నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో విధులు నిర్వహించేందుకు.. వారిని సమర్థంగా ఎదుర్కోవడానికి తొలి సారి పూర్తి స్థాయిలో మహిళా బృందం ఏర్పాటయింది. ఈ బృందానికి 'దుర్గా ఫైటర్ ఫోర్స్' అని పేరు పెట్టారు. దేశంలో ప్రస్తుతం నక్సల్స్ బెడత అత్యధికంగా ఉన్న ప్రాంతం చత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లా. అక్కడే ఈ బృందాన్ని మోహరిస్తున్నారు.  ఈ 'దుర్గా ఫైటర్ ఫోర్స్' లో మొత్తం 32 మంది ఉన్నారు. ఛత్తీస్‌గఢ్ మహిళా కమెండోలు, జిల్లా రిజర్వ్ ఫోర్స్ కలిసి బృందాన్ని ఏర్పాటు చేశారు. నెల రోజుల పాటు కమెండో శిక్షణ ఇచ్చి.. నక్సల్స్‌ను ఎదుర్కొనేందుకు అడవుల్లోకి పంపనున్నారు. సుక్మాను 'నక్సల్స్ రహిత ప్రాంతంగా' తీర్చిదిద్దుతామని 'దుర్గా ఫైటర్స్' కెప్టెన్ ఆశా సేన్ ధీమా వ్యక్తం చేశారు. రాఖీ రోజున తోబుట్టువులు ఒకరినొకరు కాపాడుకుంటామని వాగ్దానం చేసినట్లుగానే మేమందరం సుక్మా ప్రాంత ప్రజలను నక్సలైట్ల నుండి కాపాడమని ఆశాసేన ఎనలేని ధైర్యం ప్రదర్శించి మరీ ప్రకటించారు.  


చత్తీస్‌ఘడ్‌లోని సుక్మా నకల్స్ కు పెట్టని కోటగా ఉంది. మావోయిస్టులు అక్కడ అటవీ ప్రాంతంపై పూర్తి పట్టు సాధించారు. వారిని అక్కడ నుంచి తరిమేయడానికి భద్రతా బలగాలు చాలా కాలం నుంచి పోరాడుతున్నాయి. పదే పదే భీకర పోరాటాలు జరుగుతూ ఉంటాయి. ఇటీవలి కాలంలో భారీ ఎన్ కౌంటర్లు సుక్మా అడవుల్లో జరిగాయి. సుక్మా అటవీ ప్రాంతంలో గిరిజనులకు ప్రభుత్వం అంటే నక్సలైట్లే. పోలీసులు  ఏజెన్సీ ఏరియాల్లో పోలీసులు ముమ్మర తనిఖీలు, కూంబింగ్​ చేపట్టినప్పటికీ వారి ప్రాబల్యం తగ్గించడం సాధ్యం కావడం లేదు. పోలీసులు, ప్రత్యేక బలగాలు ఎన్ని నిర్బంధాలు విధించినా మావోయిస్టులు సభలు, సమావేశాలు నిర్వహిస్తూనే ఉంటారు. ఇప్పటి వరకూ పురుష బలగానే వారిని ఎదుర్కొనేందుకు పని చేస్తున్నాయి. కొత్తగా దుర్గా ఫైటర్ ఫోర్స్‌ను ఏర్పాటు చేయడంతో  నక్సలైట్లకు చెక్ పెట్టేందుకు కొత్త మార్గాన్ని సృష్టించినట్లయింది.  



ఇటీవలి కాలంలో భద్రతా బలగాల్లో మహిళలకు సమాన అవకాశాలు ఇచ్చే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. సరిహద్దుల్లో యుద్ధాల్లో పాల్గొనే కమెండో శిక్షణ కూడా ఇస్తున్నారు. చివరికి రాఫెల్ యుద్ధ విమానాలను నడిపే పైలట్లు కూడా రెడీ అయ్యారు.  సరిహద్దుల్లోనే కాదు అంతర్గత భద్రతా సమస్యలు పరిష్కరించేలా.. నక్సలైట్లతో పోరాడేందుకు కమెండో స్థాయి శిక్షణను దుర్గా ఫైటర్ ఫోర్స్‌కు ఇస్తారు. మహిళలు తల్చుకుంటే సాధ్యం కానిదేదీ ఉండదని అంటారు. ఈ దుర్గా ఫైటర్ ఫోర్స్ కెప్టెన్ లక్ష్యం ప్రకారం సుక్మా జిల్లాను నక్సలైట్ రహితం చేస్తే.. అంత కంటే మహిళా కమెండోలకు గొప్ప విజయం ఉండదని అనుకోవచ్చు.