నుకునే అవకాశం కలుగుతుందని సీఈసీ రాజీవ్ కుమార్ స్పష్టం చేశారు. 2014లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ, పీడీపీ సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. 2016లో PDP చీఫ్ ముఫ్తీ మహమ్మద్ సయ్యద్ మృతి చెందారు. ఆ తరవాత ఈ  సంకీర్ణ కూటమికి ఆయన కూతురు మెహబూబా ముఫ్తీ నేతృత్వం వహించారు. అయితే..2019లో బీజేపీ ఈ కూటమి నుంచి తప్పుకుంది. ఫలితంగా మెహబూబా ముఫ్తీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆ సమయంలో గవర్నర్‌ పాలన, ఆ తరవాత రాష్ట్రపతి పాలన విధించారు. 2019లో ఆగస్టు 5 వ తేదీన కేంద్ర ప్రభుత్వం సంచలన ప్రకటన చేసింది. జమ్ముకశ్మీర్‌కి ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్ 370ని రద్దు చేస్తున్నట్టు స్పష్టం చేసింది.