SSMB29 Release Date: టాలీవుడ్ అగ్ర హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ సంక్రాంతికి 'గుంటూరు కారం' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కించిన ఈ సినిమా భారీ అంచనాల నడుమ విడుదలై అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. అయినప్పటికీ సినిమాకి వసూళ్లు భారీగానే వస్తున్నాయి. విడుదలైన వారం రోజుల్లోనే ఈ సినిమా 200 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. ఇక ఈ సినిమా తర్వాత దర్శకధీరుడు ఎస్.ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు ఓ ప్రాజెక్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం అందరి దృష్టి ఈ ప్రాజెక్టుపైనే పడింది.


ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అప్డేట్ కోసం మహేష్ ఫ్యాన్స్ తో పాటు నార్మల్ ఆడియన్స్ సైతం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో సాగే యాక్షన్ అడ్వెంచరస్ డ్రామాగా ఈ సినిమా ఉంటుందని, ఈ మూవీతో రాజమౌళి ఇంటర్నేషనల్ మార్కెట్ను టార్గెట్ చేస్తున్నారనే వార్తలు బయటికి రావడంతో సినిమాపై అంచనాలను భారీగా పెరిగిపోయాయి. ఈ ప్రాజెక్ట్ కోసం మహేష్ 2 సంవత్సరాలు కేటాయించనున్నట్లు తెలుస్తోంది. ఇక ఇటీవలే ఈ సినిమాకి సంబంధించి స్క్రిప్ట్ వర్క్ పూర్తయింది. ఇదే విషయాన్ని ఇటీవల రచయిత విజయేంద్రప్రసాద్ ఓ ఇంటర్వ్యూలో తెలియజేశారు. అంతేకాకుండా ఈ సినిమా కథాంశం ఇండియానా జోన్స్ సిరీస్ ని పోలి ఉంటుందని అన్నారు.


ఈ చిత్రం 'రైటర్స్ ఆఫ్ ది లాస్ట్ ఆర్క్' (1981) తరహాలో అనేక భావోద్వేగాలతో కూడిన అడ్వెంచరస్, యాక్షన్ డ్రామాగా ఉంటుందని, హాలీవుడ్ నటీనటులు కూడా ఈ సినిమాలో భాగం కానున్నట్లు వెల్లడించారు. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించి ఓ అదిరిపోయే అప్డేట్ బయటికి వచ్చింది. అదేంటంటే, మహేష్ బాబు- రాజమౌళి ప్రాజెక్టుని ఈ ఏడాది ఉగాది కానుకగా ఏప్రిల్ 9న పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా లాంచ్ చేయబోతున్నారట. అదే రోజు ఈ ప్రాజెక్టుకు సంబంధించి కీలక అప్డేట్ కూడా ఇవ్వనున్నట్లు తెలుస్తోంది ఇక ఈ అప్డేట్ తో మహేష్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. మరోవైపు ఈ మూవీ టెక్నికల్ వర్క్ కోసం మహేష్ బాబు తాజాగా జర్మనీకి వెళ్లినట్లు వార్తలు వచ్చాయి.


కానీ మహేష్ జర్మనీకి వెళ్ళింది టెక్నికల్ వర్క్ కోసం కాదట. రాజమౌళి సినిమా షూటింగ్ ఎక్కువ భాగం అడవుల్లో ఉంటుంది. సినిమాలో భారీ స్టంట్స్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి మహేష్ కి ఫిట్నెస్ చాలా అవసరం. ఈ ఫిట్నెస్ పై దృష్టి సారించడానికి మహేష్ జర్మనీలో ఓ ఫిట్నెస్ ఎక్స్పర్ట్ ని కలిసేందుకు వెళ్లారు. ఆయన వద్ద కొద్దిరోజులు ట్రైనింగ్ తీసుకోబోతున్నట్లు సమాచారం. ఈ సినిమా కోసం సుమారు 1000 నుంచి 1200 కోట్ల బడ్జెట్ ని కేటాయిస్తున్నట్లు తెలుస్తోంది ఓ హాలీవుడ్ సంస్థతో కలిసి సీనియర్ నిర్మాత కె.ఎల్ నారాయణ ఈ ప్రాజెక్టుని నిర్మించనున్నారు.


Also Read : ప్రభాస్ 'కల్కి'లో మలయాళ బ్యూటీ - నాగ్ అశ్విన్ గట్టిగానే ప్లాన్ చేసినట్లున్నాడుగా!