EC dismisses Rahul Gandhi voter theft allegations: ఎన్నికల సంఘంపై రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలు మరోసారి సంచలనం రేపుతున్నాయి. రాహుల్ గాంధీ, ఎన్నికల సంఘం భారతీయ జనతా పార్టీ (BJP)కి అనుకూలంగా " ఓట్ల దొంగతనం"లో పాలు పంచుకుందని ఆరోపించారు. ఈ ఆరోపణలకు సంబంధించి విపక్షాలు నిర్వహించిన స్వతంత్ర దర్యాప్తులో "పక్కా సాక్ష్యాలు" లభించాయన్నారు. ఇవి బయట పెడితే "అణుబాంబు" స్థాయిలో రియాక్షన్ వస్తుందని, ఈ సాక్ష్యాలు బహిర్గతమైతే ECIకి దాక్కునే అవకాశం ఉండదని హెచ్చరించారు.
బీహార్‌లో ఓటర్ల జాబితా కోసం నిర్వహిస్తున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియపై రాహుల్ గాంధీ , విపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఈ ప్రక్రియను "ప్రజాస్వామ్యంపై దాడి"గా అభివర్ణిస్తున్నరాు. SIR ప్రక్రియను నిలిపివేయాలని పార్లమెంట్‌లో ఈ అంశంపై ప్రత్యేక చర్చ జరపాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.
2024 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో ఓటర్ల జాబితాలో అకస్మాత్తుగా 1 కోటి కొత్త ఓటర్లు చేర్చారని రాహుల్ గాంధీ ఆరోపించారు. ఈ అసాధారణ పెరుగుదల ECI చర్యలపై అనుమానాలను రేకెత్తించిందన్నారు. 2023 మధ్యప్రదేశ్ శాసనసభ ఎన్నికలు మరియు 2024 లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాత విపక్షాల అనుమానాలు మరింత బలపడ్డాయని, ఈ ఎన్నికలలో కూడా సమానమైన అక్రమాలు జరిగాయని ఆరోపించారు. మహారాష్ట్ర ఎన్నికలలో ECI చర్యలు సరైనవి కావని గుర్తించిన తర్వాత, కాంగ్రెస్ ఆరు నెలల స్వతంత్ర దర్యాప్తును చేపట్టిందని, ఈ దర్యాప్తు ఫలితాలు ఆశ్చర్యకరమైనవని రాహుల్ గాంధీ తెలిపారు. ఈ " ఓట్ల దొంగతనం"లో పాల్గొన్న ECI అధికారులను, ఎంత ఉన్నత స్థానంలో ఉన్నా లేదా రిటైర్ అయినా, వదిలిపెట్టమని రాహుల్ గాంధీ హెచ్చరించారు. ఈ చర్యలు "దేశద్రోహం"కు సమానమని .. బాధ్యులైన వారిని కనుగొని శిక్షిస్తామని హెచ్చరించారు.
ECI, రాహుల్ గాంధీ ఆరోపణలను "ఆధారరహితం" , "బాధ్యతారహితం" అని తీవ్రంగా ఖండించింది. "రోజువారీ ఆధార రహిత ఆరోపణలను" ECI పట్టించుకోదన్నారు. ఎన్నికల అధికారులు ఇటువంటి బాధ్యతారహిత ప్రకటనలను పట్టించుకోకుండా నిష్పాక్షికంగా, పారదర్శకంగా పనిచేయాలని విజ్ఞప్తి చేసింది. బీహార్‌లో SIR ప్రక్రియ చట్టపరమైన మార్గదర్శకాల ప్రకారం జరుగుతోందని ECI తెలిపింది. ఈ ప్రక్రియపై విపక్షాల నుంచి అధికారిక ఫిర్యాదులు లేవని, రాహుల్ గాంధీ లేదా కాంగ్రెస్ నుంచి ఎటువంటి అధికారిక లేఖ లేదా సమావేశం కోసం అభ్యర్థన రాలేదని ECI వర్గాలు స్పష్టం చేశాయి. రాహుల్ గాంధీ ఆరోపణలు 10.5 లక్షల బూత్ లెవెల్ అధికారులు, 50 లక్షల పోలింగ్ అధికారులు, 1 లక్ష కౌంటింగ్ సూపర్‌వైజర్ల విశ్వసనీయతను ప్రశ్నించినట్లయిందని ఈసీ స్పష్టంచేశింది.