Telangana Davos Investments: దావోస్ వేదికగా తెలంగాణకు గతంలో ఎప్పుడూ లేనంత స్థాయిలో పెట్టబడులు వచ్చాయని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. 2023లో కేవలం రూ.20 వేల కోట్ల పెట్టుబడులకు మాత్రమే ఒప్పందాలు జరిగాయని, కానీ ఈ సారి ప్రపంచ ఆర్థిక సదస్సులో రూ.40 వేల కోట్ల మేర పెట్టబడులపై ఒప్పందాలు కుదుర్చుకున్నామని స్పష్టం చేశారు. అంతేకాకుండా, జెడ్డాలో జరిగిన పలు సమావేశాల నేపథ్యంలో  ఒక దిగ్గజ ఫుడ్ ఇండస్ట్రీ తెలంగాణ సంస్థ భారీ స్థాయిలో రెస్టారెంట్లు ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చిందని వెల్లడించారు. 


రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గంలోని కొత్తూరులో ఉన్న జేసీకే హారిజాన్ ఇండస్ట్రీయల్ పార్కు లో జేహ్ ఏరోస్పేస్ సంస్థను సోమవారం (జనవరి 22) నాడు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఐటి శాఖ ముఖ్య కార్యదర్శి జయేస్ రంజన్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు.


సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో దావోస్ లోని ప్రపంచ ఆర్థిక సదస్సుకు వెళ్లిన తమ బృందం  దాదాపు రూ. 40 వేల కోట్ల మేర పెట్టుబడులకు గానూ ఒప్పందాలపై సంతకాలు చేశామని ప్రకటించారు. ఎనర్జీ, ఐటీ, ఏరోస్పేస్, డిఫెన్స్ తదితర రంగాలకు సంబంధించిన పరిశ్రలు తెలంగాణలో పెట్టబడులు పెట్టడానికి ముందుకొచ్చాయని, గత 9 ఏళ్ల కాలంలో ఇంత పెద్ద స్థాయిలో పెట్టబడులకు ఒప్పందాలు చేసుకోవడం ఇదే తొలిసారి అని స్పష్టం చేశారు. 2023లో కేవలం రూ. 20 వేల కోట్ల పెట్టుబడులకు మాత్రమే ఒప్పందాలు జరిగాయని, ఈ సారి పారిశ్రామిక ఫ్రెండ్లీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో వెల్లువలా పెట్టుబడులు వస్తున్నాయన్నారు. మూడు దశాబ్దాల క్రితం అప్పటి  కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న సానుకూల విధానాల వల్ల రాష్ట్రంలో ఐటీ రంగం ఊహించనంత స్థాయికి ఎగబాకిందని, ఐటీ, ఫార్మా రంగాల్లో రాష్ట్రం అగ్రగామిగా నిలిచిందని చెప్పారు.
 
విజన్ తో పనిచేస్తున్నామని, ఏరోస్పేస్ రంగం అభివృద్ధికి తీవ్రమైన కృషి చేస్తున్నామని తెలిపారు. ఎరోస్పేస్ ఉత్పత్తుల తయారీకి అవసరమైన అన్ని సహాయ సహకారాలను ప్రభుత్వం అందిస్తుందని స్పష్టం చేశారు. తయారీని ప్రోత్సహిస్తే డిమాండ్, పంపిణీకి మధ్య వ్యత్యాసం తగ్గుతుందని అభిప్రాయపడ్డారు. అమెరికా, పశ్చిమ యూరోప్ లో ఉన్న ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ తయారీ కేంద్రాలతో పోటీ పడే విధంగా ఏఐ టెక్నాలజీతో స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఫెజలిటీలు భారత్ లో ఉంటాయని వివరించారు.  


అత్యాధునిక సాంకేతికతను ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని తేల్చిచెప్పారు. ఏరోస్పేస్, డిఫెన్స్ పరిశ్రమలు రాష్ట్రంలో మొదట వృద్ది చెందే రంగాలని పేర్కొన్నారు. కాబట్టి ఈ రంగంలో పెట్టుబడులను, ఆవిష్కరణలను ప్రోత్సహిస్తుందని అన్నారు. అనేక మందికి ఉపాధి కల్పిస్తూ జేహ్ ఏరోస్పేస్ సంస్థ విజయం సాధించాలని, రాష్ట్ర ఆర్థిక వృద్ధికి తోడ్పాటును అందించాలని మంత్రి శ్రీధర్ బాబు ఆకాంక్షించారు. స్థానికులకు ఉద్యోగావకాశాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నైపుణ్యాల్లో శిక్షణ ఇస్తుందని తెలియజేశారు. 2.7 మిలియన్ డాలర్లు (రూ.23 కోట్ల) మేర సీడ్ రౌండ్ నిధులు సాధించినందుకు ఆ సంస్థకు అభినందనలు తెలిపారు.