S Jaishankar At UNSC:
కౌంటర్ టెర్రరిజం కమిటీ సమావేశం..
ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి (United Nations Security Council)ప్రత్యేక సమావేశంలో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ పాల్గొన్నారు. దిల్లీలో ఐరాస భద్రతా మండలికి చెందిన కౌంటర్ టెర్రరిజం కమిటీ భేటీలో ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా సాగిస్తున్న పోరాటంలో భారత్ తన వంతు కృషి తప్పకుండా చేస్తుందని స్పష్టం చేశారు. అంతే కాదు. టెర్రరిజంపై యుద్ధానికి స్వచ్ఛందంగా 5 లక్షల డాలర్ల ఆర్థిక సాయం అందించేందుకు ముందుకొస్తున్నట్టు ప్రకటించారు. తద్వారా ఈ పోరాటాన్ని ఉద్ధృతం చేసేందుకు అవకాశం లభిస్తుందని అన్నారు. ఉగ్రవాదం కారణంగా...ప్రపంచ దేశాలకు ముప్పు పెరుగుతోందని అసహనం వ్యక్తం చేశారు జైశంకర్. ఆసియా, ఆఫ్రికా దేశాల్లో ఉగ్రవాదం కోరలు చాస్తోందని వెల్లడించారు. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఉగ్రవాదాన్నిఅణిచివేసేందుకుప్రయత్నిస్తున్నప్పటికీ నష్టం మాత్రం జరుగుతూనే ఉందని వ్యాఖ్యానించారు.
ఇంటర్నెట్, సోషల్ మీడియాలే ఆయుధాలు..
"మానవతావాదానికి ఉగ్రవాదం అనేది ఎప్పటికైనా పెద్ద ముప్పే. 20 ఏళ్లుగా యూఎన్ కౌన్సిల్ దీనిపై పోరాటం చేసేందుకు ఎన్నో ప్రయత్నాలు చేసింది. ఓ ప్రణాళికాబద్ధంగా యుద్ధం కొనసాగిస్తోంది. కొన్ని దేశాల్లో ఉగ్రవాద సంస్థలు ప్రభుత్వం అధీనంలో నడిచే కంపెనీలుగా మారిపోతున్నాయి" అని ఆందోళన వ్యక్తం చేశారు జైశంకర్. అత్యాధునిక టెక్నాలజీల గురించీ ప్రస్తావించారు. వర్చువల్ ప్రైవేట్ నెట్‌వర్క్స్, ఎన్‌క్రిప్టెడ్ మెసేజ్ సర్వీసెస్, బ్లాక్‌చెయిన్స్ లాంటివి మంచే చేస్తున్నప్పటికీ..అవే ప్రభుత్వాలకు సవాలు విసురుతున్నాయని అన్నారు. "ఇవన్నీ గొప్పవే కావచ్చు. కానీ..ఇవే ప్రభుత్వాలకు సవాలుగా మారుతున్నాయి. కొందరు వీటిని అడ్డం పెట్టుకునే సమస్యలు సృష్టిస్తున్నారు. వీటి వల్ల జరిగే నష్టమూ ఎక్కువగానే ఉంటోంది" అని చెప్పారు. టెక్నాలజీ, డబ్బుని అడ్డుగా పెట్టుకుని కొన్ని అరాచక శక్తులు మనపై దాడి చేస్తాయని హెచ్చరించారు. ఇదే సమయంలో సోషల్ మీడియా గురించి కూడా ప్రస్తావించారు. ఇంటర్నెట్, సోషల్ మీడియా ఉగ్రవాదులకు అతి పెద్ద ఆయుధాలుగా మారాయని అన్నారు. విద్వేషాలను రెచ్చగొట్టేందుకు ఉగ్రవాదులు వీటినే వాడుకుంటున్నారని వెల్లడించారు. సోషల్ మీడియా ద్వారానే కుట్రలకూ పాల్పడుతున్నారని చెప్పారు. FATF గ్రే లిస్ట్ ఉండటం వల్లే జమ్ముకశ్మీర్‌లో ఈ మధ్య కాలంలో ఉగ్రదాడులు తగ్గుముఖం పట్టాయని భారత్ ఈ భేటీలో ప్రస్తావించింది. నేరుగా పాకిస్థాన్ పేరు చెప్పకపోయినా...పాక్‌కు చురకలు అంటించింది.
పాక్‌కు ఊరట..
ఉగ్రవాదులకు నిధులు అందిస్తోందన్న ఆరోపణలు ఎదుర్కొంటూ...దాదాపు నాలుగేళ్లుగా Financial Action Task Force (FATF) గ్రే లిస్ట్‌కి పరిమితమైంది పాకిస్థాన్. అప్పటి నుంచి ఆ దేశానికి కష్టాలు మొదలయ్యాయి. తమపై కక్ష కట్టి ఇలా ఇబ్బందులు పెడుతున్నారని పాకిస్థాన్ ఎన్నో సార్లు అసహనం వ్యక్తం చేసింది. ఈ లిస్ట్‌లో ఉన్న దేశానికి IMF రుణం అందించదు. ఆర్థికంగా ఏ దేశమూ సహకారం అందించేందుకు ముందుకు రాదు. ఫలితంగా...నాలుగేళ్లుగా ఆర్థికంగానూ దెబ్బ తింది దాయాది దేశం. ఇన్నాళ్లకు కాస్త ఊరట లభించింది. పారిస్‌లో జరిగిన FATF సమావేశంలో పాకిస్థాన్‌ను Gray List నుంచి తొలగిస్తున్నట్టు ప్రకటించారు. ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న ఆ దేశానికి ఇది పెద్ద రిలీఫ్ ఇవ్వనుంది.
Also Read: Vande Bharat Accident: వందే భారత్ ట్రైన్‌కు మళ్లీ యాక్సిడెంట్, ఆవు ఢీకొట్టి ముందు భాగం డ్యామేజ్